Nizamabad | పుంజుకుంటున్న కాంగ్రెస్.. ఆర్మూర్ బీజేపీ నేత వినయ్‌రెడ్డిపై హస్తం గురి?

Nizamabad ఎంపీ అర్వింద్‌.. ఒంటెద్దు పోకడలతో వలసలు విధాత, ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలో బీజేపి పార్టీకి ఊపిరి పోసిన నాయకుడు పొద్దుటూరు వినయ్‌ రెడ్డి.. నిన్నటిదాకా ఆర్మూర్‌ గడ్డ వినయ్‌ రెడ్డి అడ్డా అంటూ బాహాటంగా చెప్పుకుంటూ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటూ వ్యవహారిస్తున్నారు. ఆకస్మాత్తుగా ఇటీవల వినయ్ రెడ్డి మౌనం వహించాడని ఒక వైపు చర్చ కొనసాగుతుండగా… పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని మరోవైపు టాక్‌ […]

Nizamabad | పుంజుకుంటున్న కాంగ్రెస్.. ఆర్మూర్ బీజేపీ నేత వినయ్‌రెడ్డిపై హస్తం గురి?

Nizamabad

  • ఎంపీ అర్వింద్‌.. ఒంటెద్దు పోకడలతో వలసలు

విధాత, ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలో బీజేపి పార్టీకి ఊపిరి పోసిన నాయకుడు పొద్దుటూరు వినయ్‌ రెడ్డి.. నిన్నటిదాకా ఆర్మూర్‌ గడ్డ వినయ్‌ రెడ్డి అడ్డా అంటూ బాహాటంగా చెప్పుకుంటూ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటూ వ్యవహారిస్తున్నారు. ఆకస్మాత్తుగా ఇటీవల వినయ్ రెడ్డి మౌనం వహించాడని ఒక వైపు చర్చ కొనసాగుతుండగా… పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని మరోవైపు టాక్‌ బలంగా వినిపిస్తుంది.

జీవన్‌రెడ్డికి ఒకప్పుడు మిత్రుడిగా ఉన్న వినయ్‌రెడ్డి ఇద్దరి మద్య భేదాభిప్రాయాలు రావడంతో బీజేపిలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేయడమే కాకుండా అన్ని తానై నడిపించారు. తన స్వంత వ్యాపారాలు పక్కన పెట్టి మరి పార్టీ బలోపేతం చేసి ఆర్మూర్‌లో బీజేపి విస్తరణకు వ్యాపారాలను పక్కన పెట్టి గ్రామ, గ్రామాన బీజేపి పార్టీని విస్తరించాడు.

రైతుల దగ్గర నుండి యువత వరకు అందరికి కాషాయ జెండాను పరిచయం చేశాడు. ఆర్మూర్‌లో బీజేపి అంటేనే పొద్దుటూరు వినయ్‌ రెడ్డి అని పేరు తెచ్చుకున్నారు. ఇది నిన్నటిదాకా ఉన్న పరిస్థితి కాగా, ఇప్పుడు పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి. బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా కొనసాగుతున్న పొద్దుటూరి వినయ్‌ రెడ్డి కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారన్న చర్చ తెరపైకి వచ్చింది.

ఎంపీ అర్వింద్‌ ఆర్మూర్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న దగ్గరి నుండి ఇద్దరి మద్య దూరం పెరిగింది. ఇక ఆర్మూర్‌ నియోజకవర్గంలో బీజేపి తరపున ఏ కార్యక్రమం జరిగినా నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ను తెరపైకి తీసుకొస్తున్నారని వినయ్‌రెడ్డి వర్గీయుల్లో అసంతృప్తి నెలకొంది.

ఈ మధ్యనే ఎంపీ అర్వింద్‌ వ్యాపారవేత పైడి రాకేష్‌ను తెరపైకి తీసుకురావడంతో ఎంపీ అర్వింద్‌కు వినయ్‌ రెడ్డికి మధ్య దూరం మరింత పెరిగింది. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన సంపర్క్‌ అభియాన్‌ కార్యక్రమానికి వినయ్‌ రెడ్డి అంటిముట్టనట్టు వ్యవహరించాని పార్టీ శ్రేణులే గుసగుసలాడుతున్నాయి.

కాంగ్రెస్‌లోకి వినయ్‌రెడ్డి?

ఇటీవల వినయ్‌ రెడ్డి కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంంది. అంతే కాకుండా టిపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని కూడా కలిశారని, పార్టీ మారడం ఖాయం అన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నా వినయ్‌ రెడ్డి ఖండించకపోవడం అందుకు బలం చేకూరుతుంది. ఇక వినయ్‌ రెడ్డి ఆర్మూర్‌లో బీజేపి పార్టీ చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది.

ఇదిలా ఉండగా మొన్నటి వరకు ఆర్మూర్‌ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ పార్టీ వేటను కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో సర్వే కూడా చేయించినట్టు అందులో వినయ్‌ రెడ్డిపై మంచి అభిప్రాయం వ్యక్తమయినట్టు సమాచారం.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ పార్టీ వినయ్‌ రెడ్డిని పార్టీలోకి రప్పించే కసరత్తు మొదలు పెట్టిందట. కర్నాటక ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఊపుమీద ఉన్న సంగతి తెలిసిందే. ఇక టిపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అందరిని కలపుకునే పోవడానికి కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బలా బలాలను బేరీజు వేస్తు నియోజకవర్గంపై పట్టున్న నాయకుల వేటలో రేవంత్ ఉన్నారు.

ఖమ్మంలో అధికార పార్టీ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మొదలుకొని నిజామాబాద్ జిల్లాలో బాల్కొండలో ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అదినేత సునీల్‌ రెడ్డి వరకు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న వారే. మొన్నటి వరకు రాష్ట్రంలో బీజేపి రెండవ స్థానంలో ఉందని బిఆరెస్‌కు, బీజేపీకి మధ్యనే పోటి అంటూ ప్రచారం జరిగింది.

ఇతర పార్టీల నుండి వలసలు పెరుగుతాయన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యింది. బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించినప్పటి నుండి ద్వితీయ శ్రేణి నాయకులు నిరాశలో ఉన్నారు.

టిపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ధీటుగా కార్యక్రమాలు చేపట్టడం, సర్వేలు నిర్వహిస్తు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలా బలాలను బేరీజు వేస్తూ ప్రతిపక్ష పార్టీలలో అసంతృప్తులను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కర్ణాటక ఎన్నికల పిదప కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగడం ఆ పార్టీకి అనుకూలంగా మారింది.

ఈ పరిస్థితిలో బీజేపిలో ఉన్న అసంతృప్తులు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. సర్వేలో ముందున్న వారికే ప్రాధాన్యత ఉంటుందని రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీలో చోటు దక్కించుకోవడం కోసం క్యూ కడుతున్నారు.

ఇక వినయ్‌ రెడ్డి సైతం రేపో మాపో కండువా మార్చడం ఖాయం అన్న చర్చ తెరపైకి రావడం రాజకీయ వర్గాలలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్మూర్‌ గడ్డ వినయ్‌ రెడ్డి అడ్డా అని చెప్పుకున్న నాయకుడు బీజేపీలో కొనసాగుతారా లేక కాంగ్రెస్‌ పార్టీ కండువ కప్పుకుంటారా అన్నది మరికొన్ని రోజుల్లో బహిర్గతం కానుంది.