Alcohol | మద్యం పైనే మక్కువ! మద్యం షాప్‌లకు 15 రోజులు.. పేదల పథకాలకు 3 రోజులసమయం

Alcohol | 'గృహలక్ష్మి' దరఖాస్తులకు మూడు రోజుల సమయం బీసీలకు లక్ష సాయం దరఖాస్తులకూ వారం గడువే విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై ఉన్న శ్రద్ధ పేదలపై ఉన్నట్లు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పేదలను తన వైపు తిప్పుకునేందుకు ప్రవేశ పెడుతున్న పథకాలు అమలుకే గాని ఆచరణకు ఆమడ దూరం అన్నచందంగా ఉంది. మూడు నెలల ముందే ప్రభుత్వం తన ఖాజానా […]

  • Publish Date - August 9, 2023 / 12:00 AM IST

Alcohol |

  • ‘గృహలక్ష్మి’ దరఖాస్తులకు మూడు రోజుల సమయం
  • బీసీలకు లక్ష సాయం దరఖాస్తులకూ వారం గడువే

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై ఉన్న శ్రద్ధ పేదలపై ఉన్నట్లు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పేదలను తన వైపు తిప్పుకునేందుకు ప్రవేశ పెడుతున్న పథకాలు అమలుకే గాని ఆచరణకు ఆమడ దూరం అన్నచందంగా ఉంది. మూడు నెలల ముందే ప్రభుత్వం తన ఖాజానా నింపుకునేందుకు మద్యం దుకాణాల నిర్వహణకు టెండర్ ప్రక్రియను మొదలు పెట్టింది. ఇందుకు ఈనెల 3 నుంచి 18 వ తేదీ వరకు టెండర్ ప్రక్రియ ఉంది.

మద్యం టెండర్ల దరఖాస్తు కోసం 15 రోజుల సమయం ఇచ్చిన ప్రభుత్వం గృహలక్ష్మి పథకంలో ఇల్లు లేని పేదలు ఇంటికోసం పెట్టుకునే దరఖాస్తులకు మాత్రం మూడు రోజల గడువే ఇవ్వడం తీవ్ర విమర్శలు రేపుతుంది. గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల ప్రభుత్వం సహాయం పొందేందుకు దరఖాస్తు సమయం కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. దీంతో లబ్దిదారులు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాల కోసం సంబoధిత కార్యాలయాల ఎదుట పడిగాపులు కాస్తున్నారు.

గడువు సమయం ఎక్కువ లేకపోవడంతో కార్యాలయం సిబ్బంది పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇంత తక్కువ సమయం ఇవ్వడం చూస్తే తక్కువ దరఖాస్తుల లక్ష్యంగానే ప్రభుత్వం మూడు రోజుల తక్కువ సమయం దరఖాస్తులకు ఇచ్చిందంటు పేదలు మండిపడుతున్నారు. ఇటీవల కులవృత్తి దారులకు లక్ష అందించే బీసీ బంధు పథకం దరఖాస్తుకు వారం సమయం ఇచ్చింది.

ఇందుకు కావాల్సిన పత్రాల కోసం మండల రెవిన్యూ కార్యాలయాలు కిక్కిరిసి పోయాయి. తక్కువ సమయం ఉండడంతో సరైన పత్రాలు సమయానికి అందక పోవడంతో చాలా మంది అర్హులైన లబ్దిదారులు ఈ పథకం లబ్ది కోసం దరఖాస్తులు చేయలేకపోయారు.

పథకాల లబ్ధి కొందరికే..

ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వేలల్లో దరఖాస్తులు తీసుకుంటున్నప్పటికి అర్హులైన అందరికి ఆ పథకాలు అందని ద్రాక్షగానే కనిపిస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న అందరికి గృహలక్ష్మి, బీసీ బంధు లక్ష రూపాయల సహాయం అందుతాయానే ఆశ కూడా లేదు. బీసీ బంధుకు ఒక్కో నియోజకవర్గంలో రెండు నుంచి మూడు వేల దరఖాస్తు లు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క లబ్దిదారునికి రూ. లక్ష అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అమలు అంతంత మాత్రoగానే ఉంది.

ప్రస్తుతం మొదటి విడత కింద ప్రతి నియోజకవర్గా నికి 300 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఈ లెక్కన గ్రామానికి ఒకటి రెండు మినహా వచ్చే అవకాశం లేదు. ఒక్కో నియోజకవర్గం లో సుమారు 200 గ్రామాలు, ఐదు మండల కేంద్రాలు ఉన్నాయి. ఈ లెక్కన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో 4000 మంది మాత్రమే మొదటి విడత లో లబ్ది పొందారు.

ఇలా విడతకు 300 మందికి ఇస్తే ఇంకా ఆరు విడతలైనా లబ్దిదారులకు అందే పరిస్థితి లేదు. ఆ లోపు ఎన్నికలు వస్తే దరఖాస్తులన్నీ బుట్ట దాఖలు అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ లబ్ధిదారుల ఎంపిక అంతా ఎమ్మెల్యే ల కనుసన్నులలో జరిగింది. వారు సొంత పార్టీలో ఉన్న వారినే ఎంపిక చేసారని లబ్దిదారులు మండిపడుతున్నారు. ఎంపిక చేసి రూ. లక్ష పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యేలు జంకు తున్నారు. వేలల్లో ఉన్న లబ్ధిదారులకు వందల్లో ఇస్తే గొడవలు జరుగుతాయననే యోచనలో ఉన్నారు.

జిల్లాలో మహబూబ్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాల్లో మంగళవారం లక్ష సహాయం పంపిణి చేశారు. జడ్చర్ల లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేసే కార్యక్రమం లో బీఆరెస్‌ నాయకులు, బీజేపీ నాయకులు బాహాబాహికి దిగారు. సొంత పార్టీ వారికే లబ్ది చేకూర్చారని బీజేపీ నాయకులు ఆరోపించడం గొడవకు దారితీసింది. ఎమ్మెల్యే ఎదుటే గల్లాలు పట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యే లు అచి తూచి అడుగు వేస్తున్నారు.