కోమటిరెడ్డి సయోధ్య!.. నిలకడే డౌటు!
విధాత: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టకేలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో విభేదాలకు స్వస్తి పలికి గాంధీభవన్‌కి వెళ్లి మరీ సయోధ్య మంత్రం పాటించడం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో జోష్ తెచ్చింది. నిన్నటి దాకా రేవంత్ రెడ్డితో నెలకొన్న విభేదాలతో ఆయన నాయకత్వంపై తిరుగుబాటు లేపి రేవంత్ హఠావో కాంగ్రెస్ బచావో అన్న సీనియర్లకు వంత పాడిన వెంకట రెడ్డి అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడం సొంత కేడర్‌ను […]

విధాత: మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టకేలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో విభేదాలకు స్వస్తి పలికి గాంధీభవన్‌కి వెళ్లి మరీ సయోధ్య మంత్రం పాటించడం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో జోష్ తెచ్చింది. నిన్నటి దాకా రేవంత్ రెడ్డితో నెలకొన్న విభేదాలతో ఆయన నాయకత్వంపై తిరుగుబాటు లేపి రేవంత్ హఠావో కాంగ్రెస్ బచావో అన్న సీనియర్లకు వంత పాడిన వెంకట రెడ్డి అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడం సొంత కేడర్‌ను సైతం ఆశ్చర్య పరిచింది.
తనపై హోంగార్డు.. బీజేపీ కోవర్ట్ అంటూ తీవ్ర విమర్శలు చేసిన రేవంత్‌తో నెలకొన్న వైరం.. అధిష్టానం రేవంత్ కు వంతపాడేలా.. తనకు షో కాజ్ జారీ చేయడం వంటి పరిణామాల క్రమంలో రేవంత్ రెడ్డితో వెంకటరెడ్డి ఇక కలవబోరని తన సోదరుడి బాటలోనే బీజేపీలోకి వెళ్తారంటూ మెజార్టీ కాంగ్రెస్ వాదులు సైతం భావించారు.
దీనికి ఊతమిచ్చేలా దిగ్విజయ్ సింగ్ వంటి ఏఐసీసీ దూత వచ్చినా గాంధీ భవన్ మెట్లు ఎక్కకపోవడం, ఎన్నికలప్పుడే తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెబుతానంటూ వెంకటరెడ్డి గందరగోళ వ్యాఖ్యలు చేయడంతో అసలు ఆయన కాంగ్రెస్‌లో ఉంటారో లేదో అన్న సందేహాలు ఆ పార్టీ కేడర్‌లో అధికమయ్యాయి.
MP కోమటిరెడ్డిని సస్పెండ్ చేయాలి: కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
వీటన్నిటికీ బ్రేక్ వేస్తూ శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే రాక సందర్భంగా గాంధీభవన్‌కి వెళ్లిన వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డితో భేటీ కావడం.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు అంతా కలిసి నడువాలంటూ సుద్దులు చెప్పడం సగటు కాంగ్రెస్ కార్యకర్తలను సైతం విస్మయ పరిచింది.
కొంత ఆలస్యంగా నైనా వెంకట్ రెడ్డి తన అసమ్మతి స్వరాన్ని విడిచి రేవంత్‌తో జట్టు కట్టి కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు పని చేస్తానంటూ చెప్పడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది.
నిలకడగా ఉంటారా
రేవంత్‌తో వెంకటరెడ్డి సయోధ్యను స్వాగతించిన కాంగ్రెస్ కేడర్ ఇకముందయినా ఆయన కాంగ్రెస్‌లో కుదురుగా ఉండాలని కోరుకుంటున్నారు. వెంకటరెడ్డి నిలకడలేమి తనం నేపథ్యం చూస్తే ఎప్పుడు ఎలా ఉంటారో ఏం మాట్లాడుతారోనని అంచనా వేయడం కష్టమే అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. గతంలోపీసీసీ అధ్యక్షుడిగా రేసులో ఉన్నానంటూనే.. తెలంగాణ కోసం మంత్రి పదవినే వదిలేసిన నాకు పదవులు ఎడమ కాలు చెప్పుతో సమానం అంటూ విభిన్న వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో పులిచింతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడిన వెంకట్ రెడ్డి తదుపరి అనుకూలంగా మారిపోవడం.. తరచూ ఎస్ఎల్బీసీ సొరంగం, ఉదయ సముద్రం ప్రాజెక్టుల కోసం జాతీయ రహదారి దిగ్భంధం చేస్తానంటూ ఒకసారి.. ప్రగతి భవన్ ముట్టడిస్తా అంటూ మరోసారి.. ఆమరణ దీక్ష చేస్తానంటూ ఇంకోసారి భిన్నమైన ప్రకటనలు చేశారు.
