30 మంది ఎమ్మెల్యేలపై రహస్య సర్వే..!

సర్వే చేయిస్తున్న ఆ పార్టీ కీలక నేత విధాత: రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు సన్నద్దమౌతున్నాయి. అధికారం మాదే అంటే మాదే అని లెక్కలు వేసుకుంటూ.. ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రతి నియోజకవర్గంలో అన్ని పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయట. ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ పార్టీ బలహీనంగా ఉన్నదో ప్రతి నెలా సర్వే నివేదికలు తెప్పించుకుంటు న్నారట. అధికార పార్టీలో సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తుంటార […]

30 మంది ఎమ్మెల్యేలపై రహస్య సర్వే..!
  • సర్వే చేయిస్తున్న ఆ పార్టీ కీలక నేత

విధాత: రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు సన్నద్దమౌతున్నాయి. అధికారం మాదే అంటే మాదే అని లెక్కలు వేసుకుంటూ.. ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ప్రతి నియోజకవర్గంలో అన్ని పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నాయట.

ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ పార్టీ బలహీనంగా ఉన్నదో ప్రతి నెలా సర్వే నివేదికలు తెప్పించుకుంటు న్నారట. అధికార పార్టీలో సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తుంటార నేది అందరికీ తెలిసిందే.

అయితే అధికార పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి.. గెలిచిన ఓ 30 మంది ఎమ్మెల్యేలపై ఆ పార్టీకే చెందిన నెంబర్‌ 2గా పిలవబడుతున్న కీలక నేత రహస్య సర్వే చేయిస్తున్నారా? అంటు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆయన వారిపై 3-4సార్లు సర్వే చేయించినట్లు సమాచారం. ఈటల రాజేందర్‌ ఎపీసోడ్‌ తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి కీలక నేతలు కాషాయ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ అదేమీ జరగలేదు.

రాష్ట్రంలో ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీలో కమిటీ చిచ్చు రగులుతుంది.. మ‌రో వైపు బీజేపీలో సంజయ్‌ వర్గం ఆధిపత్య పోరుతో అధికార పార్టీ నుంచి ఆ పార్టీ చేరిన నేతలకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని చర్చ జరుగుతూనే ఉంది. ఇక అధికార పార్టీలో కొంతమందిపై ప్రత్యేక సర్వే చేయిస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ‌లు గుప్పుమంటున్నాయి.

ఇందులో వాస్తవం ఎలా ఉన్నా.. వైసీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాలేరు నుంచే తాను పోటీ చేస్తానని ఆశ్వీర్వదించాలని ప్రజలను కోరారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర్‌ రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అడుగులు ఎటువైపు అన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు.

అలాగే అధికారపార్టీలో టికెట్లు దక్కని, తగిన ప్రాధాన్యం దక్కని నేతలు బీజేపీలో చేరినా.. పార్టీ గెలుపు కోసం పనిచేయాలని, ఆ తర్వాత వారి పనితీరు ఆధారంగా పదవులు కట్టబెడుతామని ఆ మధ్య ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్‌ బన్సల్‌ బాంబు పేల్చారు. అప్పటి నుంచి చాలామంది నేతలు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు.

ఎందుకంటే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో ఎన్నికలకు ముందు ఆలోచిస్తానని ప్రధానిని కలిసిన తర్వాత చెప్పారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీలో కమిటీలపై ఇప్పటికే కొండా సురేఖ, భట్టి విక్రమార్క, దామోదర నర్సింహా బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.

తాజాగా శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డిలు ఈ విషయంపై భట్టీతో సమావేశమయ్యారు. అలాగే బీజేపీలో కరీంనగర్‌లో ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా వెలిసిన ఫ్లెక్సీల్లో ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు స్పష్టమయ్యాయి. విజయశాంతి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

వీటన్నింటి నేపథ్యంలో ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కీలక నేత చేయిస్తున్న సర్వేలో 30 మంది జాబితాలో ఎవరెవరు ఉన్నారు? వాళ్లు పోటీ చేస్తారా? అందులో అన్నిపార్టీలకు చెందిన నేతలు ఉంటే వారి పార్టీలను ధిక్కరించి బరిలో నిలుస్తారా? అలా పోటీ చేసే వాళ్లలో ఎంత మంది గెలుస్తారు? రాష్ట్రంలో మూడు పార్టీల పోరులో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే.. వీళ్లు ఎటువైపు మొగ్గుచూపుతారు? అనే అంశాలు కీలకం కానున్నాయి.