మ్రోగిన సింగరేణి ఎన్నికల నగరా.. ఆక్టోబర్ 28న ఎన్నికలు

స్థానిక ఉప ఎన్నికలపై వెనుకడుగు
విధాత, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడులైంది. ఆక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వాహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను బుధవారం సీఎల్‌సీ విడుదల చేశారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ తర్వాత స్క్రూటిని, విత్‌డ్రాకు అవకాశం ఇవ్వనున్నారు. 28న పోలింగ్ నిర్వహించడంతో పాటు అదేరోజు కౌంటింగ్ చేపట్టనున్నారు.
అయితే మే 22న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని గతంలో కేంద్ర కార్మిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వరుసగా పండగల నేపధ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం
కోరింది. సింగరేణి సంస్థ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు అక్టోబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఇటీవలనే 11వ వేజ్‌బోర్డు బకాయిలు 1450కోట్లను కార్మికుల ఖాతాల్లో వేశారు.
తాజాగా సీఎం కేసీఆర్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్‌గా కార్మికులకు దసరా కానుకగా అందించాలని నిర్ణయించి 700కోట్లు విడుదల చేశారు. దీంతో 39వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ నేపధ్యంలో అధికార బీఆరెస్ పార్టీ తమ అనుకూల సంఘాల గెలుపుపై ధీమాతో ఎన్నికలకు వెలుతోంది.
స్థానిక ఉప ఎన్నికలపై వెనుకడుగు
సింగరేణి కార్మిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైన ప్రభుత్వం ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల స్థానాలకు ఉప ఎన్నికల నిర్వాహణపై మాత్రం వెనుకడుగు వేస్తుంది. ప్రజాప్రతినిధుల మరణాలు, రాజీనామాలు, అనర్హతల కారణాలతో పలు స్థానిక సంస్థలకు సంబంధించి 6021స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 238సర్పంచ్ స్థానాలు, 5632వార్డులు, 130ఎంపీటీసీలు, 5జడ్పీటీసీలు, 17మున్సిపల్ వార్డులు ఖాళీగా ఉన్నాయి.
పంచాయతీ పాలకవర్గాలు గడువు జనవరిలో ముగిసిపోనుండగా డిసెంబర్‌లో ఎన్నికలు జరుపాలి. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు జరుపాలి. శాసన సభ ఎన్నికలు డిసెంబర్‌లో జరుగనున్నాయి. ఇప్పటికిప్పుడు వాటికి ఎన్నికలు జరిపితే ప్రతికూల ఫలితాలోస్తే ఆ ప్రభావం శాసన సభ ఎన్నికలపై పడుతుందన్న ఆలోఛనతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఖాళీలకు ఉప ఎన్నికల నిర్వాహణకు వెనుకడుగు వేసిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.