బ్రిటీషును తలపిస్తున్న మోడీ పరిపాలన: మంత్రి జగదీశ్ రెడ్డి
విధాత, నల్లగొండ: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అద్భుతమైన నాగరికత నిర్మించుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు ప్రాంగణంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజోత్సవ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా తెలంగాణ సంస్కృతిని చాటే పద్ధతిలో కొత్త తరానికి చూపించే ప్రదర్శన ఉండాలని ఉత్సవాలు […]

విధాత, నల్లగొండ: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అద్భుతమైన నాగరికత నిర్మించుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సద్దల చెరువు ప్రాంగణంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజోత్సవ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా తెలంగాణ సంస్కృతిని చాటే పద్ధతిలో కొత్త తరానికి చూపించే ప్రదర్శన ఉండాలని ఉత్సవాలు నిర్వహించినట్లు చెప్పారు. అందులో భాగంగానే గత మూడు రోజులుగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ అమరులకు జోహార్లు అర్పించుకుంటున్నామని, భుజం భుజం కలిపి పోరాటం చేసి మన ముందే ఉన్న పెద్దలను గౌరవించుకోవడం అభినందనీయమన్నారు.

ఉద్యమాన్ని ఉత్తేజ పర్చడానికి ప్రయత్నాలలో భాగంగా దానిని ఇప్పటి తరానికి చూపిస్తూ కళా ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అహింస తోటే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని గుర్తు చేశారు. ప్రాచీన కాలం నుండి గొప్పగా వెలిగిన దేశం, చారిత్రాక సాంస్కృతిక వారసత్వాన్ని కల్గి ఉన్న దేశం ఎందుకు పరాయి పాలనలోకి వెళ్లిందో ఆలోచించాలన్నారు.
చిన్న చిన్న దేశాలైన డచ్, ఫ్రెంచ్, ఫోర్చుగ్రీస్, బ్రిటన్ లాంటివి ఆక్రమణకు అనుకూలించిన పరిస్థితులు గమనించాలన్నారు. కుల వ్యవస్థ, అర్ధం పర్ధం లేని ఆలోచనలతో దేశం పరాయి పాలనలోకి వెళ్లిందన్నా రు. ఆనాడు మహానుబావుడు మహాత్మా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రారంభించారని, అహింసతో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని తెలిపారు.

దేశ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో తెలంగాణలో రైతులు, ప్రజలు సాయుధ పోరాటాలతో మా భూములపై మాకు హక్కులు ఉండాలని పోరాటం సాగించారని, ఆ పోరాటంలో మూడు వేల మంది అమరులయ్యారని వివరించారు. రైతులు, ప్రజలు భూ స్వాముల నుండి విముక్తి పొందారని వెల్లడించారు. నెహ్రూ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నిజాం స్వయంగా లొంగి పోయి హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో కలిపారని పేర్కొన్నారు.
ప్రజలు అణచివేతకు గురవుతున్నారని, చదువుకు దూరంగా ఎన్నో వర్గాలు ఉన్నాయని, చదువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రపంచాన్ని చదివిన అంబేద్కర్ కు రాజ్యాంగం లిఖించే అవకాశం ఇవ్వడం జరిగిందని, సమాజంలో ప్రజలకు ఎలాంటి హక్కులు ఇవ్వాలి, ఎవరికి న్యాయం జరగాలి అని ఆలోచించి నాగరిక సమాజం వైపు తీసుకెళ్లే విధంగా అంబేద్కర్ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారని కొనియాడారు.

బీజేపీ పాలనలో మళ్లీ దేశం తిరోగమన శక్తుల చేతుల్లోకి వెళ్తుందని, దుష్పరిణామాలు జరుగుతున్నాయని గుర్తించిన ప్రజలు కేంద్రంలో ని బిజెపి పరిపాలనను పెకిలించే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. చరిత్రను మార్చి తప్పుగా చిత్రీకరిస్తూ స్వేచ్ఛా స్వాతంత్య్రం కొరకు జరిగిన పోరాటాన్నిరెండు మతాల మధ్య చిచ్చుగా పెట్టడం దురదృష్టకరమన్నారు. చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా యువతకు అందించాలన్నారు.
అంబేద్కర్ కన్న కలలను కెసిఆర్ సాకారం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారని ఆనాడే మహాత్మా గాంధీ కితాబిచ్చారని గుర్తు చేశారు. దుర్మార్గమైన పాలనతో ప్రజలకు చిచ్చులు పెట్టాలని చూస్తున్న బిజెపికి తగిన గుణపాఠం తప్పదన్నారు.అద్భుతంగా నిర్మించుకున్న నాగరికత ఈ సమాజాన్ని ముందుకు నడిపించడానికి తోడ్పడుతుందన్నారు. శాంతియుత వాతావరణం లేని చోట అభివృద్ధి ఉండదని అన్నారు. అనంతరం కవులు, కళాకారులను సన్మానించారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితా ఆనంద్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్, మున్సిపల్ కమీషనర్ సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్ర నాటకం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
