Parliament | దద్దరిల్లిన పార్లమెంట్‌.. మణిపూర్‌ హింసపై అధికార, విపక్షాల వాగ్యుద్ధం

Parliament హోరెత్తిన ఉభయ సభలు.. రేప‌టికి వాయిదా రాజ్యసభలో 267వ నిబంధన కింద.. లోక్‌సభలో 184 నిబంధన కింద చర్చించాలి  అంతకు ముందు ప్రధాని ప్రకటన చేయాలి ఉభయసభల్లో పట్టుబట్టిన ప్రతిపక్ష పార్టీలు ముందు చర్చిద్దామన్న హో మంత్రి అమిత్‌షా నిబంధనల కింద సుదీర్ఘ చర్చకు అవకాశం ఓటింగ్‌ నిర్వహించేందుకూ ఆస్కారం అటువంటి పరిస్థితి వద్దనుకుంటున్న కేంద్రం అరగంట పాటు స్వల్ప కాలిక చర్చతో సరి!  ససేమిరా అంటున్న ప్రతిపక్ష పార్టీల నేతలు న్యూఢిల్లీ: మణిపూర్‌ అంశంపై […]

  • By: krs    latest    Jul 24, 2023 1:25 PM IST
Parliament | దద్దరిల్లిన పార్లమెంట్‌.. మణిపూర్‌ హింసపై అధికార, విపక్షాల వాగ్యుద్ధం

Parliament

  • హోరెత్తిన ఉభయ సభలు.. రేప‌టికి వాయిదా
  • రాజ్యసభలో 267వ నిబంధన కింద..
  • లోక్‌సభలో 184 నిబంధన కింద చర్చించాలి
  • అంతకు ముందు ప్రధాని ప్రకటన చేయాలి
  • ఉభయసభల్లో పట్టుబట్టిన ప్రతిపక్ష పార్టీలు
  • ముందు చర్చిద్దామన్న హో మంత్రి అమిత్‌షా
  • నిబంధనల కింద సుదీర్ఘ చర్చకు అవకాశం
  • ఓటింగ్‌ నిర్వహించేందుకూ ఆస్కారం
  • అటువంటి పరిస్థితి వద్దనుకుంటున్న కేంద్రం
  • అరగంట పాటు స్వల్ప కాలిక చర్చతో సరి!
  • ససేమిరా అంటున్న ప్రతిపక్ష పార్టీల నేతలు

న్యూఢిల్లీ: మణిపూర్‌ అంశంపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. ఉభయ పక్షాల నినాదాలతో హోరెత్తాయి. మణిపూర్‌ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ ఉభయ సభల్లో ప్రకటన చేయాలని, అనంతరం రాజ్యసభలో 267వ నిబంధన కింద, లోక్‌సభలో 184 నిబంధన కింద చర్చ జరగాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తుంటే.. అధికార పక్షం మాత్రం ముందుగా చర్చిద్దామని మాత్రమే చెబుతుండటంతో ప్రతిష్ఠంభన నెలకొన్నది. అయితే.. ప్రధాని మోదీని కాపాడేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని, అమెరికా చట్టసభల్లో ప్రసంగించేందుకు సమయం ఉన్న మోదీకి.. దేశ పార్లమెంటులో మాట్లాడటానికి ఎందుకు లేదని నిలదీశాయి.

సోమవారం ఉభయ సభలు మొదలైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు మణిపూర్‌ అంశంపై ప్రధాని ప్రకటనకు పట్టుబట్టాయి. ‘మాకు న్యాయం కావాలి’ అని నినాదాలు చేస్తూ.. ప్రధాని ప్రకటన చేయాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ప్రతిపక్షాలు మణిపూర్‌ అంశాన్ని ప్రస్తావిస్తే.. అధికార బీజేపీ సభ్యులు.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న ఘటనలను లేవనెత్తారు. ప్రతిపక్షాల నినాదాల మధ్యే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ అదుపులో లేకపోవడంతో 30 నిమిషాలపాటు వాయిదా వేశారు. తర్వాత కూడా అదే పరిస్థితులు కొనసాగాయి. రాజ్యసభలోనూ ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. దీంతో ఉభయ సభలను పలు మార్లు వాయిదా వేసి.. చివరకు మంగళవారానికి వాయిదా వేశారు.

