Mani Shankar Aiyar | అయోధ్యపై విపరీత వ్యాఖ్యలు..
అయోధ్య నిర్మాణం, ప్రాణప్రతిష్ఠను వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలుస్తున్న కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్, సురన్య అయ్యర్‌లకు చేదు అనుభం ఎదురయ్యింది.

- ఇల్లు ఖాళీ చేయాలని కాంగ్రెస్ అగ్రనేతకు సొసైటీ నోటీసులు
Mani Shankar Aiyar | విధాత: అయోధ్య (Ayodhya) రామమందిరం నిర్మాణం, ప్రాణప్రతిష్ఠను వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలుస్తున్న కాంగ్రెస్ (Congress) పార్టీ కీలక నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) , ఆయన కుమార్తె సురన్య అయ్యర్‌లకు చేదు అనుభం ఎదురయ్యింది. దయ చేసి ఇల్లు ఖాళీ చేయాలని.. మీ వల్ల కాలనీలోని భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొంటూ దిల్లీలోని జాంగ్పురాలో వారు నివాసం ఉంటున్న హౌసింగ్ సొసైటీ నోటీసు ఇచ్చింది. మీరు ఇక్కడే నివాసం ఉంటూ.. భక్తులను ఇబ్బంది పెట్టాల్సిన పనిలేదని అందులో పేర్కొన్నారు.
‘ఇక్కడ నివాసం ఉంటున్న ఒక వ్యక్తి పైత్యం వల్ల ఇరుగుపొరుగు వారి మనోభావాలు దెబ్బతింటుంటే చూస్తూ ఉండలేం. మీరు అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకిస్తున్నారు కాట్టి.. అలాంటి ద్వేషాన్ని చూసీ చూడనట్లు వదిలేసే ఏదైనా ప్రదేశానికి నివాసం వెళ్లిపోండి’ అని ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా ఈ నెల 20న చేసిన ఫేస్బుక్ పోస్టులో తాను అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు వ్యతిరేకంగా ఒకరోజు ఉపవాసం ఉంటున్నట్లు సురన్య అయ్యర్ రాసుకొచ్చారు. ముస్లింలకు సానుభూతి, సౌహార్ద్రత ప్రకటించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. దీనిపైనా హౌసింగ్ సొసైటీ నోటీసులో ఆ కాలనీ వాసులు విమర్శలు గుప్పించారు.
‘ఆమె ఏదైతే పోస్టు పెట్టిందో.. అవి ఒక చదువుకున్న వ్యక్తి నుంచి వచ్చే మాటలు కావు. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామమందిరం అక్కడ ఏర్పాటయిందని ఆమె గుర్తించాలి. అదీ కూడా శాంతిపూర్వకంగా సుప్రీంకోర్టు తీర్పుతో సాధ్యమైంది’ అనిపేర్కొన్నారు. అందరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ అది అపరిమితమైన హక్కు కాదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని మీ ఇద్దరూ గుర్తించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఇప్పటికి మీ కుమార్తె మాటలను ఖండిస్తే ఇంట్లో ఉండొచ్చని.. లేదంటే వెళ్లిపోవాలని మణిశంకర్ అయ్యర్‌కు ఆ నోటీసులో సూచించారు. కాగా 2.67 ఎకరాల్లో నిర్మితమైన భవ్య రామమందిరాన్ని ఈ నెల 22న ప్రధాని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2025 కల్లా ఆలయ నిర్మాణం సంపూర్ణం కానుంది.