Modi | ప్రపంచ నాయకుడా.. 11వ అవతారమా?
Narendra Modi విధాత: నరేంద్ర మోడీ ప్రపంచ నాయుకుడని, విశ్వగురువు అని, ప్రజాదరణలో ఆయనకు ఆయనే సాటి అని, ఆయన పదకొండవ అవతారమని కొందరు భక్తులు అదే పనిగా కొనియాడుతున్నారు. పొద్దున్నే కేబీఆర్ పార్కులో ఒక భక్తుడు తదేక దీక్షతో ఆయనను కీర్తించడం కనిపించింది. మోడీ నిజమైన నాయకుడని, రాహుల్‌గాంధీ పప్పు అని ఇంకా ఏవేవో వల్లెవేస్తున్నారు. మోడీ అంత నీతిమంతుడు లేడని, దేశమంతా ఆయనతోనే ఉందని కూడా ఆ భక్తుడు తన్మయత్వంతో వర్ణిస్తున్నారు. మిగిలిన వారంతా […]

Narendra Modi
విధాత: నరేంద్ర మోడీ ప్రపంచ నాయుకుడని, విశ్వగురువు అని, ప్రజాదరణలో ఆయనకు ఆయనే సాటి అని, ఆయన పదకొండవ అవతారమని కొందరు భక్తులు అదే పనిగా కొనియాడుతున్నారు. పొద్దున్నే కేబీఆర్ పార్కులో ఒక భక్తుడు తదేక దీక్షతో ఆయనను కీర్తించడం కనిపించింది. మోడీ నిజమైన నాయకుడని, రాహుల్‌గాంధీ పప్పు అని ఇంకా ఏవేవో వల్లెవేస్తున్నారు.
మోడీ అంత నీతిమంతుడు లేడని, దేశమంతా ఆయనతోనే ఉందని కూడా ఆ భక్తుడు తన్మయత్వంతో వర్ణిస్తున్నారు. మిగిలిన వారంతా ప్రేక్షకులుగా ఉన్నారు. వినీవినీ విసుగెత్తిన ఒక మిత్రుడు గట్టిగా అందుకున్నాడు- చదువుకున్న రాహుల్‌గాంధీ పప్పా లేక చదువు రాని, చదువు వివరాలు దాచుకున్న నరేంద్ర మోడీ పప్పా అని. భలే చెబుతారు. ఆయన గొప్ప వక్త.. ఆయనకు చదువు రాక పోవడమేమిటీ అన్నారు సదరు భక్తుడు. నరేంద్రమోడీ రాసిన ప్రసంగాలు మాత్రమే చదువుతారని, ప్రాంప్టర్లు వాడతారని మీకు తెలుసా? అని మా మిత్రుడు అడిగారు. అదంతా మీలాంటి వాళ్లు చెప్పే అబద్ధాలు అన్నారు. నరేంద్ర మోడీ నీతిమంతుడు తెలుసా అన్నాడు.
నరేంద్రమోడీ నాయకత్వంలోనే దేశంలోని పది రాష్ట్రాలలో సుమారు 170 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మీకు తెలుసా? అని మా మిత్రుడు ప్రశ్నించాడు. రాజకీయాల్లో అదంతా సహజం అన్నారు దేశభక్తుడు. అదానీ కుంభకోణం, రాఫెల్ ఒప్పందం, కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో నలభై శాతం కమీషన్లు, మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం, గుజరాత్‌లో జరిగిన అవినీతి సంగతి మరి అని రెట్టించాడు మా మిత్రుడు. ఆయన ఇవేవీ వినిపించనట్టు మోడీ కీర్తన కొనసాగిస్తూనే ఉన్నారు.
ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేయడం ఫాసిస్టులు చేసే పని. ఈ మధ్య మరో మిత్రుడు ఒక కొత్త పద ప్రయోగం చేశారు. ‘ఆయన గోబెల్స్‌ను మించినోడు, మోబెల్స్ అంటే బెటర్. ఆయన గాంధీని పూజిస్తున్నట్టు కనిపిస్తాడు, గాడ్సే ప్రేమికులను నెత్తినపెట్టుకుని ఊరేగిస్తాడు. అంబేద్కర్‌కు పూలమాలలు వేస్తాడు, గోల్వాల్కర్ సిద్ధాంతాన్ని అమలు చేస్తాడు. ఆయన గ్రేట్’ అని ఆ మిత్రుడు చెప్పారు.
రైతుల పట్ల కఠినాతి కఠినంగా వ్యవహరించాడు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కొత్త చట్టాలు తెచ్చాడు. రెజ్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు తమను లైంగికంగా వేధించాడని ఆడపిల్లలు వీధుల్లోకి వచ్చి మరీ కన్నీరు పెడుతుంటే ఏమీ జరగనట్టు ఏమీ పట్టనట్టు నీరో చక్రవర్తిలాగా వ్యవహరిస్తున్నారు. అవును ఆయనకు రాజరికం అంటే చాలా ఇష్టం. రాజదండం పట్టుకుని పార్లమెంటులో ప్రవేశించారంటేనే అర్థం చేసుకోవచ్చు.
అధికారమిచ్చేది రాజదండం కాదు, ప్రజల ఓటు అని ఆయనకు తెలియదా? తెలుసు కానీ తాను నమ్మిన విధంగా చేయడమే ఆయనకు ఇష్టం. అటువంటి నాయకుడిని ప్రపంచ నాయకుడిగా చూపించాలని భక్తులు అడుగడుగునా తాపత్రయపడుతున్నారు. నిజమేనా! అత్యంత ఆదరణ కలిగిన నాయకుడా? దేశంలో ఆయన ఆదరణకు తిరుగు లేదా? వాస్తవ పరిస్థితి ఎలా ఉంది?
