Nalgonda | వేడెక్కిన ఉమ్మడి నల్గొండ రాజకీయం! 26న బండి, కేటీఆర్ సభలు
Nalgonda | BRS | BJP | CONGRESS కొనసాగుతున్న భట్టి పాదయాత్ర విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు వేసవి ఎండల మాదిరిగా వేడెక్కుతున్నాయి. ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనసాగిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటలు యుద్ధం తారా స్థాయికి చేరింది. దీనికి తోడు ఈనెల 26న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఎమ్మెల్యే గాదరి […]

Nalgonda | BRS | BJP | CONGRESS
కొనసాగుతున్న భట్టి పాదయాత్ర
విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు వేసవి ఎండల మాదిరిగా వేడెక్కుతున్నాయి. ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనసాగిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటలు యుద్ధం తారా స్థాయికి చేరింది. దీనికి తోడు ఈనెల 26న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రగతి నివేదన సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు మంత్రి కేటీఆర్ హాజరుకారున్నారు.
ఇదే రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో చేపట్టిన మహాజన సంపర్క్ అభియాన్ సభ నిర్వహించనున్నారు ఈ సభకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరవుతున్నారు.
ఒకేరోజు అటు కేటీఆర్, ఇటు బండి సంజయ్‌ల సభలు ఉండడంతో వారి సభలను విజయవంతం చేసేందుకు ఆ పార్టీల జిల్లా నాయకత్వం సన్నహాల్లో మునిగి తేలుతుంది. బిఆర్ఎస్, బిజెపి, ముఖ్య నేతలు మంత్రి కేటీఆర్, బండి సంజయ్ లు ఇరువురు కూడా తమ ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలతో రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో మరింత కాక పుట్టిస్తారనడంలో సందేహం లేదు.
ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తమకు ప్రధాన పోటీ దారుగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన, ఎమ్మెల్యేల పైన విమర్శల దాడి సాగిస్తున్నారు. బిఆర్ఎస్ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డిని, సీనియర్ నేత, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లను లక్ష్యంగా భట్టి సంధించిన విమర్శనాస్త్రాలు రాజకీయ పోరును మరింత రగిలించాయి.
పాదయాత్రలో భట్టి జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ జిల్లాకు తొమ్మిదేళ్లలో మంత్రి జగదీష్ రెడ్డి, గుత్తాలు ఏమి చేశారంటూ పాదయాత్ర సభలకు హాజరైన జనంలో నిలదీశారు. జగదీష్ రెడ్డి, గుత్తాలు సైతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వేదికల మీదుగా భట్టి విమర్శలను అంతే ఘాటుగా తిప్పికొట్టగా వారి మధ్య మాటల యుద్ధం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలుత ఆలేరు, భువనగిరి నియోజకవర్గంలలో సాగిన భట్టి పాదయాత్ర తదుపరి దేవరకొండ నియోజకవర్గం లో మొదలై నాగార్జునసాగర్, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల మీదుగా కొనసాగి సూర్యాపేట నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ నియోజకవర్గం లో మంత్రి జగదీష్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత మాజీమంత్రి ఆర్.దామోదర్ రెడ్డి భట్టి పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యతను తీసుకున్నారు.
పార్టీలో దామన్నకు ప్రత్యర్ధిగా ఉన్న పటేల్ రమేష్ రెడ్డి వర్గం కూడా భట్టి పాదయాత్ర కోసం తనవంతు సహకారం అందించేందుకు సిద్ధమయ్యారు. తన పాదయాత్ర సూర్యాపేట నియోజకవర్గంకు చేరకముందే భట్టి మంత్రి జగదీష్ రెడ్డి పైన ఘాటుగా విమర్శలు సంధించిన నేపథ్యంలో రేపటి నుండి సూర్యాపేట నియోజకవర్గంలో కొనసాగే పాదయాత్రలో జగదీష్ రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్ దాడి మరింత దాటిగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది.