మద్నూర్ మార్కెట్ కమిటీపై పీటముడి..!

జుక్కల్ బిఆర్ఎస్‌లో వర్గ విబేధాలు విధాత, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా సరిహద్దులోని మిశ్రమ సంస్కృతి కలిగిన జుక్కల్ నియోజకవర్గ బిఆర్ఎస్‌లో వర్గ విబేధాలు బహిర్గతమయ్యాయి. నియోజకవర్గంలో ఏడు మండలాలు వుండగా మూడు మార్కెట్ కమిటీలున్నాయి. పిట్లం, బిచ్కుంద మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాల నియామకం పూర్తయ్యాయి. కాగా పార్టీలో రెండు గ్రూపుల మధ్య విబేధాల వల్ల మద్నూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకం పెండింగ్‌లో పడింది. జుక్కల్ నియోజకవర్గానికి కేంద్రంగా భావించే మద్నూర్ మార్కెట్ కమిటీ పరిధిలో […]

మద్నూర్ మార్కెట్ కమిటీపై పీటముడి..!
  • జుక్కల్ బిఆర్ఎస్‌లో వర్గ విబేధాలు

విధాత, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా సరిహద్దులోని మిశ్రమ సంస్కృతి కలిగిన జుక్కల్ నియోజకవర్గ బిఆర్ఎస్‌లో వర్గ విబేధాలు బహిర్గతమయ్యాయి. నియోజకవర్గంలో ఏడు మండలాలు వుండగా మూడు మార్కెట్ కమిటీలున్నాయి. పిట్లం, బిచ్కుంద మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాల నియామకం పూర్తయ్యాయి. కాగా పార్టీలో రెండు గ్రూపుల మధ్య విబేధాల వల్ల మద్నూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ నియామకం పెండింగ్‌లో పడింది.

జుక్కల్ నియోజకవర్గానికి కేంద్రంగా భావించే మద్నూర్ మార్కెట్ కమిటీ పరిధిలో మద్నూర్‌తో సహా జుక్కల్, డోంగ్లీ మండలాలు వున్నాయి. మద్నూర్ మార్కెట్ కమిటీ పరిధిలో అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులు కలిసి ఉండడం వల్ల దీనికి ప్రత్యేకమైన గుర్తింపు వుంది.

మార్కెట్‌కు ధాన్యం విక్రయాల ద్వారా ఆశించిన మేర ఆదాయం కూడా సమకూరుతుంది. మద్నూర్ మార్కెట్‌కు వనరుల ఆధారంగా ప్రత్యేకత ఒకవైపు నేతల మధ్య గ్రూపు తగాదాలు మరో వైపు ఉండడంతో నూతన పాలకవర్గ నియామక ప్రక్రియ నిలిచిపోయింది.

జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ముఖ్య అనుచరుడు, మద్నూర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్‌ను మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వానికి ప్రతిపాదించగా కొంతమంది బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వ్యతికేంచినట్లు సమాచారం. మద్నూర్ నుండి బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేను కలిసి సంగమేశ్వర్ నియామకం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సంగమేశ్వర్ హన్మంత్ షిండేతో రాజకీయాల్లో కలిసి నడుస్తున్న వారిలో మొదటి వరుసలో వున్నారు.

గతంలో టీడీపీ పార్టీలో సంగమేశ్వర్ కలిసి పని చేశారు. మద్నూర్ మండల టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన సంగమేశ్వర్ ప్రస్తుతం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సాయాగౌడ్ పాలకవర్గ పదవీకాలం గత కొన్ని వారాల క్రితం ముగిసింది. నూతన పాలక వర్గం చైర్మన్‌గా సంగమేశ్వర్‌ను నియమించడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోవడం లేదు. సాయాగౌడ్‌ కంటే ముందు సంగమేశ్వర్ తల్లి బోలేవార్ సులోచన వీరయ్యప్ప చైర్ పర్సన్‌గా అవకాశం కల్పించారని, తిరిగి రెండవసారి అతనికే చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల పార్టీ శ్రేణులు అభ్యంతరం చెపుతున్నాయి.

ఇదిలా వుండగా జుక్కల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్‌కు మరో బలమైన నేత, జాహిరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉండడం, పాటిల్, షిండే అనుచ‌ర‌గ‌ణం రెండు గ్రూపులుగా పనిచేయడం గ్రూపు తగాదాలకు కారణం అవుతుంది. ఇరు వర్గాలకు చెందిన నాయకులు చివరకు సోషల్ మీడియాలో పరస్పరం అసభ్య పదజాలంతో దూషించుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఒక సందర్బంలో ఒక గ్రూపు మరో గ్రూపునకు వ్యతిరేకంగా మోటార్ సైకిల్ ర్యాలీ తీయడం లాంటి ఘ‌ట‌న‌లు చూస్తే ఆ పార్టీలో విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మార్కెట్ చైర్మన్ పదవిని మద్నూర్ మండల కేంద్రానికి చెందిన వారికి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అంతే కాకుండా పార్టీలో ఉద్యమ తెలంగాణ (యూటి), బంగారు తెలంగాణ (బిటి)గా వ్యవహరిస్తూ తమకు అన్యాయం జరుగుతుందని యూటి బ్యాచ్ ఆరోపిస్తుండడం గమనార్హం.

బిఆర్ఎస్ నాయకులు, బీబీ పాటిల్ అనుచరులు పండిత్ రావు, అంతపూర్ శంకర్ పటేల్, మద్నూర్ మండల కేంద్రంలోని నాయకులు, డోంగ్లీ మండల నాయకులు చైర్మన్‌గా సంగమేశ్వర్ నియామకాన్ని బహిరంగగానే వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అంశాలతో పాటు వ్యాపార రంగం, పాలనా అంశాల్లో సంగమేశ్వర్ జోక్యం పెరిగిపోయిందని, ఈ కారణంగానే ఆయనపై అసంతృప్తి పెల్లుబికినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంగమేశ్వర్‌ను వెనకేసుకురావడం పట్ల ఎమ్మెల్యేపై అసంతృప్తి అధిక‌మ‌వుతున్న‌ది. నియోజకవర్గంలోని బిచ్కుంద, పిట్లం, పెద్దకొడప్ గల్, నిజాంసాగర్ మండలాల్లో సైతం అసమ్మతి రాజుకుంటున్నట్లు సమాచారం. పార్టీలో ఏర్ప‌డిన‌ అసంతృప్తి, గ్రూపు తగాదాలు వచ్చే శాసన సభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపై పడే అవకాశం ఉన్నట్లుగా పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.