దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిక్కీ యాదవ్ (Nikki Yadav) హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిక్కీ యాదవ్, సాహిల్ గహ్లోత్ (Sahil Gehlot) సహ జీవనంలో ఉన్నట్లు వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ సహజీవనంలో లేరని, రెండేండ్ల క్రితమే ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
విధాత: నిక్కీని సాహిల్ ఛార్జింగ్ వైర్‌ను గొంతుకు బిగించి చంపిన విషయం విదితమే. అయితే ఈ కేసులో సాహిల్ కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో సాహిల్ తండ్రి వీరేంద్ర సింగ్, సోదరులు అనీష్, నవీన్, స్నేహితులు లోకేశ్, అమర్‌ను శుక్రవారం సాయంత్రం ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2020లోనే నిక్కీ, సాహిల్ వివాహం
నిక్కీ, సాహిల్ కలిసి ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఆర్య సమాజ్‌లో 2020లోనే వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి సాహిల్ తల్లిదండ్రులకు ఇష్టం లేదని తెలిసింది. వీరు ముందు నుంచి కూడా వీరి వివాహన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిక్కీ, సాహిల్ మ్యారేజ్‌కు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరో యువతితో ఫిబ్రవరి 9న పెళ్లి
తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న సాహిల్ తన మనసు మార్చుకున్నాడు. నిక్కీని దూరం పెడుతూ వచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే తనను వదిలేసి మరో యువతిని సాహిల్ పెళ్లి చేసుకుంటున్నట్లు నిక్కీకి తెలిసింది. దీంతో అతన్ని నిలదీసింది. ఫిబ్రవరి 9వ తేదీన నిక్కీ, సాహిల్ కలిసి కారులో ఢిల్లీలో షికారు చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మూడు గంటల పాటు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
చివరకు ఛార్జింగ్ వైర్‌తో చంపేసి.. తాళి కట్టేందుకు వెళ్లాడు..
తీవ్ర వాగ్వాదం అనంతరం సాహిల్ కారులోనే నిక్కీని చంపేశాడు. ఆమె గొంతుకు ఛార్జింగ్ వైర్ బిగించి మట్టుబెట్టాడు. అనంతరం తన స్నేహితుడి సాయంతో శవాన్ని తన దాబా వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఫ్రిజ్‌లో నిక్కీ డెడ్‌బాడీని ఉంచి, నేరుగా వివాహ వేదిక వద్దకు వెళ్లాడు. అనంతరం మరో యువతిని అదే రోజున పెళ్లాడాడు.