ములుగు డీసీసీ ప్రెసిడెంట్ నల్లెల్ల మృతి.. కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే సీతక్క
జిల్లా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు(MULUGU) జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ (DCC)ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గురువారం అనారోగ్యంతో మరణించారు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న కుమారస్వామి ఆకస్మిక మరణం కాంగ్రెస్ వర్గాలను కలచివేసింది. గతంలో శస్త్ర చికిత్స (surgery)చేసుకున్న అనంతరం కోలుకున్న అతను ఈ మధ్యకాలంలో పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉంటూన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న తరుణంలో […]

- జిల్లా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు(MULUGU) జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ (DCC)ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గురువారం అనారోగ్యంతో మరణించారు. అనారోగ్యం నుంచి కోలుకుంటున్న కుమారస్వామి ఆకస్మిక మరణం కాంగ్రెస్ వర్గాలను కలచివేసింది.
గతంలో శస్త్ర చికిత్స (surgery)చేసుకున్న అనంతరం కోలుకున్న అతను ఈ మధ్యకాలంలో పార్టీ కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉంటూన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న తరుణంలో గురువారం ఉదయం ఒక్కసారిగా ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడు
జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా నల్లెల కుమారస్వామికి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతగా గుర్తింపు ఉన్నప్పటికీ మిగిలిన రాజకీయ పక్షాలతో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నాయకునిగా కుమారస్వామికి పేరు ఉంది. కాంగ్రెస్ నాయకులు, ములుగు జిల్లా ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే సీతక్క
నల్లెల్ల కుమార స్వామి మృతి పట్ల ములుగు ఎమ్మెల్యే సీతక్క(SEETHAKKA) కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన భౌతిక కాయం పై పడి విలపించారు. కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు ప్రయత్నించారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటాదని హామీ ఇచ్చారు.
ఇటీవల మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు
ఇటీవల కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన అధ్యక్షులను నియమించిన సందర్భంలో కూడా ములుగు జిల్లా అధ్యక్ష బాధ్యతలు తిరిగి కుమారస్వామికి వచ్చే విధంగా సీతక్క కృషి చేశారు. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ మేరకు అవకాశం కల్పించారు.
కానీ కొద్ది కాలానికి అకాల మృత్యువాత పడడం కాంగ్రెస్ పార్టీకి తీవ్రలోటుగా పేర్కొంటున్నారు. కుమారస్వామి అంత్యక్రియలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు సన్నాహం చేస్తున్నాయి జిల్లా పార్టీ నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఇప్పటికే కోరారు.
నల్లెల మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం
ములుగు డీసీసీ అధ్యక్షులు కుమారస్వామి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుమార స్వామి సీనియర్ రాజకీయ నాయకులుగా నిత్యం ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని ప్రజల సమస్యలపై పోరాటాలు చేశారన్నారు.
ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుమారస్వామి అకాలమరణం కలచివేసింది. క్షేత్ర స్థాయి కార్యకర్త నుండి డీసీసీ స్థాయికి ఎదిగిన స్వామి లేని లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.@INCTelangana
— Revanth Reddy (@revanth_anumula) February 23, 2023
రెండు సార్లు ములుగు సర్పంచ్ గా, ములుగు ఎంపీపీ గా పనిచేసి ములుగు ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసారని రేవంత్ గుర్తుచేశారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎంతో శ్రమించిన కుమార స్వామి మరణం పార్టీకి తీరని లోటన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించడానికి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి ములుగుకు వెళ్లి అంత్యక్రియలల్లో పాల్గొంటారని ప్రకటించారు.