2019 లోక్‌సభ ఎన్నికలలో పోలైన ఓట్లలో ఆయనకు వచ్చింది 37 శాతం. దేశంలోని మొత్తం ఓట్లతో చూస్తే ఆయనకు వచ్చింది 25 శాతం ఓట్లే. దేశ జనాభాతో చూస్తే ఆయనకు జేజేలు పలికినవారి సంఖ్య 16 శాతమే. దేశ జనాభా:138 కోట్లు, దేశంలో మొత్తం ఓట్లు: 91.19 కోట్లు, మొత్తం పోలైన ఓట్లు: 60.76 కోట్లు, బీజేపీకి వచ్చిన ఓట్లు: 22.90 కోట్లు.
గణాంకాలు అబద్ధాలు చెప్పవు. ఆయన సర్వజనామోదం కలిగిన నాయకుడని ఇప్పుడు చెప్పండి! ఆయనకు ప్రజలు ఇచ్చింది శాశ్వత పవర్ ఆఫ్ అటార్నీ కాదు, తాత్కాలిక పవర్ ఆఫ్ అటార్నీ మాత్రమే. కానీ భక్తులు ఆయనను పదకొండవ అవతారం అని చెప్పేదాకా వెళ్లారు. అంతేకాదు 2019 ఎన్నికల తర్వాత 14 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే ఆయన ఘనంగా గెలిచింది ఆరు రాష్ట్రాలలోనే. మిగిలిన రాష్ట్రాలన్నింటా నరేంద్రమోడీని తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో బీజేపీ ఓట్ల శాతం 42 నుంచి 32 శాతానికి పడిపోయింది.
ఇక ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని మరొక ప్రచారం. అంతర్జాతీయ సంస్థలు లేక దుకాణాలు చాలా ఉంటాయి. అవి ఆయా దేశాల ప్రభుత్వాల పనితీరుపై, ఆర్థిక వ్యవస్థల పనితీరుపై, నాయకులపై సర్వేలో అంచనాలో ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంటాయి. అట్లాంటిదే మోర్నింగ్ కన్సల్ట్ అనే ఒక సంస్థ. ఆయన అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని ఇటీవల నివేదిక ఇచ్చింది. ఈ సంస్థలు ఎలా సర్వే చేస్తాయో వాటి మోడస్ ఆపరెండి ఏమిటో ఎవరికీ తెలియదు.
రేటింగులు మాత్రం బయటికి వస్తాయి. అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రేటింగులపై ఒంటికాలుమీద లేచే మోడీ భక్తులు మోర్నింగ్ కన్సల్ట్ నివేదికను మాత్రం పరమ పవిత్రంగా ప్రచారం చేస్తుంటారు. పత్రికా స్వేచ్ఛ సూచి, పేదరిక సూచి, ప్రజాస్వామ్య సూచీ వంటివి వచ్చినప్పుడు మాత్రం అవి భారత దేశానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రగా మోడీ భక్తులు తూలనాడుతారు. తమ నేతను పొగిడితే పండగ, తెగిడితే దండగ-ఇదీ వారి అలవాటు.
ఇంతెందుకు ఇటీవల ప్యూ రిసెర్చ్ సెంటర్ వారు ఒక సర్వే చేశారు. అందులో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 40 శాతమంది అమెరికన్లకు అసలు మన ప్రపంచ నాయకుని పేరే తెలియదు అని ఆ రిసెర్చ్ నివేదిక పేర్కొంది. కేవలం 20 శాతం మంది మాత్రమే తమకు మోడీ తెలుసునని, ప్రపంచానికీ ఎంతో కొంత చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారట. ఒక శాతం మంది మాత్రం ఆయనపై చాలా ఆశలు పెట్టుకున్నారట.
ప్రపంచ నాయకుడు అనడానికి ఈ శాతాలు సరిపోతాయా? భక్తులు చెప్పాలి! అంతేకాదు ప్రపంచ నాయకునిగా చెప్పడానికి ట్విట్టర్ ఫాలోయర్స్ సంఖ్యను కూడా సాక్ష్యంగా చెబుతూ ఉంటారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై వ్యాపారం చేస్తున్న కంపెనీలు. అందులో జరిగేంత కుంభకోణం మరెక్కడా జరగడం లేదని ఒక ఐటీ నిపుణుడు ఇటీవల ప్రకటించారు. అందులో నిజమైన మనుషులకే కాకుండా డమ్మీ మనుషులకూ ఖాతాలు ఉంటాయి. ఒక్కొక్కడికి నాలుగైదు ఖాతాలు ఉంటాయి. ఆటోమ్యాటిక్‌గా స్పందించే బాట్‌లు ఉంటాయి.
రాజకీయ పక్షాలయితే సొంత దుకాణాలు తెరిచి పెయిడ్ బ్యాచ్‌లను నడుపుతున్నాయి. ఫాలోయర్స్, వీక్షకుల కుంభకోణాల గురించి ఇప్పటికే మీడియాలో కథనాలు వచ్చాయి. అందువల్ల వాటిని లెక్కపెట్టవలసిన పనిలేదు.
మొత్తంగా చెప్పేదేమంటే మోడీ ప్రపంచ నాయకత్వం ఒక మిథ్య. అది అబద్ధాల మీద నిర్మించిన పేక మేడ. భక్తులు మోహ పారవశ్యంతో సృష్టించిన విభ్రమ. అది పటాపంచలు కావడం తథ్యం.
– హితవాది