కుటుంబ పార్టీలకు మోదీ భయం

దేశానికి, రాష్ట్రాలకు కుటుంబ పార్టీలు.. వారసత్వ రాజకీయాలు నష్టం చేస్తున్నాయని, కుటుంబ పార్టీల వేలకోట్ల అవినీతిని బయటపెడుతున్నందుకే నాపై అక్కసుతో విమర్శలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు

కుటుంబ పార్టీలకు మోదీ భయం
  • వారి అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే నాపై విమర్శలు
  • యువతను ఎదగనివ్వని కుటుంబ పార్టీలు
  • కుటుంబ పార్టీలకు విదేశీ బ్యాంకు ఖాతాలు
  • మా పాలనలో పేదలకు జన్‌ధన్ ఖాతాలు
  • వారికి కోటల వంటి భవంతులు..మా పాలనలో పేదలకు ఇండ్లు
  • వారికి కుటుంబం ఫస్ట్‌…నాకు దేశమే ఫస్ట్‌
  • 140కోట్ల ప్రజలే నా కుటుంబం…అదే నా ఎన్నికల నినాదం
  • కుటుంబ, వారసత్వ రాజకీయాలపై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ
  • బీఆరెస్‌-కాంగ్రెస్‌ల మధ్య అవినీతి బంధం..ఆ రెండు పార్టీలు ఒక్కటే
  • తెలంగాణ అభివృద్ధిని రెండింతలు చేస్తాం..భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేరుస్తాం
  • సంగారెడ్డి పటాన్ చెరు బీజేపీ విజయ్ సంకల్ప సభలో మోడీ హామీ


విధాత : దేశానికి, రాష్ట్రాలకు కుటుంబ పార్టీలు.. వారసత్వ రాజకీయాలు నష్టం చేస్తున్నాయని, కుటుంబ పార్టీల వేలకోట్ల అవినీతిని బయటపెడుతున్నందుకే నాపై అక్కసుతో విమర్శలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు. కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు రాష్ట్రాల్లో కుటుంబ పాలన ఉన్న రాష్ట్రాల్లో వారి కుటుంబాలే లాభపడ్డాయని, ప్రజలకు నష్టం జరిగిందన్నారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం లేదని, కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్నామన్నారు.


కుటుంబ పార్టీలకు ఏమైనా దోచుకునేందుకు లైసెన్స్‌లు ఇచ్చారా, కబ్జాలకు, అవినీతికి లైసెన్స్ ఇచ్చారా అని మోదీ ప్రశ్నించారు. ఒక్కో కుటుంబంలో 50 మంది వరకు దోచుకుతింటున్నారన్నారని ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ మండిపడ్డారు. కుటుంబ పార్టీల బాధ అంతా వారి కుటుంబం కోసమేని, నా తపన దేశం కోసమన్నారు. కుటుంబ పాలనను మేము వ్యతిరేకిస్తున్నామని, అందుకే మాపై వారు విమర్శలు చేస్తున్నాన్నారు. నేను కుటుంబ పాలనపై ప్రశ్నిస్తుంటే వారు మాత్రం నాకు కుటుంబం లేదని నాపై విమర్శలు చేస్తున్నారు.


మోడీపై మా యుద్ధం కొనసాగిస్తామని చెబుతున్నారని, మోడీకి కుటుంబం లేకపోతే కుటుంబ పార్టీలన్నీ యుద్ధానికి దిగుతాయా? అని ఇదేనా వారి సైద్ధాంతిక పోరాటమని నిలదీశారు. కుటుంబ పార్టీలన్నీ తమకు కుటుంబమే ఫస్ట్ అనుకుంటాయని, కానీ మోడీకి మాత్రం నేషన్ ఫస్ట్ అన్నారు. దేశానికి మంచి చేసేందుకు నేనున్నాని, కుటుంబ పార్టీలు ఇప్పుడు చాలా అభద్రతా భావంలో పడ్డాయన్నారు. కుటుంబ, వారసత్వ పార్టీలు ప్రతిభ ఉన్న వారిని ఎదగకుండా అడ్డుకుంటాయని, యువతకు అవకాశం ఇవ్వవన్నారు. ఆ పార్టీలు 70 ఏండ్లు, 80 ఏండ్లకు పైబడిన వారికి అవకాశం ఇస్తున్నాయని కానీ మోడీ మాత్రం యువకులకు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నారన్నారు. కొత్త వాళ్లు వస్తుండటంతో కుటుంబ పార్టీల్లో భయం మరింత ఎక్కువైందన్నారు.


కాంగ్రెస్ గతంలో కుటుంబ పార్టీగా లేదని, కానీ ఇప్పుడు కుటుంబ పార్టీగా మారిందన్నారు. ఎందుకంటే, ఇప్పుడు మోడీ,యువకులకు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నారని, దీంతో అవతల పార్టీ వారికి భయాన్ని కలిగిస్తోందన్నారు. కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వారికి వస్తున్న జీతం వారి కుటుంబం బాగు కోసమే వాడారని, చివరకు వారికి వచ్చిన గిఫ్టులను వారి వద్దే ఉంచుకున్నారన్నారు. కుటుంబ పార్టీలు నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకున్నాయని విమర్శించారు. కానీ నేను అలా కాకుండా నాకు వచ్చిన గిఫ్టులను దేశ అభివృద్ధి కోసం వేలం వేస్తున్నానని, గంగా మాత సేవ కోసం ఉపయోగిస్తున్నానని తెలిపారు.


