సోనియాగాంధీకి ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుక‌ల‌ను కాంగ్రెస్ శ్రేణులు శ‌నివారం దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌స్తున్నాయి

సోనియాగాంధీకి ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు
  • దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా సోనియా బ‌ర్త్ డే వేడుక‌లు
  • ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ముఖులు



విధాత‌: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 77వ జన్మదిన వేడుక‌ల‌ను కాంగ్రెస్ శ్రేణులు శ‌నివారం దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌స్తున్నాయి. సోనియా బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు జ‌న్మ‌దిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్య‌వంత‌మైన జీవితం గ‌డ‌పాల‌ని ప్రార్థించారు.


ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ నేత శ‌శిథ‌రూర్‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ ఇత‌ర ప్ర‌ముఖులు సోనియాగాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియజేశారు.


“అట్టడుగు వర్గాల హక్కుల కోసం శ్ర‌మిస్తున్న న్యాయ‌వాది సోనియాగాంధీ. ఆమె ధైర్యం, ధైర్యసాహసాలు, నిస్వార్థ త్యాగంతో కష్టాలను ఎదుర్కొంటూ అత్యంత దయకు చిహ్నంగా ఉన్నారు. ఆమె ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని కోరుకుంటున్నాను”అని కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్‌చేశారు.


“ఆమె జీవిత ప్రయాణం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆమె ఎంతో సంయమనంతో అత్యంత సవాళ్లతో కూడిన కాలంలో కాంగ్రెస్‌ను నడిపించారు. అందరికీ సంక్షేమాన్ని అందించి, దేశానికి విపరీతమైన అభివృద్ధిని అందించిన యూపీఏ ప్రభుత్వ రూపశిల్పి,” అని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.


గాంధీభ‌వ‌న్‌లో 78 కిలోల కేక్ క‌ట్‌


ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ 77వ పుట్టిన రోజు సంద‌ర్భంగా శ‌నివారం హైదరాబాద్‌లోని గాంధీభ‌వ‌న్‌లో 78 కిలోల కేక్‌ను కాంగ్రెస్ నాయ‌కులు క‌ట్‌చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఇత‌ర మంత్రుల‌తోపాటు సీనియ‌ర్ నేత‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.