PM Modi | మోదీ.. ప్రజాస్వామ్యం ఏదీ?

Modi | మా నరనరాన ప్రజాస్వామ్యం ప్రవహిస్తున్నది. మా డీఎన్‌ఏలోనే ప్రజాస్వామ్యం ఉన్నది.. అంటూ అమెరికాలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానంగా చెప్పారు. కులం, మతం, వర్గం పేరిట వివక్ష లేనే లేదన్నారు. రాజ్యాంగంలో రాసుకున్న ప్రజాస్వామిక సూత్రాలను తమ ప్రభుత్వం అనుసరిస్తున్నదని చెప్పకొచ్చారు. అసలు మానవత్వం, మానవ విలువలు, మానవ హక్కులు లేని దేశం ప్రజాస్వామ్యమే కాదని కూడా చెప్పారు. అయితే.. ప్రపంచంలో అతిపురాతన ప్రజాస్వామ్య దేశంలో నిలబడి మోదీ చెప్పిన ఈ […]

  • By: krs    latest    Jun 24, 2023 7:41 AM IST
PM Modi | మోదీ.. ప్రజాస్వామ్యం ఏదీ?

Modi |

మా నరనరాన ప్రజాస్వామ్యం ప్రవహిస్తున్నది. మా డీఎన్‌ఏలోనే ప్రజాస్వామ్యం ఉన్నది.. అంటూ అమెరికాలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానంగా చెప్పారు. కులం, మతం, వర్గం పేరిట వివక్ష లేనే లేదన్నారు. రాజ్యాంగంలో రాసుకున్న ప్రజాస్వామిక సూత్రాలను తమ ప్రభుత్వం అనుసరిస్తున్నదని చెప్పకొచ్చారు. అసలు మానవత్వం, మానవ విలువలు, మానవ హక్కులు లేని దేశం ప్రజాస్వామ్యమే కాదని కూడా చెప్పారు.

అయితే.. ప్రపంచంలో అతిపురాతన ప్రజాస్వామ్య దేశంలో నిలబడి మోదీ చెప్పిన ఈ మాటల్లో నిజమెంత? మోదీ ప్రపంచ దేశాల వేదికలపై చెప్పేదానికి, దేశంలో జరుగుతున్న దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉన్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తాము ఎలాంటి వివక్ష చూపలేదని చెప్పడం ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నమేనని చెబుతున్నారు.

అప్పటికీ మోదీని ఒక్క ప్రశ్న మాత్రమే అడగాలనే షరతు కూడా పెట్టారు. కానీ.. ఆ వచ్చిన ప్రశ్న మాత్రం మామూలుది కాదు. ప్రస్తుతం భారతదేశంలో మత విద్వేషం పెంచడం అనేది ఒక ఎజెండా ప్రకారం సాగుతున్నది. అనేక మాధ్యమాల ఆధారంగా దూకుడు ప్రదర్శిస్తున్నది. జై శ్రీరాం అనని వారంతా దేశ ద్రోహులే అన్నంత స్థాయిలో మౌఢ్యం పెచ్చరిల్లుతున్నది. ఈ సమయంలో సబ్రినా సిద్ధిఖి అనే మహిళా రిపోర్టన్‌ నుంచి గట్టి ప్రశ్నే వచ్చింది.

‘భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. మైనారిటీల పట్ల మీరు వివక్ష చూపిస్తున్నారని, విమర్శకుల నోరు మూయిస్తున్నారని అక్కడి మానవ హక్కుల సంఘాలు అంటున్నాయి. మైనార్టీల హక్కుల రక్షణకు, వాక్‌ స్వేచ్ఛ పరిరక్షణకు ఏం చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు?’ అని ప్రశ్నిస్తే.. అసలు అలాంటి ప్రసక్తే లేదని, ఆల్‌ ఈజ్‌ వెల్‌ అని దాటవేశారు.

మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ చోటు చేసుకున్న.. చోటు చేసుకుంటున్న కొన్ని అప్రజాస్వామిక ఘటనలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. దేశంలో మెజారిటీ ప్రజల భావోద్వేగాలను మోదీ ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూనే వచ్చారు. అదే సమయంలో మానవ హక్కులపై జరిగే దాడులపై మౌనం వహించారు. నిజానికి అనేక అంశాలకు సంబంధించి మోదీపై విమర్శలు ఉన్నా.. మోదీ వైట్‌హౌస్‌లో మాట్లాడిన అంశాలకు వరకు పరిమితమై పరిశీలిస్తే.. ఆయన వ్యాఖ్యల్లోని డొల్లతనం బయటపడుతుంది.

