రక్తంతో మోదీ చిత్రం..! దేశ భక్తికి సంకేతమా?
పిల్లల్లో దేశ భక్తిని నింపేందుకే రక్తంతో పెయింటింగ్స్ విధాత: రక్తం బలమైన ప్రతీక. పోరాటానికీ, త్యాగానికీ సంకేతం. అలాంటి రక్తంతో చిత్రలేఖనం, పెయింటింగ్స్ వేయటం చర్చనీయాంశం అవుతున్నది. అది చాలక రక్తంతో మోదీ చిత్రాన్ని గీసి దాన్ని దేశభక్తిగా చెప్పటం వివాదాస్పదం అవుతున్నది. ఢిల్లీకి చెందిన షహీద్ స్మృతి చేతన సమితి అనే స్వచ్ఛంద సంస్థ గత పదేండ్లుగా రక్తంతో పెయింటింగ్స్ వేయిస్తూ ఆధ్యాత్మిక క్షేత్రాలు, మ్యూజియంలకు ఆ చిత్రాలను బహూకరిస్తున్నది. ఈ రక్త రేఖాచిత్రాలకు స్వచ్ఛందంగా […]

- పిల్లల్లో దేశ భక్తిని నింపేందుకే రక్తంతో పెయింటింగ్స్
విధాత: రక్తం బలమైన ప్రతీక. పోరాటానికీ, త్యాగానికీ సంకేతం. అలాంటి రక్తంతో చిత్రలేఖనం, పెయింటింగ్స్ వేయటం చర్చనీయాంశం అవుతున్నది. అది చాలక రక్తంతో మోదీ చిత్రాన్ని గీసి దాన్ని దేశభక్తిగా చెప్పటం వివాదాస్పదం అవుతున్నది.
ఢిల్లీకి చెందిన షహీద్ స్మృతి చేతన సమితి అనే స్వచ్ఛంద సంస్థ గత పదేండ్లుగా రక్తంతో పెయింటింగ్స్ వేయిస్తూ ఆధ్యాత్మిక క్షేత్రాలు, మ్యూజియంలకు ఆ చిత్రాలను బహూకరిస్తున్నది. ఈ రక్త రేఖాచిత్రాలకు స్వచ్ఛందంగా రక్తం ఇచ్చే వారి నుంచే సేకరించి పెయింటింగ్స్ వేస్తున్నారు.
ఇప్పటిదాకా వందకు పైగా చిత్రాలను రక్తంతో వేసినవి వివిధ చోట్ల ప్రదర్శనకు పెట్టారు. మొదట రక్తంతో చిత్రాలను ప్రారంభించింది రవిచందర్ గుప్తా. రిటైర్డ్ టీచర్ అయిన గుప్తా పిల్లల్లో దేశ భక్తిని నింపటం కోసమే రక్తంతో దేశ భక్తుల చిత్రాలను గీయిస్తున్నానని తెలిపారు.
ఇప్పుడు ప్రేమ్‌కుమార్ శుక్లా దాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తాన్ని ఇస్తే దానికి యాంటీ కాగ్యులెంట్స్(రక్తం గడ్డ కట్టకుండా ఉండేందుకు కలిపే రసాయనం) కలిపి దాన్ని చిన్న చిన్న సీసాల్లో నింపి పెయింటింగ్స్‌కు వినియోగిస్తారు. 100 మిల్లీలీటర్ల రక్తం రెండు, మూడు పెయింటింగ్స్ కు సరిపోతుందని అంటున్నారు.
అయితే.. పిల్లల్లో దేశ భక్తిని నింపటానికి రక్తంతో గీసిన బొమ్మలనే వాడాలా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతన్నది. అందునా… ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఈ రక్తంతో గీసిన చిత్రాలను ఉంచుతున్నారట! దేశభక్తిని, స్ఫూర్తిని నింపటానికి ఇంతటి హింసాత్మకమైన పద్ధతి ఎంచుకోవాలా.. అనేదే ఇప్పటి చర్చ.
సాధారణంగా.. ఎరైనా తమ తీవ్రమైన ఆకాంక్షను, భావావేశాన్ని వ్యక్తీకరించటానికి రక్తాన్ని వాడుతారు. అందులో ప్రేమలేఖలు, నిరసన లేఖలు ఉన్నాయి. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల కోసం ఎన్నో సందర్భాల్లో పాలకులకు రక్తంతో రాసిన లేఖలను పంపిన ఉదంతాలెన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రధాని మోదీ బొమ్మను రక్తంతో వేసి దేశ భక్తి అనటమే విషాదం.