ఐటీ, AI హ‌బ్‌గా వైజాగ్ మారనుందా!

విశాఖపట్నంలో ఆదివారం 5000 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులు, వైజాగ్‌లోని యువకుల సమ్మేళనానికి పల్సస్ సీఈవో డాక్ట‌ర్ గేదెల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు

  • By: Somu    latest    Dec 18, 2023 11:12 AM IST
ఐటీ, AI హ‌బ్‌గా వైజాగ్ మారనుందా!
  • ప‌ల్స‌స్ ఆధ్వ‌ర్యంలో విశాఖ కేంద్రంగా విశేష కృషి
  • ప‌ల్స‌స్ సీఈవో డాక్ట‌ర్ గేదెల శ్రీనుబాబు ప్ర‌త్యేక ప్ర‌సంగం


విధాత‌: విశాఖపట్నంలో ఆదివారం 5000 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులు, వైజాగ్‌లోని యువకుల సమ్మేళనానికి పల్సస్ సీఈవో డాక్ట‌ర్ గేదెల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. విశాఖపట్నంను గ్లోబల్ ఐటీ, AI హ‌బ్‌గా వైజాగ్ హబ్‌గా మార్చేందుకు ఒక ట్రాన్స్‌ఫార్మింగ్ విజ‌న్ ఆవిష్కరించారు.


ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవ‌కాశాలపై, పెట్టుబ‌డులు, ఉత్ప‌త్తులు, సేవ‌లు గురించి అధ్య‌య‌నం చేస్తూ… స్థానిక వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచీకరణ అందించిన అవకాశాలను అందుకుని, గ్లోబ‌ల్ క‌నెక్టివిటీని పెట్టుబడిగా తీసుకున్న మొదటి తరం పారిశ్రామిక‌వేత్త‌లైన‌ నేటి బిలియనీర్ల అడుగుజాడల్లో నడవాలని యువ‌త‌కి సూచించారు.


నిపుణులైన యువ‌త వ‌ల‌స పోవ‌డాన్ని నిరోధించాలి


స్థానిక ఉపాధి కల్పన ల‌క్ష్యంగా వైజాగ్ యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మేథో వ‌ల‌స‌ల్ని నిరోధించ‌డంపై త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మేధోవ‌ల‌స‌లు వ‌ల్ల జ‌రిగే న‌ష్టాలు వివ‌రించారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని వ‌ల‌స పోకుండా ఉంచేందుకు స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టించడ‌మే మార్గ‌మ‌న్నారు.


ఆంధ్రప్రదేశ్ లో సహజ వనరులకు దీటుగా మానవ వనరులు ఉన్నాయి, వాటిని సవ్యంగా వినియోగించటం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి ఏడాది ఉద్బవిస్తున్న 5 లక్షల మంది గ్రాడ్యూట్స్, పోస్టుగ్రాడ్యుట్లలో కనీసం 70% మందికి మందికి ఉపాధి నిచ్చి మేధోవలసలు తగ్గించవచ్చు అని గేదెల శ్రీనుబాబు చెప్పారు


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైజాగ్లో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో, ఎంట్రప్రెన్యూర్షిప్ అవకాశాలు కల్పనలో పల్సస్ పాత్రను వివ‌రించారు. ఐటీ, AI సాఫ్ట్‌వేర్ రంగాలలో ఉద్యోగాల కల్పనలో కంపెనీ గణనీయమైన కృషిని శ్రీనుబాబు నొక్కిచెప్పారు. ఐదేళ్ల‌లో పల్సస్ ఉత్త‌రాంధ్ర యువ‌త‌కి ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించింద‌న్నారు.


ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, డిజిటల్ మార్కెటింగ్‌లో కంపెనీలను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి సారించ‌డం ద్వారా వైజాగ్ ప్రముఖ టెక్ AI హబ్‌గా రూపొందించేందుకు పల్సస్ చేస్తున్న కృషిని శ్రీనుబాబు వివరించారు. నగరంలో ఉన్న అపారమైన అవకాశాలు, మౌలిక స‌దుపాయాలు ఉప‌యోగించుకోవాల‌ని ప్రపంచ కంపెనీలను ఆయ‌న ఆహ్వానించారు.


G20 టెక్, హెల్త్, అండ్ ఫార్మా సమ్మిట్స్: G20 గ్లోబల్ టెక్ సమ్మిట్ సిరీస్, హెల్త్ సమ్మిట్ సిరీస్, ఫార్మా సమ్మిట్ సిరీస్ లు విశాఖ కేంద్రంగా నిర్వ‌హించ‌డం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విశాఖ బ్రాండ్ ని ప్ర‌ముఖంగా ప్ర‌చారం చేయ‌గ‌లిగామ‌ని, ఈ జ‌ర్నీలో పల్సస్ కృషిని శ్రీనుబాబు వివ‌రించారు. ఈ శిఖరాగ్ర సమావేశాలు ఆర్థికాభివృద్ధిలో రాష్ట్ర సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు, విశాఖలో అవ‌కాశాల‌ను ప్రపంచ దృష్టిని ఆక‌ర్షించి పెట్టుబడులు పెట్టించేందుకు దోహ‌ద‌ప‌డ్డాయ‌న్నారు.


గ్రాడ్యుయేట్ల నుండి ప్రపంచ పారిశ్రామికవేత్తలుగా ఎద‌గాలి: గ్రాడ్యుయేట్లు త‌మ రంగాల్లో నిపుణులుగా ఎద‌గ‌డ‌మే కాకుండా, భవిష్యత్ ప్రపంచ పారిశ్రామికవేత్తలుగా త‌యారై ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే కీల‌క‌శ‌క్తులు కావాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ఆడారి ఆనంద్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీధర్, కార్పొరేటర్ ఉషశ్రీ , 100 పైగా పారిశ్రామిక వేత్తలు వేలమంది విద్యార్థులు పాల్గన్నారు.