Voyager 2 | ఊపిరి పీల్చుకున్న నాసా శాస్త్రవేత్తలు.. వోయజర్ 2తో సంబంధాలు పునరుద్ధరణ
Voyager 2 విధాత: సుమారు 3 దశాబ్దాల క్రితం ప్రయోగించిన వోయజర్ 2 (Voyager 2) అంతరిక్ష నౌకతో సంబంధాలను పునరిద్ధరించుకోవడంలో నాసా (NASA) సఫలీకృతమైంది. అత్యంత శక్తిమంతమైన పవర్ ట్రాన్స్‌మిటర్ సాయంతో ఈ అద్భుతాన్ని సృష్టించింది. తాము పంపిన సిగ్నల్ ద్వారా వోయజర్ 2 ఏంటెన్నా తన దిశను మార్చుకుందని నాసా శుక్రవారం ప్రకటించింది. మానవ నాగరికతను చెందిన గుర్తులను తనతో తీసుకెళుతూ.. 1977 నుంచి వోయజర్ 2 తన ప్రయాణాన్ని నిర్విరామంగా సాగిస్తోంది. అది […]

Voyager 2
విధాత: సుమారు 3 దశాబ్దాల క్రితం ప్రయోగించిన వోయజర్ 2 (Voyager 2) అంతరిక్ష నౌకతో సంబంధాలను పునరిద్ధరించుకోవడంలో నాసా (NASA) సఫలీకృతమైంది. అత్యంత శక్తిమంతమైన పవర్ ట్రాన్స్‌మిటర్ సాయంతో ఈ అద్భుతాన్ని సృష్టించింది. తాము పంపిన సిగ్నల్ ద్వారా వోయజర్ 2 ఏంటెన్నా తన దిశను మార్చుకుందని నాసా శుక్రవారం ప్రకటించింది. మానవ నాగరికతను చెందిన గుర్తులను తనతో తీసుకెళుతూ.. 1977 నుంచి వోయజర్ 2 తన ప్రయాణాన్ని నిర్విరామంగా సాగిస్తోంది.
అది ప్రస్తుతం భూమి నుంచి 1990 కోట్ల కి.మీ. దూరంలో … సౌర కుటుంబం (Solar Family) ఆవల ఉంది. ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది జులై 21న శాస్త్రవేత్తలు కొన్ని కమాండ్లను వోయజర్ 2కు పంపారు. అయితే ఒక పొరపాటు జరగడంతో దాని ఏంటెన్నా భూమి ఉన్న దిశ నుంచి 2 డిగ్రీలు దూరం జరిగిపోయింది. దీని వల్ల సమాచార మార్పిడిలో అవరోధం ఏర్పడి ప్రాజెక్టు మూతపడే ప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన శాస్త్రవేత్తలు భూమిపై ఉన్న డీప్ స్పేస్ నెట్‌వర్క్ (డీఎస్ఎన్) కేంద్రాల ద్వారా వోయజర్ నుంచి ఏమైనా స్వల్ప స్థాయిలో సిగ్నల్స్ వస్తాయేమోనని ప్రయత్నించారు.
అలా ప్రయత్నాలు చేయగా.. ఆఖరికి తాము ఏంటెన్నా దశను పూర్వ స్థితిలోకి మార్చగలిగామని నాసా శుక్రవారం ప్రకటించింది. ‘డీఎస్ఎన్‌లలో ఉండే పవర్ ట్రాన్స్‌మిటర్ ద్వారా వోయజర్ 2తో కాంటాక్ట్ అవ్వగలిగాం. కాన్‌బెర్రా సెంటర్‌లో ఉండే 100 కిలోవాట్ ఎస్ బ్యాండ్ అప్‌లింక్ ద్వారా ఇది సాధించాం’ అని వాయజర్ 2 ప్రాజెక్ట్ మేనేజర్ సుజానే డోడ్ వెల్లడించారు. ఈ సిగ్నల్‌ను సుజానే ఇంటర్ స్టెల్లార్ షౌట్ అని అభివర్ణించారు.
‘ఇంటర్‌స్టెల్లార్ షౌట్ (Interstellar Shout) అనే ఈ సిగ్నల్ కాంతి వేగంతో ప్రయాణించి వోయజర్ 2ను చేరుకోవడానికి 18 గంటలు పట్టింది. అది పనిచేసిందా లేదా తెలుసుకోవడానికి మాకు మరో 37 గంటలు పట్టింది’ అని తెలిపారు. శుక్రవారం నుంచి అది యథావిధిగా సమాచారాన్ని పంపుతోందని నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ ధ్రువీకరించింది.
సౌరకుటుంబానికి రక్షణగా ఉండే సూర్యుని అయస్కాంత పొరను వాయజర్ 2.. 2018లోనే దాటేసింది. ఈ ప్రాంతాన్ని హెలియోస్పియర్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఇది నక్షత్రాల మధ్య ప్రయాణిస్తోంది. ఈ ప్రయాణంలో అది శని, గ్రహాలను సూక్ష్మస్థాయిలో పరిశోధించింది. అంతేకాకుండా యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల సమీపానికి వెళ్లిన తొలి అంతరిక్ష నౌకగానూ రికార్డు సృష్టించింది.
వోయజర్ 2కు సోదర అంతరిక్ష నౌక అయిన వోయజర్ 1 మానవ నాగరికత డీప్ స్పేస్‌లోకి పంపిన తొలి అంతరిక్ష నౌక. అది ప్రస్తుతం భూమికి 2400 కోట్ల కి.మీ. దూరంలో ఉంది. ఈ రెండింటిలో కూడా 12 అంగుళాల బంగారు పూత పూసిన రాగి డిస్క్‌లను పొందుపరిచారు. ఇందులో మానవ జాతి పరిణామక్రమాన్ని, సౌర కుటుంబం మ్యాప్‌ను, ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించిన తేదీని తెలుసుకునేలా యురేనియం క్లాక్, ఆ డిస్క్‌ను ఎలా ప్లే చేయాలో తగిన సూచనలు అన్నీ అందులో వివరంగా పెట్టి ఉంచారు.
ఏదైనా ఏలియన్ జాతి దీనిని చూస్తే.. వారికి మన గురించి తెలుస్తుందని శాస్త్రవేత్తల ఆలోచన. ప్రస్తుతం వాటిలో ఉన్న పవర్ బ్యాంకుల సాయంతో భూమిపైకి సమాచారం పంపుతున్నప్పటికీ.. 2025 తర్వాత వాటి బ్యాటరీలు క్రమంగా డెడ్ అయిపోతాయి. ఆ తర్వాత అవి అలా అంతరిక్షంలో ముందుకు సాగిపోతూనే ఉంటాయి.