మోదీ విమర్శల వెనుక..!

- బీజేపీ,బీఆరెస్ కలిసి లేదని చెప్పుకునే ప్రయత్నం
- ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే
- కాంగ్రెస్ గ్రాఫ్‌కు అడ్డుకట్ట వేయడానికే
విధాత, హైదరాబాద్: ఇందూరు సభలో ప్రధాన మంత్రి మోదీ సీఎం కేసీఆర్ విమర్శలపై రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది. మూడు రోజులలో రెండు సార్లు ప్రధాని తెలంగాణకు వెనుక ఉన్న ఆంతర్యంపై అనేక సందేహాలు వెలువడుతున్నాయి. బీఆరెస్ అధినేత కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య రసహ్య అవగాహన కుదింరిందని, అందుకే లిక్కర్ స్కామ్ కేసులో కవిత జోలికి వెళ్లడం లేదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
దీంతో బీజేపీ, బీఆరెస్ ఒక్కటేనన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో ఏర్పడింది. అప్పటి వరకు రాష్ట్రంలో బీఆరెస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని భావించిన కాంగ్రెస్, బీఆరెస్‌లకు చెందిన నేతలు చాలా మంది బీజేపీలో చేరారు. కానీ ఆతరువాత ఈ రెండు పార్టీలు ఒక్కటే అని భావించడంలో బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో పాలపొంగులా మారింది. బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.
కేసీఆర్‌ను ఓడించడం కోసం బీజేపీలో చేరిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. అలాగే బీఆరెస్‌లో ఉన్న బలమైన నేతలంతా బీజేపీని కాదని కాంగ్రెస్‌లో చే రారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం హన్మంతుడి మాదిరిగా పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికార బీఆరెస్‌కు సవాల్ విసిరింది. రాష్ట్రంలో బీఆరెస్‌ను ఎదిరించే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. అనేక సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీల ఓట్లర్లు కాంగ్రెస్ వెనుకాల ర్యాలీ అవుతున్నారన్న అభిప్రాయం బీజేపీ, బీఆరెస్‌లో ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చాలంటే ఏమి చేయాలన్నదానిపై తీవ్ర కసరత్తు చేసిన బీజేపీ కావాలని బీఆరెస్‌పై ఘాటు విమర్శలకు దిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే పార్టీ నుంచి వలసలను అరికట్టాలన్నాఈ మేరకు విమర్శలు చేయాలని భావించిన బీజేపీ అధిష్టానం ఈ మేరకు చర్యలకు దిగిందన్న చర్చ కూడా రాజకీయ పరిశీలకుల్లో జరుగుతోంది.
పరోక్షంగా బీఆరెస్‌కు మేలు చేసేందుకేనా..?
కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాని మోదీ 20 సార్లు వెళ్లి సభలు పెట్టినా కన్నడిగులు కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. దీంతో దేశంలో మోదీపై బ్రమలు తొలగిపోయాయి. కర్నాటక ఎన్నికల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడం మొదలైంది. తెలంగాణలో ఖతమైందనుకున్న కాంగ్రెస్ లేచి నిలబడడంతో బీజేపీ, బీఆరెస్‌లో కలవరం మొదలైంది.
దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉండకూదని భావించిన మోదీకి ఇది మింగుడు పడని విషయంగా మారింది. ఇదే అదనుగా భావించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌ను బూచిగా చూపించి బీజేపీకి దగ్గరైనట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో లిక్కర్ స్కామ్ కేసు విచారణ నత్తను తలపించే విధంగా కొనసాగడంతో అనేక అనుమానాలకు తావిచ్చింది.
కేసీఆర్‌పై కోపంతో బీజేపీలో చేరిన నేతలకే ఈ విషయంలో అనుమానాలు వచ్చాయి. అప్పటి వరకు కవిత అరెస్ట్ తప్పక జరుగుతుందని భావించిన రాజకీయ పరిశీలకుల అంచనాలు తలకిందులయ్యాయి. కవిత అరెస్ట్ కాకపోవడంతో బీఆరెస్, బీజేపీ ఒక్కటేనన్న అభిప్రాయం సాధారణ ప్రజల దాక వెళ్లింది. దీంతో అనూహ్యంగా కాంగ్రెస్ బలపడింది. బీఆరెస్‌కు బలమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనన్న అభిప్రాయం సాధారణ ప్రజల్లోకి వెళ్లింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.
