కాంగ్రెస్ గూటికి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి దంప‌తులు.? తీగ‌ల కోడ‌లు కూడా?

రాష్ట్రంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మార‌బోతున్నాయి.బీఆర్ఎస్ కి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు కాంగ్రెస్ పార్టీ గూటికి చేర‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి

కాంగ్రెస్ గూటికి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి దంప‌తులు.? తీగ‌ల కోడ‌లు కూడా?

హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మార‌బోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు అధికార కాంగ్రెస్ పార్టీ గూటికి చేర‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో స‌రైన ప్రాధాన్యం ల‌భించ‌ని నేత‌లంతా కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి శ‌నివారం సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన సంగ‌తి తెలిసిందే. తీగ‌ల రేపోమాపో కాంగ్రెస్ పార్టీలో చేరుతార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


తీగ‌ల కృష్ణారెడ్డి బాట‌లోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన ప‌లువురు నేత‌లు ప‌య‌నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, ఆయ‌న భార్య, వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్ రెడ్డి, తీగ‌ల కృష్ణారెడ్డి కోడ‌లు, రంగారెడ్డి జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ అనితా రెడ్డితో పాటు ప‌లువురు కీల‌క నాయ‌కులు పార్టీ మార‌బోతున్న‌ట్లు స‌మాచారం. వీరంతా జ‌న‌వ‌రి 31న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. 31న సీఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు వార్త‌లు షికారు చేస్తున్నాయి.


ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి బీఆర్ఎస్ తొలి కేబినెట్‌లో మంత్రిగా ప‌ని చేశారు. కానీ 2018 ఎన్నిక‌ల్లో నాటి కాంగ్రెస్ అభ్య‌ర్థి పైల‌ట్ రోహిత్ రెడ్డి చేతిలో మ‌హేంద‌ర్ రెడ్డి ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత పైల‌ట్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డికి పార్టీలో త‌గిన ప్రాధాన్యం ల‌భించ‌లేదు. ఆయ‌న కూడా పార్టీ వ్య‌వ‌హారాల్లో అంటీముట్టన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు.


ఇక 2023 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి సిద్ధ‌మ‌య్యార‌ని తెలుసుకున్న కేసీఆర్.. హుటాహుటిన ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డికి చేవేళ్ల ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.


తీగ‌ల కృష్ణారెడ్డి విష‌యానికి వ‌స్తే బీఆర్ఎస్ పార్టీ గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు మహేశ్వరం అసెంబ్లీ టికెట్‌ కేటాయించనందుకు కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కృష్ణారెడ్డి 2014లో మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సబితారెడ్డి చేతిలో ఓడిపోయారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్‌ మాట తప్పారని, ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశారని తీగల తన అనుచరగణం వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.