OU| ఓయూలో టెన్షన్.. టెన్షన్! ఎక్కడికక్కడ అరెస్టులు.. గృహ నిర్బంధాలు
నిరుద్యోగ మార్చ్‌కు వెళ్లకుండా ఆర్ట్స్ కాలేజీ వద్ద భారీగా పోలీసులు విద్యార్థి జేఏసీ నేతలను హాస్టల్ నుంచి తీసుకెళ్లి అరెస్టులు కాంగ్రెస్ నేతలు ఇళ్లు దాటకుండా గృహ నిర్బంధాలు ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల సమస్యలపై చేపట్టిన నిరుద్యోగ మార్చి నేపథ్యంలో ఓయూ వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఓయూ జేఏసీ నేతలను యూనివర్సిటీకి వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ నేతలు అన్నారు. 30 […]

- నిరుద్యోగ మార్చ్‌కు వెళ్లకుండా ఆర్ట్స్ కాలేజీ వద్ద భారీగా పోలీసులు
- విద్యార్థి జేఏసీ నేతలను హాస్టల్ నుంచి తీసుకెళ్లి అరెస్టులు
- కాంగ్రెస్ నేతలు ఇళ్లు దాటకుండా గృహ నిర్బంధాలు
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల సమస్యలపై చేపట్టిన నిరుద్యోగ మార్చి నేపథ్యంలో ఓయూ వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఓయూ జేఏసీ నేతలను యూనివర్సిటీకి వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ నేతలు అన్నారు. 30 లక్షల ఉన్న నిరుద్యోగుల సమస్యపై సీఎం ఇప్పటివరకు స్పందించక పోవడం దారుణం అన్నారు.
టీఎస్‌పీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజీకి మూల కారకుడైన సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను తొలిగించాలని, ఈ మొత్తం వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు వస్తున్న సీఎం కుటుంబసభ్యులను బర్తరఫ్ చేసి, తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ రోజు తాము తలపెట్టిన నిరుద్యోగ మార్చిని అడ్డుకుని మమ్మల్ని బంధించినంత మాత్రానా అది ఆగదన్నారు.
ఈ అంశాన్ని రేపటి నుంచి అన్ని యూనివర్సిటీ, జిల్లాలకు కేంద్రాలకు తీసుకెళ్తామన్నారు. కచ్చితంగా కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో మేము ప్రజల పక్షాన ఉండి మీ ఓటమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అమరవీరుల స్థూపం వరకు శాంతియుతంగా చేపట్టిన విద్యార్థి, నిరుద్యోగుల మార్చ్‌ను ప్రభుత్వం, పోలీసులు కుట్రపన్నిమమ్మల్ని అక్రమంగా అరెస్టు చేశారని వారు తెలిపారు.
మరోవైపు నిరుద్యోగ మార్చ్‌కు హాజరుకాకుండా కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. ఓయూకు వెళ్లకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా, మల్లు రవి, అద్దంకి దయాకర్, విద్యార్థి నాయకులను గృహ నిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటికి వెళ్లే మార్గంలో పోలీసులు పహారా కాస్తున్నారు. తనిఖీ చేశాకే ఆ దారిలోకి అనుమతిస్తున్నారు.
ప్రతిపక్షాలపై కేసీఆర్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నదని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. వరుసగా రెండో రోజు గృహ నిర్బంధం చేయడం ఏమిటి? నిరుద్యోగులకు తాము అండగా ఉంటామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నది? అని ఆయన ప్రశ్నించారు.
విద్యార్థులకు బాసటగా ఉండాల్సిన ఈ సమయంలో మమ్మల్ని గృహనిర్బంధం చేయడం, మా వాదన నిరుద్యోగులకు, ప్రజలకు చేరకుండా చేయడం అనేది గర్హనీయం అన్నారు. ఒకవైపు దొంగలను పక్కనపెట్టి మమ్నల్ని నిర్బంధించడం ఏమిటి అని మండిపడ్డారు. మీరు నిరుద్యోగుల పక్షాన ఉంటారా? ముద్దాయిల పక్షాన ఉంటారో తేల్చుకోవాలన్నారు. తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తున్నదని అన్నారు.