Nalgonda: ఆత్మీయతకు బీటలు.. అసమ్మతి బావుటలు..! వర్గపోరు బహిర్గతం చేస్తున్న‌ ఆత్మీయ సమ్మేళనాలు!

విధాత: నియోజకవర్గాల్లో బీఆర్ఎస్(BRS) నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలలో పార్టీలోని వర్గ పోరు బహిర్గతం అవుతుంది. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయత కరువై పోగా పార్టీ అధిష్టానం ఆత్మీయ సమ్మేళనాల నిర్వాహణతో ఆశించిన లక్ష్యాలు నెరవేరని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ చూస్తే గులాబీ పార్టీ నాయకుల మధ్య ఆత్మీయత లోపం పరస్పర అసమ్మతి స్పష్టంగా వెల్లడవుతుంది. అంతా ఐక్యంగా ఉన్నామన్న సంకేతాలు ఇవ్వాల్సిన ఆత్మీయ సమ్మేళనాలు పార్టీలోని వర్గపోరును చాటి […]

Nalgonda: ఆత్మీయతకు బీటలు.. అసమ్మతి బావుటలు..! వర్గపోరు బహిర్గతం చేస్తున్న‌ ఆత్మీయ సమ్మేళనాలు!

విధాత: నియోజకవర్గాల్లో బీఆర్ఎస్(BRS) నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలలో పార్టీలోని వర్గ పోరు బహిర్గతం అవుతుంది. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయత కరువై పోగా పార్టీ అధిష్టానం ఆత్మీయ సమ్మేళనాల నిర్వాహణతో ఆశించిన లక్ష్యాలు నెరవేరని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ చూస్తే గులాబీ పార్టీ నాయకుల మధ్య ఆత్మీయత లోపం పరస్పర అసమ్మతి స్పష్టంగా వెల్లడవుతుంది.

అంతా ఐక్యంగా ఉన్నామన్న సంకేతాలు ఇవ్వాల్సిన ఆత్మీయ సమ్మేళనాలు పార్టీలోని వర్గపోరును చాటి చెప్పే వేదికలవ్వడం బిఆర్ఎస్ అధిష్టానాన్ని సైతం అంతర్మథనంలో పడేస్తుంది. మెజారిటీ నియోజక వర్గాలలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పోటీగా.. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఆశించే ఆశావహులు మెండుగా ఉన్నారు.

ఆత్మీయ సమ్మేళనాలు సిట్టింగ్ ఎమ్మెల్యేల పర్యవేక్షణలో సాగుతుండటంతో వారికి పోటీగా టికెట్ ఆశిస్తున్న నేతలకు ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానం అందక వారు వాటికి హాజరవ్వడం లేదు. ఆహ్వానాలు అందిన వారు సైతం అసమ్మతి నేపథ్యంలో వాటికి దూరంగా ఉంటున్నారు. దీంతో నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ నాయకుల్లో నెలకొన్న వర్గ పోరు, విభేదాలు, అసమ్మతి ఆత్మీయ సమ్మేళనాలతో బహిర్గతమైపోతుంది.

నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యవేక్షణలో సాగుతున్న బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నేతి విద్యాసాగర్, వారి వర్గీయులు దూరంగా ఉంటున్నారు. నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే నోముల భగత్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఆయన వర్గీయులు గైరాజరవుతున్నారు.

కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య సారధ్యంలోని ఆత్మీయ సమ్మేళనాలకు కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, వేనేపల్లి చందర్రావులు, వారి వర్గీయులు దూరంగా ఉంటున్నారు. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పర్యవేక్షణలో సాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు చింతల వెంకటేశ్వర్ రెడ్డి వర్గీయులు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.

మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలకు మాజీ ఎమ్మెల్సి కర్నె ప్రభాకర్, పల్లె రవి, కంచర్ల కృష్ణారెడ్డి, వారి వర్గీయులు గైరాజరవుతున్నారు. నల్గొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలకు పిల్లి రామరాజు, చాడ కిషన్ రెడ్డిలు, వారి వర్గీయులు దూరంగా ఉన్నారు. ఆలేరులో ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలకు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ వర్గం దూరంగా ఉంటుంది.

తుంగతుర్తి, దేవరకొండ మిర్యాలగూడలో సైతం ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, ఆర్. రవీంద్ర కుమార్, ఎన్. భాస్కరరావులపై అసమ్మతితో ఉన్నవారు అక్కడి ఆత్మీయ సమ్మేళనాలకు గైర్హజరవుతున్నారు. ఇప్పటివరకు సదరు నియోజకవర్గాల అన్నింటిలో సగం ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి కావస్తుండగా, మిగిలిన ఆత్మీయ సమ్మేళనాలకైనా అసంతృప్త నేతలు హాజరవుతారో లేదో తేలాల్సి ఉంది.