వరంగల్ బీఆర్ఎస్‌లో చిచ్చురేపిన లోక్‌సభ సీటు!

వరంగల్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్య పేరును బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఇంతకాలం పార్టీలో ఉన్న

వరంగల్ బీఆర్ఎస్‌లో చిచ్చురేపిన లోక్‌సభ సీటు!
  • కడియం కావ్య అభ్యర్థిత్వంపై ఉద్యమ నేతల మండిపాటు
  • పసునూరి దయాకర్ నారాజ్
  • మాజీ ఎమ్మెల్యే అరూరి ఔట్
  • ఇప్పటికే పార్టీ వీడిన రాజయ్య
  • తీవ్ర అసంతృప్తిలో మాదిగ నేతలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్య పేరును బీఆరెస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఇంతకాలం పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో సమైక్య పార్టీలో ఉంటూ ద్రోహం చేసిన కడియం శ్రీహరి ప్రస్తుతం ఆ పార్టీని బ్లాక్ మెయిల్ చేసి తన బిడ్డకు ఎంపీ టికెట్ వచ్చే విధంగా కేసిఆర్‌పై ఒత్తిడి చేసి విజయవంతం అయ్యారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కావ్యకు టికెట్ కేటాయించడం పట్ల శ్రీహరి అనుకూల వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కానీ మిగిలిన వర్గాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయి.

కడియం బ్లాక్‌మెయిల్‌తోనే కావ్యకు టికెట్‌!

హనుమకొండ సుబేదారిలోని బీఆరెస్‌ పార్టీకి చెందిన ఓ నేత స్వగృహంలో లోక్‌సభ టికెట్‌ను ఆశించిన బీఆర్ఎస్‌ ఆశావహులు, ఉద్యమ నేతలు గురువారం భేటీ అయ్యారు. వారిలో మాజీ కార్పొరేటర్‌లు, బీఆర్ఎస్‌ రాష్ట్ర నేతలు, చింతల యాదగిరి, బోడ డిన్న, జోరిక రమేష్, బండి రజినికుమార్, బొల్లికొండ వీరేందర్, నేతలు బుద్దే వెంకన్న, పొలపల్లి రామ్మూర్తి తదితరులు ఉన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి కడియం శ్రీహరి తమను ఆహ్వానించకుండా అవమానించారని పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నాటి సమావేశంలో ఉద్యమ కారుల ప్రస్తావన కొంత మంది నేతలు తీసుకొచ్చి ఎంపీ సీటు కేటాయించాలని కోరారని, కానీ కడియం శ్రీహరి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తలొగ్గి కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వాపోయారు. కడియం శ్రీహరి కుట్రలకు తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్‌ బలి అయ్యారని, వారు పార్టీ వీడి వెళ్లిపోయారని అన్నారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌ను కూడా కడియం బలి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ పునరాలోచించాలని, లేకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు ఉనికి కష్టమని స్పష్టం చేశారు. పార్టీలో కనీసం సభ్యత్వం లేని, ఉద్యమంలో కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని కడియం కావ్యకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఒకే కుటుంబానికి రెండు పదవులు ఎలా ఇస్తారని నిలదీశారు. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో వెయ్యి ఓట్లు లేని బైండ్ల సామాజిక వర్గానికి టికెట్ కేటాయించి, మాల, మాదిగలను అవమానించారని అన్నారు. దళితుడిగా చెలామణి అవుతున్న కడియం శ్రీహరి దళిత జాతికి ఒరగబెట్టింది ఏమీ లేదని, తన కూతురి కోసం బ్లాక్ మెయిల్ చేసి టికెట్ ఇప్పించుకున్నాడని అన్నారు. అస్సలు కడియం కావ్య ఎస్సీ కాదు, పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని మతాంతర వివాహమాడిందని చెబుతున్నారు. ఎస్సీ రిజర్వుడ్ వరంగల్ లోక్‌సభ సీటును నిజమైన ఎస్సీ నాయకుడికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కడియం శ్రీహరి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని జిల్లాలో ఎదగనీయకుండా చేసిన దళిత దొర అని అభివర్ణించారు. రెండు మూడు రోజుల్లో తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

పక్క చూపులు చూస్తున్న పసునూరి

వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తనకు మరోసారి టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు ఆయన అనుచరుల ద్వారా తెలుస్తున్నది.

పార్టీకి జలక్ ఇచ్చిన ఆరూరి

నిన్నటి వరకు బీఆర్ఎస్‌ అధిష్ఠానం రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ, అధినేత కేసిఆర్ హామీని సైతం లక్షపెట్టకుండా బీజేపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ ఢిల్లీకి వెళ్లడం గులాబీ నేతలకు ఒకింత షాక్ ఇచ్చింది. తమతో కలిసి ఉంటూనే బీజేపీతో అంటకాగడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక రోజంతా ఆరూరి రమేశ్‌ విషయంలో హైడ్రామా నెలకొన్నప్పటికీ తెల్లవారేసరికి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లడం గులాబీ వర్గాలను కలవరపరిచింది.

అంతకుముందే తాటికొండ ఔట్

స్టేషన్ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు గత ఎన్నికల్లో టికెట్ రాకుండా కడియం శ్రీహరి అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కడియం టికెట్ దక్కించుకోవడమే కాకుండా.. విజయం సాధించారు. అనంతర పరిణామాల్లో రాజయ్య బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ వైపు ప్రయాణిస్తున్నారు.

ముగ్గురూ మాదిగ సామాజిక వర్గం నాయకులే

ఒక్క టికెట్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కావ్యకు టికెట్ ప్రకటించడానికి ముందే డాక్టర్ రాజయ్య పార్టీని వీడారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి అసంతృప్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి బిజెపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. తెరవెనుక ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ హస్తం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురూ మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, టికెట్ లభించిన డాక్టర్ కావ్య మాదిగ ఉపకులానికి చెందిన మహిళ కావడం గమనార్హం.