Raghuram Rajan | రాజ్యసభకు రఘురాం రాజన్? ఏ రాష్ట్రం నుంచి అంటే?
ప్రఖ్యాత ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ రాజ్యసభకు పోటీ చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది

Raghuram Rajan | ముంబై : ప్రఖ్యాత ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ రాజ్యసభకు పోటీ చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక ఏ రాష్ట్రం నుంచి అంటే.. మహారాష్ట్ర నుంచి బరిలో దిగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జనవరి 31వ తేదీన రఘురాం రాజన్.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ముంబైలో సమావేశమయ్యారు. ఈ సమావేశమే రాజన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తారనే ప్రచారానికి బలం చేకూరుస్తోంది. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ లేదా మహారాష్ట్ర వికాస్ అఘాడీ(MVA) అభ్యర్థిగా రఘురాం రాజన్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మహారాష్ట్ర నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికైన ప్రకాశ్ జవదేవకర్, అనిల్ దేశాయి, కుమార్ కేట్కర్, వీ మురళీధరన్, నారాయణ్ రానే, వందనా చవాన్ పదవీ కాలం ఏప్రిల్ 2వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
మరి రాజన్‌కు బలం ఉందా..?
మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ లేదా మహావికాస్ అఘాడీ తరపున రాజన్ పోటీ చేస్తే ఆయనకు బలం సరిపోతుందా..? అనే అంశాన్ని పరిశీలిద్దాం. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీకి 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 42 మంది ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక మహావికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్‌కు 44, శివసేన(యూబీటీ)కు 16, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
అయితే రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి కనీసం 42 ఓట్లు పొందాలి. ఈ ప్రకారం బీజేపీ ముగ్గురు సభ్యులను సునాయసంగా గెలిపించుకుంటుంది. ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఎమ్మెల్యేలు కలిస్తే మరో అభ్యర్థి గెలవనున్నారు. మహావికాస్ అఘాడీ కూటమి తరపున ఒక అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మహావికాస్ అఘాడీ తరపున రఘురాం రాజన్‌ను పోటీ చేయించి, గెలిపించుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.