Telangana | పాలమూరు- రంగారెడ్డి: పూర్తికాకుండానే.. ప్రారంభోత్సవమా!

Telangana | అసంపూర్తిగా పాలమూరు- రంగారెడ్డి పనులు తొమ్మిది మోటర్లకు ఒక్కటే సిద్ధం 6 రిజర్వాయర్లలో ఒక్కటే 90% పూర్తి కాలువలు, టన్నెల్ పనులు పెడింగ్‌లోనే కొన్ని పనులకు టెండర్లే పిలవలేదు ప్రభుత్వ అసమర్థ వైఖరి వల్లే జాప్యం ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రారంభోత్సవం పాలమూరు కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం విధాత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికాకుండానే సీఎం కేసీఆర్ ప్రారంభించడానికి సన్నాహాలు చేయడం ప్రజలను మోసగించడమే అని […]

  • By: Somu    latest    Sep 08, 2023 12:58 AM IST
Telangana | పాలమూరు- రంగారెడ్డి: పూర్తికాకుండానే.. ప్రారంభోత్సవమా!

Telangana |

  • అసంపూర్తిగా పాలమూరు- రంగారెడ్డి పనులు
  • తొమ్మిది మోటర్లకు ఒక్కటే సిద్ధం
  • 6 రిజర్వాయర్లలో ఒక్కటే 90% పూర్తి
  • కాలువలు, టన్నెల్ పనులు పెడింగ్‌లోనే
  • కొన్ని పనులకు టెండర్లే పిలవలేదు
    ప్రభుత్వ అసమర్థ వైఖరి వల్లే జాప్యం
  • ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రారంభోత్సవం
  • పాలమూరు కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం

విధాత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికాకుండానే సీఎం కేసీఆర్ ప్రారంభించడానికి సన్నాహాలు చేయడం ప్రజలను మోసగించడమే అని మహబూబ్‌నగర్‌ డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనుల తీరుపై చర్చించారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే ప్రజలను బీఆర్ఎస్ మభ్య పెడుతున్నదని విమర్శించారు. పనులు పూర్తికాని పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభించడంలో ఉద్దేశం అదే అన్నారు. నార్లాపూర్ ఎత్తిపోతలకు తొమ్మిది మోటర్లకు గాను ఒక్కటే సిద్ధమైందని చెప్పారు. ప్రాజెక్టు పనులు ఇంకా 45% మేర పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అయినా.. పాలమూరు ప్రజలను దగా చేసేందుకు ప్రాజెక్టు ప్రారంభం అంటూ కేసీఆర్ మాయ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నార్లాపూర్​ ​పనులే ఇంకా 30% పెండింగ్​

ప్రాజెక్టును 21 ప్యాకేజీలుగా విభజించి పనులు చేస్తూ, నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్‌, లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తున్నారని, మొదటి ప్యాకేజీలో నిర్మిస్తున్న నార్లాపూర్​ రిజర్వాయర్ ​పనులే ఇంకా 30% పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

ఒక్క మోటరుతోనే ఎత్తిపోతలా?

శ్రీశైలం బ్యాక్​వాటర్ ఆధారంగా నార్లాపూర్​ పంప్​హౌస్​ నుంచి నీటిని ఎత్తిపోయాల్సి ఉందని, ఇక్కడ తొమ్మిది మోటర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ప్రస్తుతానికి ఒక్కటే సిద్ధం చేసి, ప్రారంభోత్సవం పేరిట బీఆర్ఎస్ హడావుడి చేస్తున్నదన్నారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభం చేయనున్న మోటరు ద్వారా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్​ రిజర్వాయర్​లోకి నీటిని లిఫ్ట్​ చేస్తారని, అక్కడి నుంచి మెయిన్​ కెనాల్ ద్వారా ఏదులకు నీటిని తరలించాల్సి ఉన్నా, మధ్యలో మెయిన్​ కాలువ పనులు పెండింగ్​లో ఉన్నాయని చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఒక మోటర్ లాభం ఏంటని ప్రశ్నించారు. ఏదుల నుంచి వట్టెం మెయిన్ కెనాల్, వట్టెం రిజర్వాయర్, పంప్​హౌస్, కర్వెన మెయిన్ ​కెనాల్ పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. కర్వెన నుంచి ఉద్దండాపూర్‌ రిజర్వాయర్ వరకు 18 కిలోమీటర్ల మేర అండర్​ టన్నెల్​ పనులు చేయాల్సి ఉండగా, కొంతదూరం మాత్రమే పూర్తి చేశారని, ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. ప్రజలను మభ్య పెట్టేందుకే బీఆర్ఎస్ నాయకులు ప్రారంభోత్సవం అంటూ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు.

