ఆపదలో అండగా ఉంటా.. ఆదరించి గెలిపించండి: పద్మాదేవేందర్ రెడ్డి

పదేళ్లుగా మెదక్ పట్టణాన్ని ప్రగతి బాటన నడిపిస్తున్నా.. ఈప్రాంత ఆడబిడ్డను... ప్రజల కష్టాసుఖాలు నాకు బాగా తెలుసు. ఆపదలో అండగా నిలుస్తున్నా... పదేళ్ల చిన్న పిల్లోడు నుంచి వందేళ్ళ పెద్దవాళ్ళ వరకు నన్ను అక్కా అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. మీఇంటి ఆడపడుచుగా మరోసారి నన్ను ఆదరించి గెలిపించండి’ అని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు

  • By: Somu    latest    Nov 22, 2023 12:24 PM IST
ఆపదలో అండగా ఉంటా.. ఆదరించి గెలిపించండి: పద్మాదేవేందర్ రెడ్డి
  • మెదక్‌లో ఇంటింటి ప్రచారం.. అడుగడుగునా ఘన స్వాగతం


విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ‘పదేళ్లుగా మెదక్ పట్టణాన్ని ప్రగతి బాటన నడిపిస్తున్నా.. ఈప్రాంత ఆడబిడ్డను… ప్రజల కష్టాసుఖాలు నాకు బాగా తెలుసు. ఆపదలో అండగా నిలుస్తున్నా… పదేళ్ల చిన్న పిల్లోడు నుంచి వందేళ్ళ పెద్దవాళ్ళ వరకు నన్ను అక్కా అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. మీఇంటి ఆడపడుచుగా మరోసారి నన్ను ఆదరించి గెలిపించండి’ అని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధ‌వారం మెదక్ పట్టణంలోని 9, 11, 26, 27 వార్డుల్లో ఆమె ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. మహిళలు పసుపు, కుంకుమ అందజేశారు. శాలువాలు, పూలమాలలతో సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మెదక్ పట్టణం అభివృద్ధిలో ఎంతో వెనుకబడిపోయిందని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. జిల్లాకేంద్రమైన మెదక్ పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.


కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మాతాశిశు సంరక్షణ ఆస్పత్రి, రైల్వే, పట్టణంలో రోడ్ల విస్తరణ, మురుగు కాలువల నిర్మాణం తదితర పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. పట్టణంలో వైద్య కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. పేద ఇంటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత, చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు.


కాంగ్రెస్ వస్తే కష్టాల పాలవుతామని, రేవంత్ రెడ్డి పంటల సాగుకు మూడు గంటల కరెంటు చాలు అంటుండగా.. మరో నాయకుడు ఉత్తంకుమార్ రెడ్డి రైతుబంధు నిలిపివేయాలని అంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్, కౌన్సిలర్లు మేడి కళ్యాణి, జయశ్రీ, సుంకయ్య, సమియొద్దీన్, గడ్డమీద యశోద, శేకమ్మ, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఉమర్, మాజీ కౌన్సిలర్ చంద్రకళ, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, దుర్గాప్రసాద్, మధుసూదన్ రావు, శివరామకృష్ణ కొండ శ్రీనివాస్, జగదీశ్వర్, మధు జుబేర్, సంగ శ్రీకాంత్, ఫాజిల్ పాపయ్య, కిరణ్, ప్రసాద్, అరవింద్, చందు పాషా పాల్గొన్నారు.