మా ఊళ్లకు రావద్దు!.. గులాబీ అభ్యర్థులకు నిరసన సెగలు

- ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తొచ్చామా?
- దళితబంధు మీ పార్టీ కార్యకర్తలకేనా?
- డబుల్ బెడ్ రూం ఇళ్లూ మీవారికే
- ఓట్లప్పుడు మాత్రం మేము కావాలా?
- ఎమ్మెల్యేలను నిలదీస్తున్న ప్రజలు
- తమ గ్రామాల్లోకి రావొద్దంటూ అడ్డగింత
- బీఆరెస్ అభ్యర్థులు ఉక్కిరిబిక్కిరి
విధాత, న్యూస్ నెట్ వర్క్: “10 ఏళ్లు అధికారంలో ఉండి మాకు మీరు చేసిందేమిటి? దళిత బంధు మీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మీ వాళ్లకే ఇచ్చుకున్నారు. కనీసం మోరీలు కూడా బాగు చేయలేదు. 24 గంటల కరెంటు అన్నరు.. మీరు కరెంటు ఎక్కడ ఇస్తున్నరు? ధరణి తెచ్చి మా భూములు మాకు కాకుండా చేస్తున్నరు. సంక్షేమ పథకాలన్నీ మీకేనా.. మాకేవి” అంటూ ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీఆరెస్ అభ్యర్థులను నేతలను గ్రామీణ ప్రాంతాల ప్రజలు నిలదీస్తుననారు. మా ఊళ్లకు మీరు రావద్దంటూ అడ్డుకుంటున్నారు.
దీంతో బీఆరెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తాజా ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరుసగా రెండు దఫాలుగా ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ముఖం చాటేశారంటూ జనం ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పడకేసిందని… తమ కష్టాలు తీర్చేదెవరని నిలదీస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే నేతలకు మా గ్రామాలు గుర్తుకు వస్తాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి, గ్రామాల్లోకి అడుగుపెట్టాలని ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థులను గ్రామస్థులు అడ్డుకుంటున్నారు.
రాజేందర్‌రెడ్డికి నిరసన సెగ
తాజాగా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని పలు గ్రామాల్లో ప్రజలు తమ ఊర్లోకి రావద్దని అడ్డుకుంటున్నారు. దీంతో రాజేందర్‌రెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారు. శుక్రవారం జనగామ నియోజక వర్గ బీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తుపాస్‌పల్లి గ్రామంలో గ్రామస్థులు అడ్డుకున్నారు. ఏమి చేశారని మా ఊరికి వస్తున్నావని ప్రశ్నించారు. వారించినా వినలేదు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని రాయిని పాలెం గ్రామానికి ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును ఆ గ్రామ యువకులు మా ఊరికి ఏమి చేశావని వస్తున్నావు? మీరు మా ఊరికి రావద్దు అంటూ అడ్డుకున్నారు.
దీంతో బీఆరెస్ కార్యకర్తలకు, గ్రామస్థులకు మధ్య తోపులాట జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం గ్రామంలోని దళిత వాడకు ప్రచారానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌ను దళితులు నిలదీశారు. దళితబంధును మీ ఇష్టం వచ్చిన వాళ్లకు ఇచ్చుకొని మా ఊరికి ఎందుకు వచ్చావని స్థానిక మహిళలు ప్రశ్నించారు. ఊహించని పరిణామానికి అవాక్కైన అయిన ఎమ్మెల్యే.. ఇది సభ కాదు.. సందర్భం కాదు.. మా ఇంటికి వచ్చి అడగండి అంటూ.. మహిళలపై సీరియస్ అయి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇల్లందు నియోజక వర్గంలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ను బయ్యారం మండలానికి చెందిన సంతులాల్ తండా వాసులు తామకు ఎమ్మెల్యే చేసిందేమీ లేదని, తండాలో అడుగుపెట్టనీయబోమంటూ అడ్డుకున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు మీరు మాకు చేసిందేమీలేదు… మీరు మా వద్దకు ఓట్లు అడగడానికి రావద్దని స్పష్టంగా చెప్పారు. నల్లగొండ నియోజక వర్గానికి చెందిన కనగల్, పానగల్ గ్రామాల్లో సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ఇవ్వకుండా బీఆరెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత కొన్ని రోజుల క్రితం 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలక వీడు, నేరేడు చర్ల మండలాలకు చెందదిన పలు గ్రామాల ప్రజలు స్థానిక ఎమ్మెల్యేను నిలదీశారు. వర్థన్న పేట నియోజకవర్గంలో దళిత బంధు, గృహలక్ష్మి పథకాలకు తమకు ఇవ్వలేదని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను గ్రామాల్లో నిలదీశారు. అలాగే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని లావెళ్ల గ్రామంలో తమ ఊరికి రావద్దని గ్రామస్తులు అడ్డుకున్నారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కుష్ణపల్లి గ్రామస్థులు పదేళ్లుగా తమకు ఏమీ చేశావని నిలదీసి, ఊరి పొలిమేరల్లోనే నిలిపేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావును సీతారాంపల్లి ఎస్సీ కాలనీ వాసులు తాము ఎన్ని సార్లు చెప్పినా డ్రైనేజీ నిర్మాణం చేయవా? అని నిలదీశారు. కనీసం సబ్ ప్లాన్ నిధులు కూడా ఖర్చు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు రైతులు ఇన్నాళ్లు కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో భూములు మునిగి పంటలు వేసుకోలేదు.. ఈ ఏడాది బ్యాక్ వాటర్ లేక పోవడంతో పంటలు వేసుకుంటే 24 గంటల కరెంటు ఇవ్వడంలేదని స్థానిక ఎమ్మెల్యేపై మండిపడ్డారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డిని కుద్వాన్ పూర్ గ్రామస్థులు అడ్డుకున్నారు. ఏం ముఖం పెట్టుకుని గ్రామంలోకి వస్తావని ప్రశ్నించారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో ఆయన చేసేదేమీ లేక వెను తిరిగి వెళ్లిపోయారు. కామారెడ్డి బీఆరెస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ను ప్రకటించిన తరువాత లింగాపూర్ గ్రామానికి చెందిన భూ బాధితులు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ గ్రామం నుంచి 120 మంది నామినేషన్లు వేస్తారని వార్నింగ్ ఇచ్చారు.