MUNUGODE: రాజగోపాల్ తెచ్చెను తంటా.. వెంకన్నకు రాజుకున్న మంట!
ఉన్నమాట: మునుగోడు ఉప ఎన్నికతో అధికార టీఆర్ఎస్, బీజేపీల కంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నట్టు కనిపిస్తున్నది. మంత్రి కేటీఆర్ వెంకట్‌రెడ్డిని కోవర్ట్ అని ఆరోపించారు. దీనికి ఆయన స్పందించి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అయితే ఎన్నికల సమయంలో అవి ఎక్కువగా శృతి మించుతాయి. ఎన్నికల్లో వాటి ప్రభావం కూడా ఉంటుంది. అందుకే మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది అంటున్నారు. రాజగోపాల్‌రెడ్డి […]

ఉన్నమాట: మునుగోడు ఉప ఎన్నికతో అధికార టీఆర్ఎస్, బీజేపీల కంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నట్టు కనిపిస్తున్నది. మంత్రి కేటీఆర్ వెంకట్‌రెడ్డిని కోవర్ట్ అని ఆరోపించారు. దీనికి ఆయన స్పందించి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అన్నారు. రాజకీయంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అయితే ఎన్నికల సమయంలో అవి ఎక్కువగా శృతి మించుతాయి. ఎన్నికల్లో వాటి ప్రభావం కూడా ఉంటుంది. అందుకే మునుగోడు ఉప ఎన్నిక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది అంటున్నారు.
రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డిపై, ఆపార్టీ అధిష్ఠానంపై విమర్శలు చేసినా అవన్నీ టీకప్పులో తుఫానులా ముగిసిపోయాయి. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికీ రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావడం ఇష్టం లేదు. బహిరంగంగానే వాళ్లిద్దరూ ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించారు. రేవంత్‌కు అవకాశం కల్పించడానికి, ఆయనకు అధిక ప్రాధాన్యం దక్కడానికి పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూరే కారణమని చాలా ఘాటు విమర్శలు చేశారు. అయినా పార్టీ అధిష్ఠానం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో అనేకసార్లు సంప్రదించి, బుజ్జగించి పార్టీ కష్టకాలంలో ఉన్నదని కలిసి పనిచేయాలని, సర్దుకుపోవాలని ఇటు రేవంత్‌కు, అటు వెంకట్‌రెడ్డికి సూచించింది.
కానీ రాజగోపాల్‌రెడ్డి బీజేపీకిలోకి వెళ్లిన తర్వాత ఆయన కంటే వెంటక్‌రెడ్డి మీదనే ఎక్కువగా ఒత్తిడి పెరిగింది. మా ఇద్దరి అన్నదమ్ముల ఆలోచనలు వేరు కాదని, మా అభిప్రాయాలు ఒక్కటే అనే అర్థంలో ఆయన వ్యాఖ్యానించారు. దీంతో వెంకట్‌రెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకుంటారనే చర్చ జరిగింది. అయితే స్టార్ క్యాంపెయిర్‌గా ఉన్న ఆయన దాన్ని ఖండించి తన సోదరుడి నిర్ణయానికి తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు.
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడం, మునుగోడుకు ఉప ఎన్నిక రావడంతో ప్రస్తుతం వెంకట్‌రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకలా తయారైంది. తన పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయలేక, తమ్ముడికి వ్యతిరేకంగా పనిచేయడం ఇష్టం లేక నానా అవస్థలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఆయనపై చేసిన కోవర్ట్ అనే అంశం చర్చకు వచ్చింది.
కేటీఆర్ వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసిన వెంటక్‌రెడ్డి ఓ టీవీ ఛానల్‌లో మునుగోడులో తన స్టాండ్ ఏమిటో చెప్పి అడ్డంగా బుక్ అయ్యారు. ఆ జర్నలిస్టు ఇంతకు మీరు మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తారా లేదా అంటే.. మీ సోదరునికి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేస్తారా? అని వెంకట్‌రెడ్డి తిరిగి ప్రశ్నించారు. నాకు సోదరుడు లేడని జవాబు ఇచ్చాడు.
ఉన్నాడని ఊహించుకుని ఈ పరిస్థితిలో నువ్వు ఏం చేస్తావంటే ఆయన ఏ మాత్రం తడుముకోకుండా నేను తన తమ్ముడి పక్షాన పని చేస్తానని కుండబద్దలు కొట్టారు. దీంతో కోమటిరెడ్డి కూడా తాను అదే చేస్తున్నాను అన్నట్టు చెప్పాడు. దీన్నే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది కోవర్ట్ రాజకీయాలు కాక మరేమిటి అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో పరిస్థితి సమస్య తమ్ముడి అయితే తిప్పలు వెంకట్‌రెడ్డివి అన్నట్టు తయారైంది.