మోదీ ప్రకటన చేయాల్సిందే
మణిపూర్‌ ఘటనలను సాధారణ శాంతి భద్రతల అంశంగానే కేంద్ర పరిగణిస్తున్నదని కాంగ్రెస్‌ మండిపడింది. సభ సమావేశం అయిన దగ్గర నుంచి మణిపూర్‌ ఘటనల విషయంలో ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. బయట మాట్లాడే ప్రధాని సభలో ఎందుకు మాట్లాడరని నిలదీశాయి. అయితే.. ప్రధాని ప్రకటనకు పట్టుబడుతున్న ప్రతిపక్షం ఆ పేరుతో చర్చ నుంచి పారిపోతున్నదని అధికార బీజేపీ ఆరోపించింది. మణిపూర్‌ అంశంలో ప్రధాని మోదీ ప్రకటన చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై లోక్‌సభ స్పీకర్‌ స్పందిస్తూ.. ఏ విషయంలో ఎవరు స్పందించాలన్న విషయాన్ని ప్రతిపక్షాలు నిర్ణయించజాలవని అన్నారు.

ముందు చర్చిద్దాం : అమిత్‌షా
లోక్‌సభలో అమిత్‌షా మాట్లాడుతూ, మణిపూర్‌ విషయంలో ఉభయసభల్లో చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, సభ్యులు సీట్లలోకి వెళ్లి, చర్చకు సహకరించాలని కోరారు. సున్నితమైన ఈ అంశంలో వాస్తవాలను తెలుసుకోవాలని దేశం కోరుతున్నదని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీఎంసీ నాయకుడు సుదీప్‌ బందోపాధ్యాయ, డీఎంకే నాయకుడు టీఆర్‌ బాలుకు ఫోన్‌ చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. పార్లమెంటు స్తంభన సమస్యకు ముగింపు పలికేందుకు కృషి చేయాలని కోరారు.

గాంధీ విగ్రహం వద్ద పోటాపోటీ ఆందోళనలు
మణిపూర్‌ విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ పలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అధికార బీజేపీ సభ్యులు సైతం పోటీ ఆందోళనకు దిగారు.

ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ సస్పెన్షన్‌
రాజ్యసభలోనూ మణిపూర్‌ అంశం సెగలు రేపింది. చైర్‌ను పదే పదే అడ్డుకుంటున్నారంటూ ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను చైర్మన్‌ ధన్‌కర్‌ ఈ మొత్తం సెషన్‌కు సస్పెండ్‌ చేశారు. సంజయ్‌సింగ్‌ సభనుంచి వెళ్లిపోవాలని డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో ఆయన సభను సాయంత్రం 3 గంటలకు వాయిదా వేశారు. అనంతరం పరిస్థితి సద్దుమణగక పోవడంతో మరుసటి రోజుకు వాయిదా పడింది.

ప్రధానిని కాపాడే ప్రయత్నాలు : గౌరవ్‌ గగోయ్‌
ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం గౌరవ్‌ గగోయ్‌ తదితర కాంగ్రెస్‌ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌ మారణ హోమాన్ని బీజేపీ సాధారణ శాంతి భద్రతల సమస్యగానే చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రధాని పార్లమెంటులో మాట్లాడకుండా బీజేపీ కాపాడుతున్నది. మణిపూర్‌ అంశంపై తూతూ మంత్రంగా చర్చించే వదిలేయాలని చూస్తున్నది’ అని ఆయన విమర్శించారు. అసలు ప్రస్తుతం దేశంలో మణిపూర్‌కు మించిన సమస్య ఏమున్నదని కాంగ్రెస్‌కు చెందిన మరో సభ్యుడు శక్తిసింగ్‌ కోహిల్‌ ప్రశ్నించారు. ఈ అంశంపై 267వ నిబంధన కింద చర్చించేందుకు బీజేపీ ఎందుకు సిద్ధపడటం లేదని నిలదీశారు.

బిరేన్‌సింగ్‌ రాజీనామా చేయాలి: ప్రియాంక చతుర్వేది
మణిపూర్‌ విషయంలో ప్రధాని ప్రకటన చేయాల్సిందేనని, మణిపూర్‌ సీఎం పదవికి బిరేన్‌సింగ్‌ రాజీనామా చేయాల్సిందేనని శివసేన (యూబీటీ) సభ్యురాలు ప్రియాంక చతుర్వేది డిమాండ్‌ చేశారు. మణిపూర్‌కు అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆమె అన్నారు.

