విధాత: నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు మరోసారి ఫ్లెక్సీల పంచాయతీకి వేదికయ్యాయి. సోమవారం బిఆర్ఎస్ పార్టీ నేత చకిలం అనిల్ కుమార్ తన తండ్రి సర్దార్ చకిలం శ్రీనివాస్ రావు పంతులు శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవ ప్రచారం కోసం అనిల్ వర్గం జిల్లా కేంద్రంలో ప్రచార ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశారు. ఇదే రోజు నల్గొండ పట్టణంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమం […]
విధాత: నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు మరోసారి ఫ్లెక్సీల పంచాయతీకి వేదికయ్యాయి. సోమవారం బిఆర్ఎస్ పార్టీ నేత చకిలం అనిల్ కుమార్ తన తండ్రి సర్దార్ చకిలం శ్రీనివాస్ రావు పంతులు శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవ ప్రచారం కోసం అనిల్ వర్గం జిల్లా కేంద్రంలో ప్రచార ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశారు.
ఇదే రోజు నల్గొండ పట్టణంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండటంతో సంబంధిత ప్రచార పోస్టర్లను వారు కూడా పట్టణంలో ఏర్పాటు చేశారు. అయితే చాలా చోట్ల చింతరెడ్డి ఫ్లెక్సీలను చకిలం శతజయంతి ఉత్సవాల ఫ్లెక్సీలపై ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది.
అయితే బీఆర్ఎస్లోని అనిల్ వ్యతిరేక వర్గీయులే చకిలం శత జయంతి ఉత్సవాల ఫ్లెక్సీలపై కావాలనే చింతరెడ్డి ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయించారని చకిలం అభిమానులు అనుమానిస్తున్నారు.
గతంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ప్రచార పోస్టర్లపై కూడా ప్రైవేటు కోచింగ్ సెంటర్ల పోస్టర్లు అతికించగా ఈ వ్యవహారం వెనుక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రమేయం ఉందంటూ చాడ బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇపుడు చకిలం శత జయంతి ఫ్లెక్సీలపై పోటీ ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం వెనుక కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రోద్బలం ఉండవచ్చని చకిలం అభిమానులు అసహనంతో రగిలిపోతున్నారు.
శతజయంతి ఉత్సవాలను దెబ్బతీసే కుట్రతో జనాన్ని రాకుండా తెరవెనుక ప్రయత్నాలు చేసిన నియోజక వర్గ బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే చకిలం ఫ్లెక్సీల పై పోటీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించి, చిల్లర రాజకీయ కుతంత్రాలు చేశారని చకిలం అభిమానులు భగ్గుమంటున్నారు.
అయినా వారేన్ని కుట్రలకు తెరలేపిన చకిలం అభిమానులు ఏ మాత్రం తగ్గబోరంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ లో సాగుతున్న రచ్చకు నిదర్శనంగా నిలిచింది.