రాజకీయాల్లో ప్రక్షాళన అవసరం: రిటైర్డ్ డీఐజీ వీకే సింగ్

రాజకీయాల్లో ప్రక్షాళన అవసరం: రిటైర్డ్ డీఐజీ వీకే సింగ్

– అవినీతి రహిత సమాజాన్ని నిర్మిద్దాం

– తెలంగాణ సిటిజన్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ డీఐజీ వీకే సింగ్

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాజకీయాల్లో ప్రక్షాళన అవసరం ఉందని, అవినీతి లేని సమసమాజం కోసం కృషి చేద్దామని తెలంగాణ సిటిజన్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ డీఐజీ వీకే సింగ్ పేర్కొన్నారు. గురువారం మెదక్ పట్టణంలోని ద్వారాకగార్డెన్స్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో అవినీతి, కుల, మతపిచ్చి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామాన్ని కాపాడేందుకు ప్రజలు కండ్లు తెరవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు తావు ఇవ్వకుండా స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నిస్వార్థపరులు లాభాపేక్ష లేకుండా రాజకీయాల్లోకి వస్తేనే సమాజం బాగుపడుతుందని అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం నేడు సిటిజన్ ఫోరం తెలంగాణ అనే ఒక సామాజిక సంస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రజాసామాన్ని రక్షించడానికి కంకణం కట్టుకున్నానని పేర్కొన్నారు.

అన్ని రాజకీయ పార్టీలు ప్రలోభ పెట్టే తప్పుడు వాగ్దానాలు చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలడమే వారి లక్ష్యంగా ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలి పనిచేస్తున్నారని అన్నారు. ఉపాధి, విద్య, ఆరోగ్యం మనకు ప్రభుత్వాలు ఇచ్చే భిక్ష కాదని, అవినీతి రహిత పాలన కావాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల తొత్తులుగా మారారని, కొందరు మారారని అన్నారు. పోలీస్ శాఖలో 80 శాతం మంది మంచి అధికారులు ఉన్నారని, కొందరితోనే అవినీతి పెరిగిపోయిందని అన్నారు. తెలంగాణలో 50 శాతం మంది ప్రజలకు అసలు భూములు లేవని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలతో ప్రజలకు లాభం లేదు అన్నారు. ఈ సమావేశంలో సిటిజన్ ఫోరం సభ్యులు విడి చౌడి, పల్లె ఆంజనేయులు, సీహెచ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.