ఒమర్ అబ్దుల్లాకు షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు.. విడాకుల పిటిషన్
నేషనల్ కార్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది.

Omar Abdullah | నేషనల్ కార్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. విడిపోయిన భార్య పాయల్ నుంచి విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌కు ఎలాంటి అర్హత లేదని పేర్కొంది. జస్టిస్ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్ వికాస్ మహాజన్ ధర్మాసనం గతంలో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
ట్రయల్ కోర్టు 2016లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన అప్పీలుకు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. పాయల్ తన పట్ల క్రూరంగా వ్యవహరిస్తోందని, తన విడాకుల అభ్యర్థనపై ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టును కోరారు.
అయితే, ఒమర్ అబ్దుల్లా ట్రయల్‌ను కోర్టును ఆశ్రయించగా.. 2016లో కోర్టు కొట్టివేసింది. అబ్దుల్లా ఆరోపణలను రుజువు చేయలేకపోయారని ట్రయల్ కోర్టు చెప్పింది. పాయల్‌కు మధ్యంతర భరణంగా ప్రతి నెలా రూ.1.5లక్షలు చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు ఒమర్ అబ్దుల్లాను ఇప్పటికే ఆదేశించింది.
అదనంగా ఇద్దరు కొడుకుల చదువుల కోసం ప్రతి నెలా రూ.60వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. పిల్లలు మేజర్ అయినంత మాత్రాన వారిని పోషించడం, సరైన విద్యను అందించడం తదితర బాధ్యతల నుంచి తండ్రి తప్పించుకోరాదని.. తల్లి మాత్రమే పిల్లల పోషణకు అయ్యే ఖర్చుల భారాన్ని భరించకూడదని ఢిల్లీ హైకోర్టు గతంలో ఆదేశాల్లో స్పష్టం చేసింది.