KRMB | కృష్ణా జలాలపై కేసీఆర్ ద్రోహం!

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్ఎంబీ) చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది

  • By: Somu    latest    Feb 08, 2024 11:16 AM IST
KRMB | కృష్ణా జలాలపై కేసీఆర్ ద్రోహం!
  • కమీషన్ల కోస‌మే రాయలసీమకు నీటి వాటా
  • తెలంగాణకు రావాల్సినవి 551 టీఎంసీలు
  • 299 టీఎంసీలకు పరిమితం చేసిన కేసీఆర్
  • జ‌గ‌న్‌తో కుమ్మ‌క్క‌య్యే సీమ ప్రాజెక్టుల‌కు నీళ్లు
  • పాలమూరు కాంగ్రెస్ నేత‌ల ఆగ్ర‌హం


KRMB | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్ఎంబీ) చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. నీటి కేటాయింపులో తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలోని జగన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నార‌ని బీఆరెస్ నేత‌లు చెబుతుంటే.. ఎనిమిదేళ్ల క్రిత‌మే అప్పటి సీఎం కేసీఆర్‌ తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై కమీషన్లకు కక్కుర్తి పడి, రాయలసీమ ప్రాజెక్టులకు మేలు చేకూర్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇలా ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.


కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డులో జరిగిన అసలు విషయంలోకి వస్తే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 60 ఏళ్ళు కృష్ణాజలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కన్నా పదేండ్ల కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసీఆర్​ అసమర్థతతో కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింద‌ని పాల‌మూరు కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. సహజ న్యాయసూత్రాలు, పరీవాహక ప్రాంతం, కరువు ప్రభావ ప్రాంతం ఇలా ఏ ప్రాతిపదిక తీసుకున్నా.. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు వాటాగా 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీల నికర జలాలు దక్కాల్సి ఉందని కృష్ణా రివర్ బోర్డు స్పష్టంగా తెలిపింది.


ఇక్కడే కేసీఆర్ తన తెలివిని ప్రదర్శించార‌ని జిల్లా రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. బోర్డు అభిప్రాయానికి విరుద్ధంగా ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చేలా 2015లో ఒప్పందంపై అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం సంతకం చేసింద‌ని చెబుతున్నారు. ఒక్క సంతకంతో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింద‌ని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎం అయ్యాక నది జలాల పంపకాలకు శ్రీకారం చుట్టారు. జగన్‌తో కుమ్మక్కైన‌ కేసీఆర్.. తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రకు తాకట్టు పెట్ట‌డంతో కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాయలసీమ ప్రాజెక్టులకు తరలివెళితున్నాయ‌ని అంటున్నారు.


అపెక్స్ క‌మిటీ భేటీకి కేసీఆర్ ఎందుకు పోలేదు?


తెలంగాణలో కాంగ్రెస్ ​అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్ప‌గించింద‌ని బీఆరెస్ అగ్ర‌నాయ‌క‌త్వం ఆరోపిస్తున్న‌ది. అయితే.. చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగుతున్నార‌ని ఆ పార్టీ నేత‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు చేస్తున్నారు. అప్పట్లో రాయలసీమ లిఫ్ట్​ టెండర్లు పూర్తయ్యేదాకా అపెక్స్​ భేటీకి కేసీఆర్​ హాజరు కాలేదనే విమర్శలు ఉన్నాయి. 2023 -24 బడ్జెట్​ప్రతిపాదనల్లో కేఆర్ఎంబీకి శ్రీశైలం, నాగార్జునసాగర్​ ప్రాజెక్టులు అప్పగిస్తున్నట్లు ప్రతిపాదిస్తూ.. బోర్డు నిర్వహణకు, వన్​టైం సీడ్​మనీ కింద రూ.200 కోట్లు కేటాయింపులు కూడా జ‌రిగిన విష‌యాన్ని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌స్తావిస్తున్నారు.


జ‌గ‌న్‌తో భేటీ అనంత‌ర‌మే!


కేసీఆర్, జగన్​ ప్రగతి భవన్​లో ఏకాంతంగా మాట్లాడుకున్న తర్వాతనే రాయలసీమ ఎత్తిపోతలకు బీజం పడింద‌ని, తెలంగాణకు కృష్ణా నది నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే 8 టీఎంసీలను రాయలసీమకు మళ్లించేలా ఇద్దరు కలిసి కుట్ర చేశార‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. 2020 జనవరిలో కేసీఆర్, జగన్​ సమావేశమైతే అదే ఏడాది మే నెలలో శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీలు తరలించే రాయలసీమ ఎత్తిపోతలకు ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింద‌ని గుర్తు చేస్తున్నారు.


కేంద్రం అపెక్స్​ కౌన్సిల్​ సమావేశానికి పిలిచినా ఆ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే దాకా వెళ్లకుండా జగన్​కు కేసీఆర్ ​సహకరించారనే ఆరోపణలు అప్పట్లో వెలుగుచూశాయి.కేసీఆర్ అండతో జగన్ రాయలసీమ ప్రాజెక్టుల‌కు నీళ్లు తరలించుకు పోతున్నారని కాంగ్రెస్ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.


దొంగే దొంగ అన్న‌ట్టు బీఆరెస్ నేత‌ల మాట‌లు


కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డు విషయంలో తెలంగాణకు ద్రోహం చేసిందే అప్పటి సీఎం కేసీఆర్‌. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటి వాటా దక్కకుండా చేసిందే కేసీఆర్​ ప్రభుత్వం. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, బీఆరెస్ ఎమ్మెల్యేలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. దొంగే దొంగ అన్నట్లు ఉన్న‌యి బీఆరెస్ నేతల మాటలు. కమీషన్లకు కక్కుర్తి పడి కేసీఆర్ నీటి వాటాల్లో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు.


కృష్ణా బోర్డుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించలేదు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, విద్యుత్తు రంగంలో బీఆరెస్‌ పార్టీ చేసిన దోపిడీ బయటపడుతుండటంతో దోపిడీని పక్కదారి పట్టించేందుకే ఆ పార్టీ నేత‌లు కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారు. కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​ బోర్డుకు ప్రాజెక్టులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. తెలంగాణకు నీటి కేటాయింపుల్లో మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీనే.


దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి


తెలంగాణ నీటిని రాయలసీమకు తాకట్టు పెట్టిన కేసీఆర్ తెలంగాణకు రావాల్సిన 551 టీఎంసీల వాటా 299 తగ్గడానికి కారణం అప్పటి సీఎం కేసీఆర్. రాయలసీమ లిఫ్ట్​ టెండర్లు పూర్తయ్యేదాకా అపెక్స్​ భేటీకి కేసీఆర్​ ఎందుకు హాజరు కాలేదో ఆ పార్టీ నేతలు చెప్పాలి. కేసీఆర్​ అసమర్థతతోనే కృష్ణా నీళ్లలో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాగా 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీల నికర జలాలు దక్కాల్సి ఉన్నాయి.


అందుకు విరుద్ధంగా ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇచ్చేలా 2015లో కేసీఆర్ ప్రభుత్వం సంతకం చేసింది. దీంతో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇది దాచి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చాల్లే ప్రయత్నం బీఆరెస్ నేతలు మానుకోవాలి. బీఆరెస్ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేఆర్ఎంబీకి బడ్జెట్లో అప్పటి సీఎం కేసీఆర్ కేటాయించిన నిధులకు సంబంధించిన ప‌త్రాలు మా వద్ద ఉన్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.