Nepal Earthquake | నేపాల్‌లో అర్ధరాత్రి భారీ భూకంపం.. 140 మంది దుర్మరణం..

Nepal Earthquake | నేపాల్‌లో అర్ధరాత్రి భారీ భూకంపం.. 140 మంది దుర్మరణం..

Nepal Earthquake | పశ్చిమ నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విషాదంలో ఇప్పటి వరకు ఇప్పటివరకు 140 మంది మరణించారు. వందలాది మంది ప్రజలు గాయాలకు గురయ్యారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నందున మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూ ప్రకంపనల ధాటికి పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసమయ్యాయి. రుకుమ్ వెస్ట్‌లో 35 మంది మరణించగా.. జాజర్‌కోట్ జిల్లాలో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారని నేపాల్‌ అధికారులు ధ్రువీకరించారు. భూకంపం అనంతరం రెస్క్యూ ఫోర్స్‌ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో బలమైన భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.4గా నమోదైంది. నేపాల్‌ జాతీయ భూకంప కేంద్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది.

జాజర్‌కోట్‌లో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప ప్రభావం భారత్‌తో పాటు చైనాలో కనిపించింది. భారత్‌లో సైతం దాదాపు 40 సెకన్ల పాటు ప్రకంపనలు రికార్డయ్యాయి. భూకంపంతో నేపాల్‌ రాజధాని ఖాట్మండుతో సహా పరిసర ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూప్రకంపనలతో ఒక్కసారిగా ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ సంతాపం వ్యకం చేశారు. క్షతగాత్రులను తక్షణమే రక్షించేందుకు సహాయం చేయడానికి మూడు భద్రతా ఏజెన్సీలను నియమించారు. ఇదిలా ఉండగా.. మహిలయ దేశమైన నేపాల్‌లో భూకంపాలు సర్వసాధారణమే. 2015లో రిక్టర్‌ స్కేల్‌పై 7.8 తీవ్రతతో భారీ భూకంపం నేపాల్‌ మొత్తాన్ని వణికించింది. ఆ ఘటనలో 12వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది.