నీలగిరిలో నాగాస్త్రం..! కమల దళంలో కదనోత్సాహం
విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల దిశగా సరైన అభ్యర్థి కోసం అన్వేషణలో ఉన్న BJP పార్టీకి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ప్రత్యామ్నాయంగా మారడం ఆ పార్టీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కొద్ది కాలంలోనే నాగం వర్షిత్ రెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లుగా జనంలోకి దూసుకెళ్తున్నారు. వృత్తి రీత్యా వైద్యుడైన నాగం వర్షిత్ రెడ్డి అంతర్గత గ్రూపులు, […]

విధాత: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల దిశగా సరైన అభ్యర్థి కోసం అన్వేషణలో ఉన్న BJP పార్టీకి డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ప్రత్యామ్నాయంగా మారడం ఆ పార్టీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కొద్ది కాలంలోనే నాగం వర్షిత్ రెడ్డి నియోజకవర్గ పార్టీ కార్యకర్తల్లో తనదైన ముద్ర వేస్తున్నారు.
ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్లుగా జనంలోకి దూసుకెళ్తున్నారు. వృత్తి రీత్యా వైద్యుడైన నాగం వర్షిత్ రెడ్డి అంతర్గత గ్రూపులు, నాయకత్వ, ఆర్థిక లోటుపాట్లతో సతమతం అవుతున్న పార్టీకి శస్త్ర చికిత్స చేస్తున్నట్లుగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.
తాజాగా శక్తి కేంద్ర కార్నర్ మీటింగుల ద్వారా నాగం వర్షిత్ రెడ్డి పార్టీకి నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై పలు అంశాలపై విమర్శలు సంధిస్తూ దూకుడుగా సాగుతున్నారు.
నియోజకవర్గం వారి హాయలో ఆశించిన రీతిలో అభివృద్ధి చెందలేదని, వారిచ్చిన హామీల వైఫల్యాలు, అక్రమాలపై విమర్శలు చేస్తూ, బీజేపీ విధానాలను ఏకరువు పెడుతూ జనం దృష్టిని ఆకర్షించేందుకు నాగం ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ రాజకీయాల్లో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ లు పార్టీ కార్యాలపాలను నడిపిస్తున్నప్పటికీ కేడర్లో, ప్రజల్లో ఆశించిన ఊపు దక్కడం లేదన్న బెంగ క్యాడర్ లో వినిపిస్తుండేది.
అయితే ప్రజాగోస బిజెపి భరోసా శక్తి కేంద్ర కార్నర్ మీటింగులలో డాక్టర్ వర్షిత్ రెడ్డి తన కార్యక్రమాలు, ప్రసంగాలతో పార్టీ నాయకత్వానికి సరికొత్త ప్రత్యామ్నాయంగా, భవిష్యత్తుగా రూపుదిద్దు కోవడంతో కమలం పార్టీ శ్రేణులు.. ముఖ్యంగా యువ కార్యకర్తలు ఆయన వైపు ఆకర్షితులవుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటిదాకా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న నాయకులంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులతో ఉన్న ఆర్థిక, రాజకీయ బాంధవ్యాల నేపథ్యంలో పార్టీ పరంగా ఢీ అంటే ఢీ అనే రాజకీయాలు చేయడంలో వెనుకంజ వేశారు.
అందుకు భిన్నంగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తన రాజకీయ దూకుడుతో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ముందుకు వెళుతుండడం పార్టీ రాజకీయాలకు కొత్త జోష్ ను అందిస్తుంది. ఈ పరిణామాలు పార్టీలోని పాత నాయకులు జీర్ణించుకోలేక పోతుండగా నియోజకవర్గం గ్రూపు రాజకీయాలు మునుముందు ఎలాంటి మలుపులు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.