టీనేజ్‌ గర్భాల్లో మూడో స్థానంలో ఆ రాష్ట్రం.. కారణాలివే..

టీనేజ్‌ గర్భాల్లో మూడో స్థానంలో ఆ రాష్ట్రం.. కారణాలివే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గర్భిణి యువతుల్లో 12.6 శాతం మంది 15-19 ఏళ్ల మధ్యలోపువారేనని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. టీనేజ్‌ గర్భిణుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదని పేర్కొన్నది. పదిహేడు సంవత్సరాలకు గర్భం దాల్చతున్న వారి సంఖ్య 5 శాతం, 18 ఏళ్లలోపు వారిలో 18 శాతానికి పెరిగిందని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ నివేదిక పేర్కొంటున్నది. 19 ఏళ్ల వయసు యువతుల్లో అది 31 శాతంగా ఉన్నదని తెలిపింది. ప్రత్యేకించి ఈ ధోరణి సమాజంలోని బలహీన వర్గాల్లో అధికంగా కనిపిస్తున్నదని పేర్కొన్నది.



ఆంధ్రప్రదేశ్‌లో 20-24 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో సుమారు మూడో వంతు (29.3%) మందికి 18 ఏళ్లలోపే వివాహం అయినట్టు సర్వే తెలిపింది. ఇది జాతీయ సగటు కంటే 23.3% కంటే అధికం. ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో ఇది 32.9 శాతంగా, అర్బన్‌ ఏరియాల్లో 21.7% శాతంగా ఉన్నది.



స్వచ్ఛంద సంస్థ ‘చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యూ (క్రై) 2022లో చేసిన అధ్యయనం ప్రకారం.. ఇప్పటికీ బాల్య వివాహాలు ముఖ్యమైన అంశంగా దాదాపు 52 శాతం మంది తల్లిదండ్రులు విశ్వసిస్తున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై 22శాతం తల్లిదండ్రులు, అత్తమామలు మాత్రం పూర్తి అవగాహనతో ఉన్నారు.



నచ్చిన అబ్బాయిలతో వెళ్లిపోతారన్న భయం లేదా అక్రమ సంబంధాలు వివాహేతర శృంగారానికి, గర్భాలకు దారి తీస్తున్నాయనే కారణంతో తల్లిదండ్రులు తమ కుమార్తెలు రజస్వల కాగానే పెళ్లిళ్లు చేస్తున్నారని అధ్యయనంలో వెల్లడైంది. దానితోపాటు.. ఆర్థిక అంశాలు కూడా బలంగానే ఉంటున్నాయి.



తక్కువ కట్నంతో పెళ్లి చేసేయవచ్చన్న కారణం కూడా కీలకంగా ఉన్నది. అయితే.. బాల్య వివాహాల వల్ల ఆరోగ్యపరంగా కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ బాలల హక్కుల రక్షణ కమిషన్‌ మెంబర్‌ గుండు సీతారాం చెప్పారు.