నేను మీ సేవకుడినని, నాకు కూడా కుటుంబం ఉంటే, నాకు వచ్చిన గిఫ్టులను, వేలం ద్వారా వచ్చిన డబ్బులను నేను పట్టుకెళ్లేవాడినేమోనన్నారు. కుటుంబ పార్టీలకు చెందిన కొందరు నేతలు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేశారని, వారు తమ కుటుంబం కోసం కోటలు కట్టించుకున్నారని, కానీ మోదీ ఇప్పటి వరకు తన కోసం ఒక్క ఇల్లును కూడా కట్టించుకోలేదన్నారు. అయితే ఇండ్లు లేని పేదల కోసం 4కోట్ల ఇండ్లను నిర్మించానన్నారు. పేదలకు జనధన్ బ్యాంకు ఖాతాలను తెరిపించామన్నారు. కుటుంబ పార్టీలు భూమి నుంచి ఆకాశం వరకు దేన్నీ వదలకుండా దోచుకున్నారని, కానీ మోదీ మాత్రం భుమి, ఆకాశం మాత్రమే కాకుండా పాతాళం వరకు ప్రతీ ఒక్క అవకాశాన్ని దేశాభివృద్ధి కోసమే ఉపయోగిస్తున్నారని స్పష్టం చేశారు.


140 కోట్ల మంది దేశ ప్రజలు మోదీ కుటుంబ సభ్యులేనని, ఇదే నా ఎన్నికల నినాదమని మోదీ ప్రకటించారు. మోదీని దేశమంతా తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని, కాంగ్రెస్, ఇండియా కూటమి వాళ్లకు ఆ విషయం ఇంకా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలంతా నేను మోదీ కుటుంబమని చెబుతున్నారంటూ సభికులతో నేను మోదీ కుటుంబం అంటు చెప్పించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు కేటాయించిందని, మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకుల కల నెరవేర్చడంలో తీవ్రంగా కృషి చేస్తోందని చెప్పారు. యువత కలలను నిజం చేయడమే నా సంకల్పమన్నారు. కుటుంబ వాదులు దేశ రాజకీయాల్లో యువతను ఎదగనీయడంలేదన్నారు.


తెలంగాణ అభివృద్ధిని రెట్టింపు చేస్తా


తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ఫ్రేమ, ఆదరణనరు వృధా కానివ్వనని, తెలంగాణ అభివృద్ధిని రెండింతలుగా చేసి చూపిస్తానని మోడీ పేర్కోన్నారు. ఇది మోడీ గ్యారెంటీ, మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ అన్నారు. మనమంతా కలిసి దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలన్నారు. ప్రపంచంలో తెలుగు వారి ఖ్యాతి వ్యాప్తిచెందిందని, ఇది దేశానికి మీకు గర్వకారణమన్నారు. మోడీ గ్యారంటీ మేరకు కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పి చేశామని, అయోధ్య రాముడికి భవ్య నూతన రామమందిరం నిర్మిస్తామని, బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట చేస్తామని చెప్పి చేశామన్నారు.


ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దేశంగా భారత్ ఎదుగుతోందని, ఇప్పుడు మీకు మరో గ్యారెంటీ ఇస్తున్నానని, కొన్నేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ను తీర్చిదిద్దుతామని, మీకు మాటిస్తున్నానని, ఇది మోడీ గ్యారెంటీ అని, అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ అని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న దానితో పోల్చుకుంటే, ఈ పదేండ్లలో దళిత, వెనుకబడిన వర్గాల ప్రజల కోసం పదేళ్లలో ఎంతో చేశామన్నారు. తెలంగాణకు గతంలో వచ్చిన సందర్భంలో నేను మాదిగల రిజర్వేషన్ సమస్యపై గ్యారంటీ ఇచ్చానని, మాదిగ రిజర్వేషన్ల కోసం ఒక హై లెవల్ కమిటీని వేశామని, వారి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని గుర్తు చేశారు.



బీఆరెస్‌-కాంగ్రెస్‌ల మధ్య అవినీతి బంధం


కాంగ్రెస్, బీఆరెస్ పార్టీల మధ్య అవినీతి బంధం ఉందని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, నాణానికి రెండు ముఖాల వంటివని మోదీ విమర్శించారు. తెలంగాణలో బీఆరెస్ అవినీతి కారణంగా కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారన్నారు. ఇప్పుడు బీఆరెస్ చేసిన కాళేశ్వరం వేలకోట్ల అవినీతిని బయటపెట్టకుండా, విచారణకు ఆదేశించకుండా కాంగ్రెస్ కాపాడే ప్రయత్నం చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. వారి మధ్య అవినీతి బంధాన్ని కాపాడుకునేందుకు బీఆరెస్‌ అవినీతిని కాంగ్రెస్‌ కప్పిపుచ్చుతోందన్నారు. అది ఎక్కువ రోజులు నిలవదని, కాళేశ్వరం బీఆరెస్‌కు ఏటీఎంలా మారిందన్నారు.


అయితే కాంగ్రెస్ ఎన్ని రోజులు బీఆరెస్‌ అవినీతిని కప్పిపుచ్చుతోందో చూస్తామని, సర్జికల్ స్ట్రైక్ చేయడం చూశారని, ఎయిర్ స్ట్రైక్ చేయడం కూడా తెలుసని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేకీ ఆప్ కీ బార్ మోదీ సర్కార్ కోసం 400సీట్లు దాటాలని, అందుకు మీరంతా బీజేపీకి ఓటు వేయాలంటూ మోడీ తెలుగులోనే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాల ఎండలో మీరు నాకోసం వచ్చారని, మీ ఆశీర్వదాలు వృధా కానివ్వనని, వికసిత భారత్ నిర్మాణానికి పనిచేస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని, భారత్ ప్రపంచానికి ఆశా కిరణంలా మారిందన్నారు. భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేరుస్తామన్నారు.