క‌జిరంగలో.. ఏనుగుపై ప్ర‌ధాని మోదీ స‌ఫారీ.. 1957

అసోంలోని క‌జిరంగ నేష‌న‌ల్ పార్కులో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏనుగుపై స‌ఫారీ చేశారు. యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ ప్ర‌దేశంగా గుర్తింపు పొందిన ఈ పార్కులో మోదీ శ‌నివారం ఉద‌యం ప‌ర్య‌టించారు

క‌జిరంగలో.. ఏనుగుపై ప్ర‌ధాని మోదీ స‌ఫారీ.. 1957

విధాత‌: అసోంలోని క‌జిరంగ నేష‌న‌ల్ పార్కులో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏనుగుపై స‌ఫారీ చేశారు. యునెస్కో ప్ర‌పంచ వార‌స‌త్వ ప్ర‌దేశంగా గుర్తింపు పొందిన ఈ పార్కులో మోదీ శ‌నివారం ఉద‌యం ప‌ర్య‌టించారు. 1957 త‌ర్వాత ఈ పార్కును సంద‌ర్శించిన తొలి ప్ర‌ధాని మోదీనే కావ‌డం విశేషం.


రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం శుక్ర‌వారం సాయంత్రం మోదీ అసోంలోని తేజ్‌పుర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్క‌డ్నుంచి ప్ర‌త్యేక చాప‌ర్‌లో గోలాఘాట్ జిల్లాలోని క‌జిరంగ నేష‌న‌ల్ పార్కుకు వ‌చ్చారు. నిన్న రాత్రి పార్కులోనే ఆయ‌న సేద తీరారు. ఇక శ‌నివారం తెల్ల‌వారుజామున అభ‌యార‌ణ్యంలోని సెంట్ర‌ల్ కొహోరా రేంజ్‌ను మోదీ సంద‌ర్శించారు. తొలుత ఏనుగు ఎక్కి విహ‌రించిన మోదీ.. ఆ త‌ర్వాత ఫారెస్టు జీపులో స‌ఫారీ చేశారు.


స‌ఫారీ చేసిన అనంత‌రం ఏనుగుల‌కు మోదీ చెరుకు గ‌డ‌ల‌ను తినిపించారు. ఈ సంద‌ర్భంగా అర‌ణ్యంలోని ప్ర‌కృతి అందాల‌ను, జంతువుల చిత్రాల‌ను కెమెరాలో బంధించారు మోదీ. మ‌హిళా ఫారెస్ట్ గార్డుల‌తో మోదీ ముచ్చ‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన చిత్రాల‌ను మోదీ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.