C-Voter Survey | చంద్రబాబుకే సానుభూతి.. సీ-ఓట‌ర్‌ సర్వే సంచలనం

C-Voter Survey రాజకీయ కక్షతోనే టీడీపీ అధినేత అరెస్ట్‌ అభద్రతలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పవన్‌ మద్దతుతో బాబు సీఎం తథ్యం అరెస్టుతో చంద్రబాబుకే రాజకీయ మేలు సీ ఓటర్ సర్వేలో సంచలన అంశాలు విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు అరెస్టు పట్ల ఆంధ్రప్రదేశ్ లో మెజార్టీ ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారని, రాజకీయ కక్షతోనే ఆయన అరెస్టు జరిగినట్లుగా భావిస్తున్నారని సీఓటర్‌ సర్వేలో వెల్లడైంది. ఏపీలో రాజకీయంగా సంచలనం రేపిన […]

  • By: Somu    latest    Sep 20, 2023 11:33 AM IST
C-Voter Survey | చంద్రబాబుకే సానుభూతి.. సీ-ఓట‌ర్‌ సర్వే సంచలనం

C-Voter Survey

  • రాజకీయ కక్షతోనే టీడీపీ అధినేత అరెస్ట్‌
  • అభద్రతలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి
  • పవన్‌ మద్దతుతో బాబు సీఎం తథ్యం
  • అరెస్టుతో చంద్రబాబుకే రాజకీయ మేలు
  • సీ ఓటర్ సర్వేలో సంచలన అంశాలు

విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు అరెస్టు పట్ల ఆంధ్రప్రదేశ్ లో మెజార్టీ ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారని, రాజకీయ కక్షతోనే ఆయన అరెస్టు జరిగినట్లుగా భావిస్తున్నారని సీఓటర్‌ సర్వేలో వెల్లడైంది. ఏపీలో రాజకీయంగా సంచలనం రేపిన చంద్రబాబు అరెస్టుపై ప్రజలు, ప్రధాన రాజకీయ పార్టీల శ్రేణులు ఏమనుకుంటున్నాయన్న దానిపై సీ ఓటర్ సంస్థ ఆరు ప్రశ్నలతో సర్వే నిర్వహించింది. ఫోన్ ద్వారా 1809 శాంపిల్స్ ద్వారా అభిప్రాయాలు సేకరించింది. చంద్రబాబు అరెస్టుతో టీడీపీకి విపరీతమైన సానుభూతి పెరిగిందని సర్వేలో తేలింది. సీ ఓటర్ సర్వేను ఐఏఎన్‌ఎస్‌ న్యూస్ ఏజెన్సీ ట్వీట్‌ చేయగా సర్వే నివేదిక వైరల్‌గా మారింది.

చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమని, బాబు అరెస్టుతో జగన్‌లో అభద్రతాభావం పెరిగిందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపటం తథ్యమని, జనసేన పొత్తుతో చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయమంటూ మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారని సీ ఓటర్‌ సర్వే నివేదిక పేర్కొన్నది. బాబు అరెస్టుతో పెద్దగా రాజకీయ నష్టం జరుగదని వైసీపీ శ్రేణులు భావిస్తుండగా, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల శ్రేణులు, ఇతరులు మాత్రం అందుకు విరుద్ధంగా తమ అభిప్రాయాలు వెల్లడించడం గమనార్హం.

ఆరు ప్రశ్నలు..

సర్వేలో భాగంగా ఓ ఓటర్ సంస్థ ఆరు ప్రశ్నలతో ప్రజలు, పార్టీల శ్రేణుల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. వాటిలో స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిన తీరుపై ఏమనుకుంటున్నారన్న ప్రశ్నకు పక్కా రాజకీయ కక్ష సాధింపుకే అరెస్టు జరిగిందని 52.1% మంది పేర్కొన్నారు. చట్ట ప్రకారమే అరెస్టు జరిగిందని 31.3 శాతం, తెలియదు/ చెప్పలేమని 16.6 శాతం మంది చెప్పారు. అరెస్టుతో చంద్రబాబుకు సానుభూతి ఏర్పడిందా? అన్న ప్రశ్నకు అవునని 53.1 శాతం మంది చెప్పడం విశేషం. లేదని 31.6శాతం మంది, తెలియదు, చెప్పలేమని 15.3శాతం మంది చెప్పారు.

చంద్రబాబు అరెస్టుతో ఏపీ సీఎం జగన్ అభద్రతలో ఉన్నారా? అన్న ప్రశ్నకు అవునని 58.1శాతం మంది స్పందించడం గమనార్హం. లేదని 29.9శాతం, తెలియదు చెప్పలేమని 12శాతం మంది సమాధానమిచ్చారు. చంద్రబాబు అరెస్టు ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుందా? అన్న ప్రశ్నకు చంద్రబాబుకు ఎన్నికల్లో మేలు చేస్తుందని 56.1శాతం మంది అభిప్రాయపడితే.. ఈ అరెస్టు సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ఉపయోగ పడుతుందని 21.3శాతం మాత్రమే పేర్కొనడం గమనార్హం. ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోదని 14.9శాతం మంది, తెలియదు చెప్పలేమని 7.7శాతం మంది చెప్పారు.

పవన్‌తో పొత్తు చంద్రబాబుకు కలిసి వస్తుందా అన్న పశ్నకు అవునని 60.6శాతం, కాదని 28.5శాతం, తెలియదు చెప్పలేమని 11శాతం మంది తమ అభిప్రాయలు వెల్లడించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత జగన్‌పై మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు సానుకూలమేనని 27.9శాతం మంది, సానుకూలమేనని అయితే ప్రతికూలంగా మారిందని 22.6శాతం మంది, ప్రతికూలమని అది మరింత పెరిగిందని 15.9శాతం మంది, ప్రతికూలత ఉన్నా సానుకూలంగా మారిందని 7.7శాతం మంది, తెలియదు, చెప్పలేమని 25.9శాతం మంది తమ అభిప్రాయాలను తెలిపారు.