మొండి బాకీల రద్దులో మోదీ సర్కార్ రికార్డ్.. 25 లక్షల కోట్ల రద్దు

- ఆర్టీఐ దరఖాస్తుకు ఆర్‌బీఐ జవాబు
- యూపీఏ హయాంలో 3.76 లక్షల కోట్ల రద్దు
- 810 శాతం అధికంగా మోదీ సర్కార్ కరుణ
- బ్యాంకుల్లో వేలకోట్ల రుణాలు తీసుకుని
- ఎగ్గొడుతున్న కార్పొరేట్ కంపెనీలు
- వాటిని మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
- ఫలితంగా మునుగుతున్న బ్యాంకులు
- జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకత
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పరిపాలనా కాలంలో దాదాపు 25 లక్షల కోట్ల మొండి బకాయిలను కేంద్రం రద్దు చేసింది. సూరత్‌కు చెందిన ఒక ఆర్టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే.. ఆర్‌బీఐ ఈ మేరకు ఇటీవల సమాచారం ఇచ్చింది. విశేషం ఏమిటంటే.. గత రెండు పర్యాయాల యూపీఏ ప్రభుత్వాలతో పోల్చితే.. మోదీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో మొండి బకాయిలను రద్దు చేసింది. అంటే.. బ్యాంకులు ఇచ్చిన అప్పులు.. వాటి రికార్డు నుంచి తొలగిపోయి.. ఎన్‌పీఏలుగా మిగిలిపోతాయి. ఈ రకంగా 2004 నుంచి 2014 మధ్యకాలంలో యూపీఏ ప్రభుత్వం 3.76 లక్షల కోట్ల రూపాయల మొండిబకాయిలను రద్దు చేయగా.. 2014 నుంచి ఇప్పటి వరకూ మోదీ ప్రభుత్వం 25 లక్షల కోట్ల రూపాయలను రద్దు చేసింది. అంటే.. యూపీఏ రెండు ప్రభుత్వాలతో పోల్చితే తొమ్మిదేళ్ల మోదీ సర్కారు 810 శాతం అధికంగా మొండి బకాయిలను రద్దు చేయడం గమనార్హం. కేంద్రం పార్లమెంటులో ప్రకటించినదానికంటే ఇది అధికం. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులవి 10.41 లక్షల కోట్లు, మరో 14.53 లక్షల కోట్లు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు సంబంధించినవి ఉన్నాయి. వీటిలో కేవలం పదిశాతాన్ని మాత్రమే ఆయా బ్యాంకులు రికవరీ చేసుకోగలిగాయి. ఆర్బీఐ సమాధానాన్ని పరిశీలిస్తే.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏటా 34,192 కోట్ల చొప్పున మొండిబకాయిలు రద్దు చేస్తే.. మోదీ పాలనా కాలంలో ఏటా 2.72 లక్షల కోట్ల రుణాలు రద్దయిపోయినట్టు తెలుస్తున్నది.
గతేడాది ఆగస్ట్‌లో ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కే కరాద్ రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. 2017 నుంచి 2022 మధ్య ఐదేళ్లలో 9.91 లక్షల కోట్ల రుణాలు రద్దు చేసినట్టు తెలిపారు. 2.36 లక్షల కోట్లు 2018-19లో రద్దు చేయగా.. 2020-21లో 2.02 లక్షల కోట్లు, 2021-22లో 1.57 లక్షల కోట్లు రద్దు చేశారు. 2017-18లో 1.61 లక్షల కోట్లు రద్దు చేశారు. మొత్తంగా మార్చి 2022 నాటికి ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టినవారి సంఖ్య 10,306గా ఉన్నదని కరాద్ తన సమాధానంలో తెలిపారు.
లక్షల కోట్ల కార్పొరేట్ రుణాల మాఫీ అంశం ప్రత్యేకించి ఎన్నికల వేళ ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను కార్పొరేట్లు దోచుకుని విదేశాలకు పారిపోతుంటే.. బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. ఆ భారం తిరిగి ఖాజానాపైనే పడుతున్నది. ఈ మధ్యకాలంలో ఇలా వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోతున్న కార్పొరేట్ దిగ్గజాల సంఖ్య పెరుగుతున్నది. ఇదంతా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారి తీస్తున్నది. అందులోనూ సదరు కార్పొరేట్ యజమానులు.. కేంద్రంలో అధికార పార్టీ అండతోనే చెలరేగుతున్నారనే అభిప్రాయాలు సర్వత్రా ఉన్నాయి.