ఎల్గార్‌ పరిషద్‌ కేసు

జీవితకాలం పౌర హక్కుల ఉద్యమాల్లో పనిచేస్తూ, అన్ని రకాల వివక్షలను వ్యతిరేకిస్తూ వచ్చిన 16 మంది ఉద్యమకారులను ఎల్గార్‌పరిషద్‌ కేసులో అరెస్టు చేసి ఐదేళ్లు గడిచిపోయాయి. వారింకా జైల్లోనే మగ్గుతున్నారు.

ఒక నిరసన కార్యక్రమాన్ని రాజద్రోహంగా చిత్రీకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ.. వారిపై అత్యంత క్రూరమైన ఉపా కింద కేసులు పెట్టిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్లయినా అభియోగాలను నిరూపించేందుకు ఒక్కటంటే ఒక్క సాక్ష్యాన్ని కూడా ఎన్‌ఐఏ సమర్పించలేక పోయింది. ఇప్పటికీ ఈ కేసులో అసలైన విచారణ మొదలే కాలేదు. అయినా.. ఉపా వంటి చట్టంలోని తీవ్ర సెక్షన్లను ఆధారం చేసుకుని వారిని బయటకు రానీయకుండా జైల్లోనే ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం సఫలమైందన్న విమర్శలు ఉన్నాయి.

అరెస్టయినవారిలో నలుగురు అధ్యాపకులు, ముగ్గురు న్యాయవాదులు, ఇద్దరు స్వతంత్ర జర్నలిస్టులు, ఒక సంఘం నాయకుడు.. సామాజిక కార్యకర్త, ఒక కవి, ముగ్గురు కళాకారులు, ఒక మతబోధకుడు ఉన్నారు. ఇందులో మతబోధకుడు జైల్లోనే మరణించాడు. వీరంతా వేర్వేరు రంగాల్లో పనిచేసేవారైనా.. మోదీ ప్రభుత్వ మెజారిటీవాద వ్యవహారాలను సూటిగా విమర్శించినవారే కావడం గమనార్హం.

మీడియాపై అణచివేత

మీడియాపై మోదీ ప్రభుత్వం అనుసరించినంత అణచివేత మరే ప్రభుత్వంలోనూ కనిపించదేమో. బలవంతంగా మీడియా గొంతును నులమడమే కాకుండా.. సమాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక అంశాలను అధికార దర్పాన్ని ఉపయోగించి తొలగించిందన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల ట్విట్టర్‌ మాజీ సీఈవో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఆఖరుకు తనపై నిత్యం విమర్శలు చేసే కొన్ని మీడియా సంస్థల్లో తనవారితో వాటాలు కొనిపించేసి.. వాటిని సైతం తన అనుకూల ప్రచార సాధనాలుగా మార్చేసుకున్న ఉదంతాలు చూశాం.

గత తొమ్మిదేళ్ల కాలంలో భారతదేశ పత్రికాస్వేచ్ఛ ర్యాంకు నానాటికీ దిగజారుతూ వచ్చింది. మొత్తం 180 దేశాల వివరాలు తీస్తే.. మన దేశం స్థానం 161. అందులోనూ గత ఏడాదితో పోల్చితే ఏకంగా 11 ర్యాంకులు కిందకు జారిపోయింది. లాక్‌డౌన్‌లో మీడియాపై జరిగిన దాడులు, విరిగిన లాఠీలు లెక్కలేదు. కానీ.. మోదీ మాత్రం అమెరికాలో మాట్లాడుతూ అత్యున్నత ప్రజాస్వామ్య విలువల గురించి జబ్బలు చరుచుకున్నారు.

మైనార్టీలపై వ్యవస్థీకృత హింస

మోదీ పాలనలో మైనార్టీ వర్గాలు వ్యవస్థీకృత హింసకు గురయ్యాయనే అభిప్రాయాలు ఉన్నాయి. 2014 తర్వాత ముస్లింలు, క్రిస్టియన్లపై హిందూ సంస్థల దాడులు పెరిగాయనేందుకు అనేక నిదర్శనాలు ఉన్నాయి. ముస్లింలు ఊచకోతకు గురైన వార్తలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. గోవధను నిరోధించే పేరుతో హత్యకు గురైనవారంతా ముస్లింలే. దానికి తోడు బీజేపీ నాయకులు, మంత్రులు తరచూ ముస్లింలకు వ్యతిరేకంగా సెంటిమెంట్లను రెచ్చగొట్టడం తెలిసిందే. ఎలాంటి శషభిషలు లేకుండా మోదీ ప్రభుత్వం తన మెజారిటీవాదాన్ని బాహాటంగానే ప్రదర్శించుకుంటూ విధానాలు కూడా రూపొందించింది.

బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ.. హిందూత్వ గ్రూపులు శతాబ్దాల నాటి మసీదును నేలమట్టం చేయడం అక్రమం అని పేర్కొంది. కానీ.. అదే కోర్టు హిందూ గ్రూపులకే ఆ స్థలాన్ని అప్పగించింది. సుప్రీం కోర్టు తీర్పును ప్రభుత్వం పండుగలా చేసుకున్నది. జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దు వంటి అనేక అంశాలు బీజేపీ మెజారిటీమతవాదాన్ని రుజువు చేస్తాయి. ఆఖరుకు బీజేపీలో ఒక్కరంటే ఒక్క ముస్లిం ఎంపీ లేకపోవడం ప్రస్తావనార్హం. నిజానికి ముస్లింలకు టికెట్లు ఇవ్వడానికి బీజేపీ ఇష్టపడేలేదన్న వాదనలు ఉన్నాయి.

ప్రతిపక్షాలపై దాడులు

భారతదేశ అత్యున్నత ప్రజాస్వామిక విలువల గురించి ఓ వైపు మోదీ మాట్లాడుతుంటే.. బీహార్‌ ఆర్థిక మంత్రి విజయ్‌కుమార్‌ చౌదరికి దగ్గరి బంధువు నివాసంలో ఈడీ సోదాలు జరుగుతుంటాయి. అందులోనూ ఇదే బీహార్‌ రాజధాని పాట్నాలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల సమావేశం జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష నేత నివాసంలో సోదాలు చేయించడం ఏం సంకేతాలనిస్తున్నది?

ఇదే కాదు.. గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రతిపక్ష నేతల నివాసాలపై పెద్ద ఎత్తున సోదాలు చేశాయి. దర్యాప్తు పేరిట అనేక వేధింపులకు గురి చేశాయి. కానీ.. ఒక్క బీజేపీ నాయకుడిపైనా ఇటువంటి తనిఖీలు జరిగిన సందర్భాలు కనిపించవు. మరో విశేషం.. బీజేపీతో సఖ్యంగా ఉంటేనో.. లేదా బీజేపీలో చేరితేనో ఎలాంటి సమస్యలు ఉండవు.

మానవ హక్కుల కార్యకర్తలపై దాడులు

మానవ హక్కుల ఉద్యమకారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తున్నదో ఎల్గార్‌ పరిషద్‌ కేసు నిలువెత్తు నిదర్శనం. ఇదే కాకుండా.. అనేక ఉదంతాలు మోదీ మాటల్లోని డొల్లతనాన్ని పట్టి చూపుతాయి. ఢిల్లీ అల్లర్లలో రెండు పక్షాలు గొడవ పడితే.. కేసులు మాత్రం ఒక వర్గంపైనే నమోదవడం గమనార్హం. మూడేళ్లు గడిచిపోయినా తర్వాత కూడా.. ఆనాడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఏ హిందూ సంస్థ నాయకుడిపైనా ఏ ఒక్క కేసు కూడా పడలేదు.

కానీ.. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించిన విద్యార్థులు ఉమర్‌ ఖలీద్, గుల్ఫిషా ఫాతిమా, షర్జీల్‌ ఇమామ్‌, నటాషా నర్వాల్‌పై చార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో ముగ్గురు ఉపా చట్టం కింద జైల్లోనే ఉన్నారు. ప్రపంచ స్థాయిలో భారత ప్రతిష్ఠను మంటగల్పుతున్నారనేది వారిపై అభియోగం. కానీ.. పోలీసులు మాత్రం అందుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టుల పెట్టినందుకు అనేకమందిపై కేసులు పెట్టారు. బీజేపీకి వ్యతరేకంగా ఉంటే చాలు.. అతడు అరెస్టుకు అర్హుడు అన్న వాతావరణ నెలకొన్నది.

నిఘా నిఘా నిఘా..

ఇటీవల పెగాసస్‌ వివాదం రేపిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. పెగాసస్‌ అనేది ఇజ్రాయెల్‌ కంపెనీ తయారు చేసిన నిఘా స్పైవేర్‌. ఈ ఆరోపణలపై మోదీ సర్కారు మౌనం దాల్చింది. దాదాపు 174 మంది ఫోన్లలో ఈ స్పైవేర్‌ను మోదీ ప్రభుత్వం రహస్యంగా ఇన్‌స్టాల్‌ చేసిందని ఒక నిజనిర్ధారణ కమిటీ పేర్కొన్నది. అందులో రాజకీయ నాయకులతోపాటు జడ్జీలు, మంత్రులు, జర్నలిస్టులు, సైంటిస్టులు, వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నారని సమాచారం. దేశంలో పరిస్థితులు ఇలా ఉంటే మోదీ మాత్రం ప్రజలంతా తమ పాలన పట్ల ఆహా ఓహో అంటున్నారన్న స్థాయిలో మాట్లాడటం.. నిజంగా ప్రపంచాన్ని తప్పుదారి పట్టించడమే!