పన్నీరు సెల్వంకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. జనరల్ సెక్రటరీగా పళనిస్వామే
విధాత: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంకు భారత అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నిక సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి కొనసాగేలా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. వివాదం ఇదీ.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గతేడాది పళనిస్వామి ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కారదర్శిగా కొనసాగడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టులో […]

విధాత: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంకు భారత అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నిక సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి కొనసాగేలా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
వివాదం ఇదీ..
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా గతేడాది పళనిస్వామి ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కారదర్శిగా కొనసాగడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్ సెల్వం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గతేడాది జులై 11న జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం చెల్లదని, జూన్ 23కు ముందున్న పరిస్థితే ఉంటుందని గత సంవత్సరం ఆగస్టులో ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ జయచంద్రన్ తీర్పును వెల్లడించారు. ఈ తీర్పుపై పళనిస్వామి మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేశారు. అయితే జస్టిస్ జయచంద్రన్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. జులై 11న జరిగిన సర్వసభ్య సమావేశం చెల్లుతుందని, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది.
సుప్రీంలో సవాల్ చేసిన పన్నీరు సెల్వం
మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పన్నీరు సెల్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులోనూ పన్నీరు సెల్వంకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే సొంతమయ్యాయి. పళనిస్వామి మద్దతుదారులు సంబురాలు చేసుకుంటున్నారు.
న్యాయమే గెలిచింది: పళనిస్వామి
సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ ముఖ్యమంత్రి, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి స్పందించారు. ఇది అద్భుతమైన తీర్పు. న్యాయమే గెలిచిందన్నారు. పన్నీరు సెల్వం అధ్యాయం ముగిసిందన్నారు. ఓపీఎస్‌తో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఇక నుంచి మరింత శక్తివంతంగా పని చేస్తాం అని పళనిస్వామి పేర్కొన్నారు.