NASA | అంగారకునిపై 122 గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసిన నాసా
NASA | 98 శాతం స్వచ్ఛతతో ప్రాణవాయువు భవిష్యత్తు ప్రయోగాలకు ఊపిరి అంగారకుని (Mars) పై మనిషి ఆవాసాలను ఏర్పాటు చేయడానికి వీలుగా ఒక్కో అడుగూ వడివడిగా ముందుకు పడుతోంది. అంగారకునిపై భూమి తరహాలోనే వాతావరణం ఉండటంతో ఒకప్పుడు అక్కడా ఏదో ఒక స్థాయిలో జీవం ఉందని శాస్త్రవేత్తల అంచనా. అయితే ఇప్పుడు అదంతా నిశ్శబ్దమైన శ్మశానంలా మారిపోయిన విషయం తెలిసిందే. అక్కడ వాతావరణం ఉన్నప్పటికీ మనుషులకు తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేదు. ఒక వేళ మానవ […]

NASA |
- 98 శాతం స్వచ్ఛతతో ప్రాణవాయువు
- భవిష్యత్తు ప్రయోగాలకు ఊపిరి
అంగారకుని (Mars) పై మనిషి ఆవాసాలను ఏర్పాటు చేయడానికి వీలుగా ఒక్కో అడుగూ వడివడిగా ముందుకు పడుతోంది. అంగారకునిపై భూమి తరహాలోనే వాతావరణం ఉండటంతో ఒకప్పుడు అక్కడా ఏదో ఒక స్థాయిలో జీవం ఉందని శాస్త్రవేత్తల అంచనా. అయితే ఇప్పుడు అదంతా నిశ్శబ్దమైన శ్మశానంలా మారిపోయిన విషయం తెలిసిందే. అక్కడ వాతావరణం ఉన్నప్పటికీ మనుషులకు తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేదు.
ఒక వేళ మానవ ఆవాసాలను అక్కడ ఏర్పాటు చేయగలిగితే భూమిపై నుంచి ఆక్సిజన్ను తీసుకెళ్లడం ఆర్థికంగా అసాధ్యం. అందువల్లే అక్కడ ఉన్న వాతావరణంలో నుంచి ప్రాణవాయువును తయారు చేయడానికి నాసా ఉపక్రమించింది. ఆ ఉద్దేశంతోనే 2021లో మార్స్‌పైకి పర్సెవరెన్స్ (Perseverance) రోవర్‌ను పంపింది.
అందులో ఉన్న మార్స్ ఆక్సిజన్ ఇన్ సితు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పరిమెంట్ (మోక్సీ) పరికరం విజయవంతంగా 16 వ సారి నాణ్యమైన ఆక్సిజన్‌ను తయారు చేసింది. ఈ మేరకు నాసా ప్రకటించింది. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తయారు చేసిన ఈ పరికరం అంచనాలను మించి పనిచేసింది.
మోక్సీ (MOXIE) చేసిన ఈ పరిశోధన భవిష్యత్తు ప్రయోగాలకు ఎంతో ఉపయోగకరం. రాకెట్ ఇంధనం కోసం గానీ, వ్యోమగాముల కోసం కానీ ఆక్సిజన్ కావాల్సి వచ్చినపుడు మార్స్‌పై ఉత్పత్తి చేసుకోవచ్చని నిరూపించింది అని నాసా డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పాం మెల్రోయ్ తెలిపారు. 2021లో మార్స్‌పై అడుగిడునప్పటి నుంచి మోక్సీ 122 గ్రాముల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది.
ఇది ఒక కుక్క 10 గంటల పాటు జీవించడానికి సరిపోతుంది. అసలు మోక్సీని 60 గ్రాముల ఆక్సిజన్ ఉత్పత్తి కోసమే తయారు చేయగా అది అందుకు రెట్టింపు సామర్థ్యంతో పని చేసింది. పైగా మోక్సీ ఉత్పత్తి చేసిన ఆక్సిజన్ 98 శాతం స్వచ్ఛతతో ఉందని నాసా తెలిపింది.
అంతరిక్షంలో ఉన్న సుదూర వస్తువులను పరిశోధించాలంటే అంగారకుడు, చంద్రునిపై మానవాళి పట్టు సాధించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తల భావన. అందుకే ఈ ఆక్సిజన్ ఉత్పత్తి ప్రక్రియను ఒక భారీ మలుపుగా భావించొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
