Bodhan | బీఆరెస్‌, మజ్లిస్‌ మాటల యుద్ధం! షకీల్‌ హ్యాట్రిక్‌ ఆశలపై నీళ్లు

Bodhan | Nizamabad బోధన్‌లో ఇద్దరి దోస్తీ ముగిసిందా? చర్చనీయాంశంగా పాత మిత్రుల తీరు నిన్న మొన్నటి వరకు చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఆ రెండు పార్టీలు ఇప్పుడు ఒకదానిపై మరొకటి కారాలు మిరియాలు నూరుతున్నాయి. మాటల యుద్ధంతో రాజకీయాన్ని రంజీంప చేస్తున్నాయి. పోటీకి సై అంటే సై అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లను విసురుకుంటూ రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. (విధాతప్రతినిధి, నిజామాబాద్) నిజామాబాద్ జిల్లా బోధన్‌లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధీమాతో మూడోసారి కచ్చితంగా […]

  • Publish Date - July 6, 2023 / 12:29 PM IST

Bodhan | Nizamabad

  • బోధన్‌లో ఇద్దరి దోస్తీ ముగిసిందా?
  • చర్చనీయాంశంగా పాత మిత్రుల తీరు

నిన్న మొన్నటి వరకు చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఆ రెండు పార్టీలు ఇప్పుడు ఒకదానిపై మరొకటి కారాలు మిరియాలు నూరుతున్నాయి. మాటల యుద్ధంతో రాజకీయాన్ని రంజీంప చేస్తున్నాయి. పోటీకి సై అంటే సై అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లను విసురుకుంటూ రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి.

(విధాతప్రతినిధి, నిజామాబాద్)

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధీమాతో మూడోసారి కచ్చితంగా ఎమ్మెల్యే అవుతానని, మంత్రి పదవి కూడా ఖాయమని చెప్పుకొంటున్న బీఆరెస్ నేత షకీల్ అమెర్‌కు మిత్రపక్షం నుంచి చుక్కెదురవుతున్నది. మైనార్టీల అండతో మరోసారి గెలవాలనుకుంటున్న షకీల్‌కు ఎంఐఎం షాక్ ఇస్తున్నది. నిన్నటిదాకా బాగానే ఉన్న రెండు పార్టీల మధ్య సంబంధాలు అకస్మాత్తుగా ఉప్పు నిప్పు అన్నట్టుగా మారాయి.

బోధన్ కేంద్రంగా పరస్పరం రాజకీయ సవాళ్లు విసురుకుంటున్న రెండు పార్టీల నేతల మాటల యుద్ధం జిల్లా రాజకీయాల్లో రాజకీయ మంటలు రగిలిస్తున్నది. ఇటీవల జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్యేను మజ్లిస్‌ కార్పొరేటర్లు నిలదీయడంతో షకీల్‌కు, ఎంఐఎం నేతలకు మధ్య వివాదం ముదిరింది. ఏకంగా ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ తనపై ఎంఐఎంకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, మరికొందరు కార్యకర్తలు హత్యాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి వరకు ఉన్న ఆ రెండు పార్టీల సంబంధాలు పూర్తిగా క్షీణించాయి.

ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం.. పోలీసులు కేసు నమోదు చేయడం.. వెనువెంటనే ఇద్దరు కౌన్సిలర్లతో పాటు ఏడుగురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం చకచక జరిగిపోయాయి. ఈ పరిణామాలు ఎంఐఎం అధిష్ఠానానికి ఆగ్రహం కలిగించాయి. స్వయంగా రంగంలోకి దిగిన ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. నిజామాబాద్ జిల్లా జైలులో ఉన్న తమ పార్టీ కౌన్సిలర్లతో పాటు కార్యకర్తలను పరామర్శించి, సంచలన వ్యాఖ్యలు చేశారు.

బోధన్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో షకీల్ ఆమెర్‌ను ఓడించి తీరుతామని ప్రకటించి, జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేశారు. ఒవైసీ ప్రకటన ఒక్క షకీల్‌తోనే కాకుండా.. బీఆరెస్‌ నాయకత్వంతో రాజకీయ వైరాన్ని చాటినట్లయ్యింది. హైదరాబాద్‌ ఎంఐఎం భేటీలోనూ ఒవైసీ బోధన్‌లో షకీల్‌ను ఓడిస్తామని శపథం చేశారు.

ఒవైసీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా షకీల్ కూడా ఘాటుగా స్పందిస్తూ.. ఒవైసీ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు లొంగేది లేదని అన్నారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలువాలని, తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టాలని సవాల్ విసిరారు.

ఒవైసీ కూడా మెజార్టీ స్థానాల్లో రానున్న ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను బరిలోకి దించుతామన్నారు. షకీల్‌కు, ఒవైసీకి మధ్య సాగిన మాటల యుద్ధం రెండు పార్టీల మధ్య సంబంధాలను దెబ్బతీసేలా ఉన్నా బీఆరెస్ అధిష్ఠానం ఈ వివాదంపై స్పందించకపోవడం ఆసక్తిని రేపుతున్నది.