దీంతో బీజేపీ అగ్ర నాయకత్వం కలవరానికి గురైంది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతీయ పార్టీ గెలిచినా ఫర్వాలేదు కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రావద్దన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అగ్ర నాయకత్వం ఆపరేషన్ తెలంగాణ మొదలు పెట్టిందన్న చర్చ రాజకీయ పరిశీలకుల్లో జరుగుతోంది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆరెస్ గెలిస్తే 2024 పార్లమెంటు ఎన్నికల తరువాత అవసరానికి మద్దతు ఇస్తారని భావించింది.
గతంలో కూడా బీజేపీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన పలు కీలక బిల్లులకు బీఆరెస్ మద్దతు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తదితర బిల్లులకు మద్దతు ఇచ్చిన విషయాన్నిగుర్తు చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో తాము అధికారంలోకి రాకపోయినా ఫర్వాలేదు కానీ కాంగ్రెస్ మాత్రం రావద్దని బీజేపీ బలంగా కోరుకుంటోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఓట్ల చీల్చడం ద్వారా
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెస్ కు గంగుత్తగా పడకుండా ఉండేందుకు బీజేపీ భారీ స్కెచ్ వేసిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో ఏర్పడింది. ఇందులో భాగంగానే బీఆరెస్ అధినేత కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడి తీవ్రతరం చేశారు. అందుకే ప్రధాని మోదీ స్వయంగా మూడు రోజుల వ్యవధిలో రెండు సభలు పెట్టి విమర్శలు చేశారని అంటున్నారు. బీఆరెస్‌తో తమకు ఉన్నది శత్రుత్వమేనని తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇలా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా పరోక్షంగా మూడవ సారి బీఆరెస్‌ను అధికారంలోకి తీసుకు రావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణతో పాటు ఇతర నాలుగు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్న నేపథ్యంలో కనీసం తెలంగాణలోనైనా కాంగ్రెస్‌ను కట్టడి చేసి తన 10 ఏళ్ల రాజకీయ మిత్రుడు కేసీఆర్‌ను గెలిపించాలన్న లక్ష్యంతోనే ఈ విమర్శలు చేస్తున్నాడని అంటున్నారు. – ఆసరి రాజు
బీఆర్ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధం.. రేవంత్
బీఆర్ఎస్ , బీజేపీ ఫెవికాల్ బంధమని, కాంగ్రెస్ మొదటి నుండి చెబుతున్న నిజం ఇదేనని మరోసారి రుజువైందని పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ట్విట్ చేశారు. కేసీఆర్ ఎన్డీఏ పంచన చేరాలనుకున్నదని నిజమన్నారు. ప్రధాని మోడీ ఆశీస్సులతో కేటీఆర్ ను సీఎం చేయాలనుకున్నది నిజమన్నారు. ఇప్పటికీ మోడీ – కేసీఆర్ చీకటి మిత్రులే అన్నది పచ్చినిజమని పేర్కొన్నారు. నిజం నిప్పులాంటిదని.. ఇదిగో ఇట్లా నిలకడ మీదైనా నిగ్గు తేలాల్సిందేనన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్.. రెండు ఒక్కటే: మాజీ మంత్రి శ్రీధర్ బాబు
బీజేపీ,బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నామని మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. ఈ రోజు మోదీ అన్నాడు బీఆర్ఎస్ మాకు సపోర్ట్ చేసింది అన్నారన్నారు. కర్ణాటక లోజేడీఎస్ కు బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందని తెలిపారు. కర్ణాటక లో ఎన్నికలు అయిపోగానే బీజేపీ తో జేడీఎస్ కలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడుతున్నారన్నారు. ఇక్కడ కూడా ఎన్నికలు అయిపోగానే బీఆర్ఎస్ , బీజేపీ కలిసిపోతాయన్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ డ్రామా ఆడుతున్నాయన్నారు.