ముందుకు కదలని ప్యాకేజీ పనులు

పాలమూరు ప్రాజెక్ట్ రిజర్వాయర్ కింద 16వ ప్యాకేజీలో పంప్​హౌస్​ పనులు పెండింగ్​లో ఉన్నాయని, 17, 18వ ప్యాకేజీలలో ఇప్పటి వరకు కట్టపనులు 15 శాతమే పూర్తయ్యాయని, 400 కేవీ టవర్​ లైన్స్, సబ్​స్టేషన్లు, స్విచ్​యార్డ్​ పనుల్లో అన్ని స్కీంల వద్ద 40 శాతానికి మించి జరగలేదన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​ పనులకు టెండర్లు పిలవాల్సి ఉండగా పక్కకు పెట్టారని, మరో మూడు ప్యాకేజీల పనులకు టెండర్లు పిలవాల్సి ఉందని తెలిపారు.

పెరిగిపోయిన అంచనా వ్యయం

2015లో ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.35,200 కోట్లు కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2019లో ఇచ్చిన 321 జీపీ ప్రకారం వ్యయం 52,056.31 కోట్లకు పెరిగిందని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థ వైఖరి కారణంగా ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు.

నిర్వాసితులను గాలికొదిలేశారు..

భూసేకరణ పరిహారం చెల్లింపులు, నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు ఇప్పటికీ పెండింగ్​లో ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. నార్లాపూర్, ఉద్దండాపూర్‌ రిజర్వాయర్ల కింద దాదాపు 650 ఎకరాల భూసేకరణ ఇంకా మిగిలిపోయిందని, ఈ భూములకు సంబంధించి దాదాపు 120 మంది రైతులు 2013 చట్టం ప్రకారం కుటుంబానికి ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్​ చేస్తున్నారని తెలిపారు.

నార్లాపూర్​ కింద అంజనగిరి, వడ్డెగుడిసెలు, సున్నపుతండాల్లో 110 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించినా, వీరికి ఆర్​అండ్​ఆర్​ ప్యాకేజీని వర్తింపజేయలేదని చెప్పారు. ఉద్దండాపూర్‌ కింద వల్లూరు, ఉద్దండాపూర్‌, రేగడివట్టితండా, మాటుబండతండా, గొల్లోనిదొద్దడి తండా, తుమ్మలబండ తండా, సాధుగుడిసెల తండాల్లో మూడు వేల మందికి పైగానే నిర్వాసితులను గుర్తించారని వారు పేర్కొన్నారు.

ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం ప్రభుత్వం భూసేకరణ చేసినా, ఇప్పటికీ ప్లాట్లు చేసి వారికి ఇళ్లను కట్టివ్వలేదని తెలిపారు. కేసీఆర్​ స్విచ్ ఆన్​చేస్తే నీళ్లు పోయనున్న నార్లాపూర్​ రిజర్వాయర్​కింద ముంపు బాధితులు ఇప్పటికీ ఖాళీ చేయలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు పేరుతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని, కానీ బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

సోనియా సభ నుంచి దృష్టి మరల్చేందుకే

సీడబ్ల్యుసీ సమావేశాలు, సెప్టెంబర్ 17 సోనియా గాంధీ సభ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ కుట్ర పన్ని రిజర్వాయర్ ప్రారంభోత్సవాన్ని హడావుడిగా తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు, పూర్తికాని ప్రాజెక్టును ఆదరాబాదరగా ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారన్నారు.

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ఒరగబెట్టిందేమీ లేదని, ఈ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చి, ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిందే కాంగ్రెస్ అని తెలిపారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ వెంటనే యుద్ధప్రాతిపదికన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బెనహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొండ జగదీశ్వర్ పాల్గొన్నారు.