బస్వాపురం రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలపైన, రంగారెడ్డి ఫార్మా సిటీ బాధితుల సమస్యల పైన తడవకో రకంగా నిరసన వైఖరులు మార్చుకున్నారు. ఇలాంటివన్నీ కూడా వెంకట్ రెడ్డి నిలకడలేమి రాజకీయ విధానాలను చాటుతాయని ఆయన ప్రత్యర్ధులు విమర్శలు సంధిస్తుంటారు.
గతంలో ఒకసారి సీఎం కేసీఆర్‌ను పొగడటం, ఆ వెంటనే విమర్శించడం వెంకట్ రెడ్డి వైఖరి పట్ల సొంత కేడర్లోను అయోమయం రేపింది. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారానికి వస్తానంటు ఒకసారి, రానని మరో సారి చెప్పి పార్టీ శ్రేణుల్లో అయోమయం రేపారు.
సోదరుడైన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలంటూ పార్టీ నాయకులతో వెంకటరెడ్డి సాగించిన ఫోన్ సంభాషణలు ఆయనలోని ద్వంద్వ రాజకీయ వైఖరులకు అద్దం పట్టాయి. రేవంత్‌పై అసమ్మతి వెళ్లగక్కిన సందర్భాల్లోనే బీజేపీ నేతలు అమిత్ షా, ప్రధాని మోదీలతో భేటీ కావడంతో పాటు ఎన్నికలప్పుడే తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెబుతానంటూ మీడియాతో వాఖ్యలు చేసి తన పార్టీ మార్పు ప్రచారానికి స్వయంగా వెంకట్ రెడ్డినే ఆజ్యం పోశారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలకడలేమి రాజకీయాలపై బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తరచు విమర్శలు చేసే సందర్భాల్లో వెంకటరెడ్డి రాజకీయాలన్ని కోతి చేష్టలుగా ఉంటాయని, ఎప్పుడు ఏం మాట్లాడుతారో వారికైనా స్పష్టత ఉండదంటూ విమర్శలు గుప్పించడం గమనార్హం.
వెంకటరెడ్డి తన రాజకీయ ప్రయాణంలో ఒక్క దివంగత వైఎస్ఆర్తో తప్ప సీనియర్ కాంగ్రెస్ నేతలైన దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డిలను మొదలుకొని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు సీనియర్లు కే.జానారెడ్డి ఆర్. దామోదర్ రెడ్డిలతో సహా జూనియర్లుగా ఉన్న అద్దంకి దయాకర్ వంటి వారితో కూడా ఆయన తగువులు సాగించిన నేపథ్యం ఆయన నిలకడలేమి రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గతాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డితో సయోధ్య సాగించిన తీరులోనే మునుముందు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసే దాకా అయినా వెంకట్ రెడ్డి సొంత పార్టీ నేతలతో వివాదాలకు దూరంగా ఉంటే ఆ పార్టీ రాజకీయాలకు లాభం చేకూర్చడంతో పాటు పార్టీలో సొంత ప్రాబల్యం మరింత పెంచుకోగలుగుతారన్న అభిప్రాయాలు కేడర్‌లో వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కాంగ్రెస్‌తో పోల్చితే బీజేపీకి తక్కువన్న భావన తోనే వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లో మళ్లీ యాక్టివ్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలు సైతం ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చలను రేకెత్తించాయి.