ఇంటి నుంచి గెంటేసిన కూతురు.. చేర‌దీసి ఇల్లు క‌ట్టించిన‌ పోలీసులు

బ‌స్టాండ్ షెడ్‌లో నివాసం.. చ‌లించిన ఎల్క‌తుర్తి పోలీసులు స్థానికులు, గ్రామస్తుల సహకారంతో ఇంటి నిర్మాణం ఇంకా లక్షన్నర ఆర్థిక సహాయం క‌న్నీటితో కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన వృద్ధురాలు విధాత, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: పోలీసులంటే సాధారణంగా సమాజంలో నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది. కరకు హృదయమని విమర్శలుంటాయి. దీనికి భిన్నంగా పోలీసులు మానవీయతను చాటుకున్నప్పుడు సహజంగానే చర్చనీయాంశంగా మారుతుంది. కన్న కూతురి చేతిలో దగాపడి బస్టాండ్లో ఆశ్రయం పొందుతున్న వృద్ధురాలికి ఇంటిని నిర్మించి ఇచ్చి తమ పెద్ద […]

  • By: krs    latest    Jan 11, 2023 1:40 PM IST
ఇంటి నుంచి గెంటేసిన కూతురు.. చేర‌దీసి ఇల్లు క‌ట్టించిన‌ పోలీసులు
  • బ‌స్టాండ్ షెడ్‌లో నివాసం.. చ‌లించిన ఎల్క‌తుర్తి పోలీసులు
  • స్థానికులు, గ్రామస్తుల సహకారంతో ఇంటి నిర్మాణం
  • ఇంకా లక్షన్నర ఆర్థిక సహాయం
  • క‌న్నీటితో కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన వృద్ధురాలు

విధాత, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక ప్రతినిధి: పోలీసులంటే సాధారణంగా సమాజంలో నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది. కరకు హృదయమని విమర్శలుంటాయి. దీనికి భిన్నంగా పోలీసులు మానవీయతను చాటుకున్నప్పుడు సహజంగానే చర్చనీయాంశంగా మారుతుంది. కన్న కూతురి చేతిలో దగాపడి బస్టాండ్లో ఆశ్రయం పొందుతున్న వృద్ధురాలికి ఇంటిని నిర్మించి ఇచ్చి తమ పెద్ద మనస్సును చాటుకున్నారు ఎల్కతుర్తి పోలీసులు.

వివరాల్లోకి వెళితే ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన ఏడుపదుల వృద్ధురాలైన గొర్రె మార్తా కడుపు మాడ్చుకుని కూడబెట్టిన ఆస్తులన్నీ తన వృద్ధాప్యంలో తోడు ఉంటుందనుకొని హనుమకొండలో నివాసం ఉంటున్న ఒక్కగానొక్క కూతురికి ధారాదత్తం చేసింది.

ముందుగా తాత్కాలిక గృహంలో ఆశ్రయం

ఆస్తులు చేజిక్కించుకున్న కుమార్తె తల్లిని చితకబాది తన ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. దిక్కుతోచని ఆ వృద్ధురాలు తన స్వగ్రామంలోని బస్టాండ్ షెడ్‌ను ఆశ్రయించింది. ఈ విషయం పలు పత్రికల్లో కథనాలు వెలువడటంతో స్పందించిన ఎల్కతుర్తి పోలీసులు కాజీపేట్ ఏసిపి శ్రీనివాస్ పిలుపునందుకొని బస్టాండ్ షెడ్ లో ఆశ్రయం పొందుతున్న వృద్ధురాలిని చేరదీశారు.

ఎల్కతుర్తి పోలీసులు ముందుగా వృద్ధురాలికి వైద్యం అందించి అదే గ్రామంలో తాత్కాలిక గృహంలో ఆశ్రయం కల్పించారు. నిత్యావసర వస్తువులతో పాటు కొంత డబ్బును అందజేసారు.

మాట నిలబెట్టుకున్న పోలీసులు

సహాయంతో తమ బాధ్యత తీరిపోదని గుర్తించిన ఏల్కతుర్తి పోలీసులు దగా పడిన మాతృమూర్తికి ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కేవలం హామీకే పరిమితం కాకుండా పోలీసులు దాత అందించిన స్థలంలో ఎల్కతుర్తి పోలీసులతో పాటు కాజీపేట డివిజన్ కు చెందిన పోలీసులు, స్థానిక గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సహ‌కారంతో యుద్ధప్రాతిపదికన‌ సకల సౌకర్యాలతో ఇంటి నిర్మాణం పూర్తి చేసారు.

వృద్ధురాలి నూతన గృహప్రవేశం

దగా పడిన వృద్ధురాలికి ఎల్కతుర్తి పోలీసులు నిర్మించిన ఇంటిని బుధవారం సెంట్రల్ జోన్ డిసిపి. అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ముందుగా నూతనంగా నిర్మించిన ఇంటిలోకి గృహప్రవేశం చేసింది.

కన్నీటితో కృతజ్ఞతలు

ఈ సందర్భంగా తన నివాసం కోసం తన బిడ్డలాగా ముందుకు వచ్చి తనకు ఇంటిని నిర్మించి ఇచ్చిన పోలీసులకు మార్తా కన్నీటితో కృతజ్ఞతలు తెలియచేసుకుంది. అనంతరం డిసిపి చేతుల మీదుగా లక్షన్నర రూపాయల ఆర్థిక సాయాన్ని వృద్ధురాలికి అందజేశారు.

కార్యక్రమములో కాజీపేట ఎసిపి శ్రీనివాస్, ఎల్కతర్తి సర్కిల్ ఇన్‌స్ప‌క్టర్ శ్రీనివాస్, ధర్మసాగర్ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎల్కతుర్తి, భీందేవరపల్లి, వంగర ఎస్.ఐలు పరమేశ్వర్, ప్రవీణ్ కుమార్, మౌనిక గ్రామ సర్పంచ్ రమాదేవి, యం.పి.టి.సి రమా, ఇతర పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గోన్నారు.