NB.1.8.1 | వేగంగా విస్తరిస్తున్న నింబస్ వేరియంట్ గురించి నిపుణులు ఏమంటున్నారు?

NB.1.8.1| కొవిడ్ ఎన్‌బీ.1.8.1. సింపుల్‌గా చెప్పాలంటే కొవిడ్ కొత్త రూపం.. నింబస్ వేరియంట్. సమసిపోయిందనుకున్న కొవిడ్ విశ్వమారి మరోసారి వ్యాపించే విస్తరించే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్న క్రిమి. గతంలో ఎన్‌బీ.1.8.1. ఇది విస్తరించే వేగం చాలా ఎక్కువగా ఉంటుందని, అయితే.. గతంలో ప్రపంచాన్ని గడగడలాడించిన స్థాయిలో ఉండకపోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘వైరస్ అనేది మ్యటేట్ అవడం, కాలాన్ని బట్టి మారుతూ ఉండటం సాధారణమే. బ్రిటన్‌తోపాటు వివిధ దేశాల్లో సార్స్ కోవ్ 2 వేరియంట్స్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న డాటాను యూకేహెచ్‌ఎస్‌ఏ సమీక్షిస్తున్నది’ అని యూకేహెచ్‌ఎస్‌ఏ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాయత్రి అమృతలింగం తెలిపారు. యూకేలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా.. అంతర్జాతీయంగా ఉన్న డాటా ప్రకారం.. అన్ని కొవిడ్19 కేసులతో సమానంగానే ఇది కూడా విస్తరిస్తున్నదని పేర్కొన్నారు. ఇప్పటికి ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే.. ఈ వేరియంట్ గత వేరియంట్‌లకంటే ప్రమాదకారి అనేందుకు, గత వేరియంట్‌లకంటే తీవ్రమైనది అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఇప్పటికి వాడుతున్న వ్యాక్సిన్ సరిపోదనేందుకు కూడా ఆధారాలు లేవని అన్నారు.
ఎన్‌బీ.1.8.1 ఎక్కడి నుంచి వచ్చింది?
ఇటువంటివి వైరస్ మ్యుటేట్ అయినప్పుడు ఉద్భవిస్తుంటాయని పాల్ మాల్ మెడికల్‌కు చెందిన జీపీ డాక్టర్ చువాన్ టాంగ్ తెలిపారు. అది వైరస్‌లకు ప్రత్యేకించి అత్యధికంగా విస్తరించిన వైరస్‌లకు సాధారణమని చెప్పారు. ఎన్‌బీ.1.8.1 2025 ప్రారంభంలో యూకే, చైనా, అమెరికా వంటి దేశాల్లో గుర్తించారని టాంగ్ తెలిపారు. ప్రపంచ కొవిడ్ కేసులలో కొత్త వేరియంట్ క్రమంగా తన సంఖ్యను పెంచుకుంటున్నదన్నారు. ప్రపంచవ్యాప్త ఇన్‌ఫెక్షన్లలో ఏప్రిల్ 2025 నాటికి 10.7 శాతం వరకూ ఉన్నాయని తెలిపారు. ఇది అంతకు నాలుగు వారాల ముందు 2.5 శాతంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలను బట్టి తెలుస్తున్నది. దీనిని వేరియంట్ అండర్ మానిటరింగ్ (వీయూఎం)గా డబ్ల్యూహెచ్‌వో మే 23న ప్రకటించింది. ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వో మానిటర్ చేస్తున్న ఆరు వేరియంట్లలో ఇది ఒకటి. ఎన్‌బీ.1.8.1 వేరియంట్‌ను చైనా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, అమెరికా, యూకే, భారత్ సహా కనీసం 22 దేశాల్లో గుర్తించారు. ఇప్పుడు ఉన్న కొవిడ్ వ్యాక్సిన్‌లు వీటిని అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయని, తీవ్ర అస్వస్థతల నుంచి రక్షిస్తాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
ప్రమాదకారి?
గత వేరియంట్‌ల కంటే వేగంగా వ్యాపించగల సామర్థ్యం ఎన్‌బీ.1.8.1 కలిగి ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఒక ప్రకటనలో పేర్కొన్నది. అయితే.. తీవ్రమైన లక్షణాలు, తీవ్రమైన అస్వస్థతకు కారణమవుతున్నట్టు కనిపించడం లేదని తెలిపింది. ‘దీన్నుంచి కొన్ని కొత్త మ్యుటేషన్స్ వచ్చాయి. వాటిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు’ అని డాక్టర్ టాంగ్ హెచ్చరించారు. నింబస్ వేరియంట్ 2021లో తీవ్రరూపం దాల్చిన ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్. అయితే.. ఒమిక్రాన్‌కంటే ఇది పూర్తిగా భిన్నమైనది ఏమీ కాదని డాక్టర్ టాంగ్ తెలిపారు. అయితే.. దాని స్పైక్ ప్రొటీన్‌లో కొన్ని మార్పులున్నాయని, దాని ఫలితంగా సులభంగా వ్యాపించడానికి లేదా మన ప్రస్తుత రోగ నిరోధక శక్తిని దాటి వెళ్లేందుకు అవకాశం ఉండొచ్చని అన్నారు.