ప్రత్యేక హోదా లేదు.. పోలవరం పూర్తి కాదు.. క్లారిటీ ఇచ్చేసిన కేంద్రం!
విధాత: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి అంశాలు రెండే రెండు. పోలవరం ప్రాజెక్ట్.. ఇంకా ప్రత్యేక హోదా.. ఈ రెండు అంశాలనూ చూపిస్తూ నిత్యం ప్రజలను ఊరిస్తూ రాజకీయ పార్టీలు పబ్బం గడుపు కుంటూ వస్తాయి.. కానీ ఇప్పుడు కేంద్రం మాత్రం ఈ రెండు అంశాల మీదా ఆశలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది. పోలవరం ఇప్పుడే పూర్తి కాదని, దానికి బోలెడు టైం పడుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, […]

విధాత: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి అంశాలు రెండే రెండు. పోలవరం ప్రాజెక్ట్.. ఇంకా ప్రత్యేక హోదా.. ఈ రెండు అంశాలనూ చూపిస్తూ నిత్యం ప్రజలను ఊరిస్తూ రాజకీయ పార్టీలు పబ్బం గడుపు కుంటూ వస్తాయి.. కానీ ఇప్పుడు కేంద్రం మాత్రం ఈ రెండు అంశాల మీదా ఆశలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది.
పోలవరం ఇప్పుడే పూర్తి కాదని, దానికి బోలెడు టైం పడుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై రాజ్యసభలో వైసీపీ పీ సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్ శక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ నేడు రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.
పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతుందా అని వైసీపీ ఎంపీ ప్రశ్నించగా.. షెడ్యూల్ ప్రకారం 2024 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ, వివిధ కారణాల దృష్ట్యా ఈ గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని స్పష్టం చేసింది. పోలవరాన్ని పూర్తి చేస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్పినా పూర్తి కాలేదు.. అదే పాయింటుతోబాటు ప్రత్యేక హోదా అంశంతో అధికారంలోకి వైసీపీ వచ్చినా ఇప్పుడు కూడా పోలవరం 2024లోపు పూర్తికాదని కేంద్రం స్పష్టం చేయడంతో వైసీపీకి గొంతులో వెళక్కాయ పడ్డట్లు అయింది.
ప్రత్యేక హోదా కావాలి. ఇది ఏపీ జనం కోరిక. ఆ కోరికను పుట్టించింది కూడా రాజకీయ పార్టీలే. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మాట్లాడింది. బీజేపీ అయితే అయిదేళ్ళు కాదు పదేళ్ళు ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది.
ఆ తరువాత జరిగిన ఎన్నికల సభల్లో కూడా ఏపీలో ఊరూరా తిరుగుతూ బీజేపీ ప్రత్యేక హోదా మీద చాలానే మాట్లాడింది. అయితే తీరా అధికారంలోకి వచ్చాక నాలిక మడతేసింది. ఇపుడు మరోసారి అదే మాట బీజేపీ నోట వచ్చింది. ఆ పార్టీకి చెందిన ప్రణాళికా శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ పార్లమెంట్ లో తాజాగా మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే లేదు అని చెప్పేశారు.
అది ముగిసిన అధ్యాయమని చెప్పారు.
గతంలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యేక హోదా కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారని ఇపుడు జనరల్ కేటగిరీ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలకు ఏమీ తేడా చూపించకుండా అందరికీ ఒకేలా పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని గుర్తు చేశారు. అందువల్ల ప్రత్యేక హోదా అన్నది లేనే లేదని ఆయన మళ్ళీ తేల్చేశారు.
అంతే కాదు ఏపీకి సంబంధించి రెవెన్యూ లోటు పూడ్చేందుకు కూడా గ్రాంట్స్ ఇస్తున్నాం కాబట్టి ప్రత్యేక హోదా అన్నది మరచిపోవచ్చు అని తేల్చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ఇచ్చేది లేదని ఈ విషయంలో రెండవ మాట లేదు ఇదే చివరి మాట అని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఏపీకి ఇక ప్రత్యేక హోదా అనేది అసాధ్యం అని తేలిపోయింది.