చర్చ వద్దనుకుంటున్న కేంద్రం : జయాబచ్చన్‌
మణిపూర్‌ విషయంలో ఎలాంటి చర్చ జరగకూడదని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నదని సమాజ్‌వాది పార్టీ సభ్యురాలు జయాబచ్చన్‌ విమర్శించారు. మరోవైపు బలమైన ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై దృష్టిసారించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి బీజేపీకి మిగిలి ఉన్న రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదో ఆ పార్టీ చూసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఆ రాష్ట్రాలు కూడా బీజేపీకి మిగలవని చెప్పారు. మణిపూర్‌ అంశంపై అనేక దేశాలు చర్చిస్తున్నా, భారతదేశంలో మాత్రం చర్చకు అవకాశం లేకపోయిందని జయాబచ్చన్‌ అన్నారు. ఇది సిగ్గుచేటని చెప్పారు.

మణిపూర్‌ను స్వార్థానికి వాడుకుంటున్న బీజేపీ : శశిథరూర్‌
ఒకవైపు మణిపూర్‌ మహిళలు అనేక బాధలు ఎదుర్కొంటుంటే.. బీజేపీ దానిని తన స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నదని కాంగ్రెస్‌ సభ్యుడు శశిథరూర్‌ ట్విట్టర్‌లో మండిపడ్డారు. ప్రశ్నలకు బదులివ్వాల్సిన ప్రభుత్వం.. ఎదురు ప్రశ్నించే ఎత్తుగడలు అవలంబిస్తున్నదని విమర్శించారు. ఒకవైపు మణిపూర్‌లో మహిళల ఈతిబాధల గురించి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాల్లో మహిళల సంగతిని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారని అన్నారు. మణిపూర్‌ విషయంలో ప్రధాని ప్రకటనకు ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌లో తప్పేమున్నదని ప్రశ్నించారు.

ఇప్పటికే మన దేశంలోని ఒక రాష్ట్రం తగులబడిపోతున్నదని, ఇదే మన ముందున్న అతిపెద్ద సమస్యలన్న థరూర్‌.. పొరుగు రాష్ట్రమైన మిజోరంకు కూడా అవి పాకుతున్నాయని చెప్పారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాధినేత మాట్లడటం ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుందని అన్నారు. ఆ తర్వాతే హోం మంత్రి, ఇతరులు మాట్లాడాల్సి ఉంటుందని చెప్పారు. ‘ప్రధాని పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో బయట మీడియాతో మాట్లాడతారు. ఇది ఆమోదయోగ్యం కాదు’ అని ఆయన చెప్పారు. ప్రధాని పార్లమెంటుకు జవాబుదారీ అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మొత్తం అర్థం ఇదేనని చెప్పారు.

267వ నిబంధన కింద చర్చించాల్సిందే : ఖర్గే
గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్షాల ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే.. అనంతరం ట్విట్టర్‌లో స్పందిస్తూ.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రధాని పార్లమెంటు బయట ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. మణిపూర్‌ అంశంపై పార్లమెంటులో సమగ్ర ప్రకటన చేయడం ప్రధాని విధి అని చెప్పారు. అందుకే ముందుగా ప్రధాని ప్రకటన చేయాలని తాము రాజ్యసభ చైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ను కోరుతున్నామని తెలిపారు. ఈ అంశంపై 267వ నిబంధన కిందే చర్చ జరగాలని ఆయన స్పష్టం చేశారు. కానీ కొంతమంది కేంద్ర మంత్రులు దీనిపై ఓ అరగంటపాటు స్వల్పకాలిక చర్చ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని విమర్శించారు. 267వ నిబంధన కింద అయితే.. కొన్ని గంటలపాటు చర్చించే అవకాశం ఉంటుందని తెలిపారు. అవసరమైతే ఓటింగ్‌కు కూడా ఆస్కారం ఉంటుందని చెప్పారు. అందుకే తాము ఈ నిబంధన కింద చర్చ కోరుతున్నామన్నారు. మోదీ ప్రభుత్వం తన రాజ్యాంగ యుత బాధ్యతల నుంచి, జవాబుదారీతనం నుంచి తప్పించుకోజాలదని స్పష్టం చేశారు.