Bengal | అంబులెన్సుకు రూ.8 వేలు లేక.. కుమారుడి శవాన్ని బస్సులో తీసుకెళ్లిన తండ్రి
Bengal | విధాత: ప్రభుత్వాలు ఎన్ని పథకాలు రూపొందించినా వలస కార్మికుల వెతలు తీరడం లేదు. కనీసం వారి మృతదేహాలు స్వస్థలాలకు చేరడమూ గగనంగా మారింది. తాజాగా పశ్చిమ బెంగాల్ (Bengal)లో జరిగిన ఓ ఘటన వారి బతుకుచిత్రాన్ని మరోసారి కళ్లకు కట్టింది. రూ.8 వేలు లేక 200 కి.మీ. కన్న బిడ్డ మృతదేహాన్ని ఓ తండ్రి బస్సులో తీసుకెళ్లిన ఉదంతం ఇది.. బెంగాల్‌లోని దంగీపరాలో ఉంటున్న ఆసిమ్ దేవశర్మ ఓ వలస కార్మికుడు. అతడి ఇద్దరు […]

Bengal |
విధాత: ప్రభుత్వాలు ఎన్ని పథకాలు రూపొందించినా వలస కార్మికుల వెతలు తీరడం లేదు. కనీసం వారి మృతదేహాలు స్వస్థలాలకు చేరడమూ గగనంగా మారింది. తాజాగా పశ్చిమ బెంగాల్ (Bengal)లో జరిగిన ఓ ఘటన వారి బతుకుచిత్రాన్ని మరోసారి కళ్లకు కట్టింది. రూ.8 వేలు లేక 200 కి.మీ. కన్న బిడ్డ మృతదేహాన్ని ఓ తండ్రి బస్సులో తీసుకెళ్లిన ఉదంతం ఇది..
బెంగాల్‌లోని దంగీపరాలో ఉంటున్న ఆసిమ్ దేవశర్మ ఓ వలస కార్మికుడు. అతడి ఇద్దరు కవల పిల్లలు అనారోగ్యానికి గురి కావడంతో నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చేర్పించారు. ఒకరి ఆరోగ్యం కాస్త మెరుగుపడటంతో తల్లి ఆ బాబును తీసుకుని గురువారం రాత్రి ఇంటికి వెళ్లిపోయారు. తండ్రి మరో 5 నెలల వయసున్న తన బాబుతో ఆస్పత్రిలోనే ఉన్నారు.
కాగా.. చికిత్స తీసుకుంటూ ఆ బాబు శనివారం రాత్రి మరణించాడు. గుండెలవిసేలా రోదించిన తండ్రి ఆ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు ఇప్పించాలని ఆస్పత్రి వర్గాలను అభ్యర్థించాడు. దానికి వారు రూ.8 వేలు అవుతుందని తెలిపారు. తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో అతడు వేరే దారిని ఎంచుకున్నాడు.
నేను అప్పటికే పిల్లల వైద్యానికి రూ.16 వేలు ఖర్చు పెట్టాను. అంబులెన్సుకు ఇవ్వడానికి నా దగ్గర పైసా కూడా లేదు. దీంతో బెంగాల్‌లోని డార్జిలింగ్ నుంచి నా స్వస్థలమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాలియాగంజ్‌కు 200 కి.మీ. బస్సులో ప్రయాణించాను. తోటి ప్రయాణికులకు తెలిస్తే దించేస్తారేమోనని భయపడుతూనే ఉన్నా అని ఆ తండ్రి ఉబికివస్తున్న కన్నీటితో చెప్పారు.
కాలియాగంజ్‌లో ఓ స్నేహితుడు అంబులెన్సు ఏర్పాటు చేయడంతో ఇంటికి అంబులెన్సులో తీసుకెళ్లాడు. ఈ ఘటన బెంగాల్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి, ఇతర బీజేపీ నాయకులు తృణమూల్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దిగజారిపోతున్న వైద్య సదుపాయాలకు ఇది నిదర్శనమని వారు విమర్శించారు.