చిల్లరమల్లర రాజకీయాల కోసం పెన్షన్లు ఇవ్వట్లేదు : సీఎం కేసీఆర్
విధాత: ప్రతి పేద వ్యక్తి ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. చిల్లరమల్లర రాజకీయాల కోసం పెన్షన్లు ఇవ్వట్లేదు అని ఆయన పేర్కొన్నారు. జగిత్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. ‘ఏం చేసినా అర్థవంతంగా, సౌకర్యవంతంగా ఉండాలని పెద్దలు చెప్పారు. 2014లో ఒంటరిగా ఎన్నిలకు వెళ్లాలని నిర్ణయించిన తర్వాత.. మళ్లీ మన గవర్నమెంట్ వస్తుందని ఎన్నికల మేనిఫెస్టో రాస్తున్నాం. రాసే సమయంలో వృద్ధాప్య […]

విధాత: ప్రతి పేద వ్యక్తి ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. చిల్లరమల్లర రాజకీయాల కోసం పెన్షన్లు ఇవ్వట్లేదు అని ఆయన పేర్కొన్నారు. జగిత్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు.
‘ఏం చేసినా అర్థవంతంగా, సౌకర్యవంతంగా ఉండాలని పెద్దలు చెప్పారు. 2014లో ఒంటరిగా ఎన్నిలకు వెళ్లాలని నిర్ణయించిన తర్వాత.. మళ్లీ మన గవర్నమెంట్ వస్తుందని ఎన్నికల మేనిఫెస్టో రాస్తున్నాం. రాసే సమయంలో వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలనే చర్చ జరిగింది. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.250, రూ.300 చేద్దామని కొందరు చెప్పారు.
మాజీ ఐఏఎస్ అధికారి లెక్కలు తీసి రూ.430 ఇస్తే చాలని చెప్పారు. ఆ సమయంలో మనం పెన్షన్ ఎందుకు ఇస్తం ? అని అడిగాను. చిల్లరమల్లర రాజకీయాల కోసం ఇస్తమా? పెన్షన్లు ఇచ్చేందుకు పరమార్థం ఉందా? లేదా? అని అడిగినప్పుడు చాలా మంది పాలిటిక్స్, సాయం కోసం ఇస్తామని రకరకాలుగా చెప్పారు.
అనేక కారణాలతో భర్త చనిపోయిన మహిళ, పిల్లల నిరాధారణ వృద్ధులు, నిరుపేదల వృద్ధులు, ఒంటరి మహిళల, ఎవరూ పట్టించుకోకపోయిన బీడీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కనీసం అవసరం తీరే విధంగా ఇచ్చినా అర్థవంతంగా ఉంటది, లేకపోతే ఇవ్వకపోవడం మంచిది అని చెప్పాం. ఆ తర్వాత రూ.1000 ఇవ్వాలని చెప్పాని, ఆ తర్వాత పెంచుకుందామని చెప్పామన్నారు.
ప్రస్తుతం రూ.2వేలు ఇస్తున్నామన్నారు. టీవీలు, సోషల్ మీడియాలో ప్రత్యక్ష చూశాను. చాలా మంది వృద్ధులు మాకొడుకులు చూడనప్పుడు బావులు, చెరువుల్లో పడి చనిపోదుము. మాకు ఇవాళ ఆ దుర్ఘతి లేదు. రేషన్ కార్డు ఉంది బియ్యం వస్తున్నయ్, రూ.2లు ఠంచన్‌గా వస్తున్నాయ్ అని మారుమూల ప్రజలు చాలా సంతోషంగా చెబుతున్నారు. ఏలికలకు, పాలకులకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు దీనికి మించిన సంతృప్తి, గొప్ప గౌరవంగా ఉంటుందనుకోను’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
Live: CM Sri KCR Speaking at a Public Meeting in Jagtial district https://t.co/R12X6Ec8w2
— TRS Party (@trspartyonline) December 7, 2022
‘రైతులకు రైతుబంధు సైతం పదెకరాలకు మించి ఎందుకు ఇస్తున్నరు? లిమిట్ చేయచ్చుకదా అని నన్ను కూడా అడుగుతున్నరు. రాష్ట్రంలో 93.50శాతం ఐదెకరాలలోపు రైతులే ఉన్నారు. ఐదు నుంచి పదెకరాలున్న ఉన్న రైతులు ఐదారు శాతం ఉన్నారు. మామిడి, వగైరా ఉన్న వారు ఒకశాతం మాత్రమే ఉన్నారు. 25 ఎకరాలు పైనున్న వారు పాయింట్ 28 శాతం మంది ఉన్నారు.
వరద కాలువకు తూము పెట్టాలంటే ఒక కథ. నీరు రావాలంటే ఒక కథ. భయంకరమైన పరిస్థితులుండేవి. ఎస్సారెస్పీ ఆయకట్టకు కింద ఉన్న ఆయకట్టులో నీళ్లు రాక పంటలు పండక ఇబ్బందులు పడ్డారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో 30-40 ఎకరాలున్న రైతులు హైదరాబాద్, బొంబాయి, బొగ్గుబాయిలో పని చేసే పరిస్థితులు. చెల్లాచెదురై చెట్టుకొకరు.. గుట్టకొకరైన పరిస్థితి.
రైతు సైతం రేషన్‌కార్డు కోసం అడుక్కునే దుస్థితి. వ్యవసాయ స్థిరీకరణ, అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరగడం వల్ల శాంతి, సౌభాగ్యం పల్లెల్లో అద్భుతంగా ఉంటుంది. ఇవాళ తెలంగాణ అద్భుతమైన గ్రామీణ ఆర్థిక పునాది పరిపుష్టమైంది. అనేక రంగాల్లో, అనేక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. కమిట్‌మెంట్ ఉంటే తప్పా పనులు జరుగవు.
సిద్ధిపేటగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంద్రసేనారెడ్డి అనే పంచాయతీరాజ్ ఇంజినీర్ ఉండేవారు. ఆయన సలహాతో అద్భుతమైన పథకాన్ని ప్రారంభించాం. అదే స్ఫూర్తితో మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశాం. దాదాపు 40వేల ఓవర్‌హెడ్ ట్యాంకులున్నాయి.
17వేలకు పైగా ఉండగా.. కొత్తగా 20వేలకు పైగా నిర్మించాం’ అన్నారు. ప్రస్తుతం ఇంటింటికీ నీళ్లు అందుతున్నయ్. ఒక్క పథకం వెనుక ఎంత ఆలోచన ఉంటది? విజయవంతం కావాలని దీర్ఘదృష్టి ఉంటుంది. ఆలోచిస్తే అర్థమవుతుంది’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఆద్భుతంగా జగిత్యాల..
జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసుకోడమే కాదు.. ఇవాళ ఒక అద్భుతమైన కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నాం. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల, ప్రజలను హృదయపూర్వకంగా అభినందలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కలలలో కూడా అనుకోలేదు ఇది జిల్లా అయితది బాగా అభివృద్ధి చెందుతుందని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి జగిత్యాల జిల్లా ఏర్పాటైంది.
ఉద్యమం జరిగే సందర్భంలో అత్యంత మహిమాన్వితమైన, అద్భుతమైన నరసింహాస్వామి ధర్మపురికి వచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను. గోదావరి నది నాటి ఏపీలో తెలంగాణలో మొదట ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు ఎందుకు జరపరు అని సింహాంలా గర్జించాను. దాని మీద చాలా రకాలుగా మాట్లాడారు. ధర్మపురి స్వామి చాలా మహిమాన్వితమైన స్వామి. శేషప్ప కవి స్వామి మీద అద్భుతమైన పద్యాలు రాశారు. స్వామి వారిని దర్శించి నీ దయ వల్ల పుష్కరాలు జరుపుదాం అని మొక్కుకున్నాను.
మళ్లీ పుష్కరాలు వచ్చేలోపు రాష్ట్రాన్ని సాధించి, ఇక్కడే పుష్కరాలు జరుపుదామని మొక్కాను. నిండు మనసుతో మొక్కాను. ధర్మపత్ని సమేతంగా వచ్చి తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ధర్మపురిలో పుష్కర స్నానం చేసి స్వామి వారిని దర్శించుకున్నాను. పండితులు తెలంగాణ ప్రాప్తిరస్తు అని దీవెన ఇచ్చారు. స్వామి వారి దయ, వేదపండితుల ఆశీస్సులతో తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా పుష్కరాలు జరుపుకున్నాం. లక్షలాది మంది ధర్మపురికి తరలివచ్చారు. మంత్రులు ట్రాఫిక్ పోలీసుల్లా వ్యవహరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా పుష్కరాలు నిర్వహించుకున్నాం.
చాలా అద్భుతంగా ముందకు పోతున్నాం. తెలంగాణ ఆధ్యాత్మిక పరిమళాలు ఉన్న ప్రాంతం. కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు అంజన్న దేవాలయంతో పాటు పలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొండగట్టు అంజన్న సన్నిధికి హనుమాన్ భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. అంజన్న దేవస్థానం కేవలం 20 ఎకరాల్లో మాత్రమే ఉండేది. 384 ఎకరాల స్థాలాన్ని దేవాలయానికి ఇచ్చాం. 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది. కొండగట్టు అంజన్న క్షేత్రానికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నాం. త్వరలోనే నేను స్వయంగా వచ్చి ఆగమశాస్త్ర ప్రకారం, భారతదేశంలో సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తాను అని హామీ ఇస్తున్నాను