మోడీ, కేసీఆర్ కలిసి పని చేస్తున్నారు: రాహుల్ గాంధీ
మోడీ తెచ్చే చట్టాలకు కేసీఆర్ మద్దతు పేదల సొమ్ము దోచి పెట్టడమే వారి పని కేసీఆర్ గుంజుకున్న భూములను తాము అధికారంలోకి రాగానే తిరిగి ఇస్తాం తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పని చేస్తున్నారు తెలంగాణలో జోడో యాత్ర ముగింపు సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్, విధాత: మోడీ, కేసీఆర్‌లు కలిసి పనిచేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చినా కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. […]

- మోడీ తెచ్చే చట్టాలకు కేసీఆర్ మద్దతు
- పేదల సొమ్ము దోచి పెట్టడమే వారి పని
- కేసీఆర్ గుంజుకున్న భూములను తాము అధికారంలోకి రాగానే తిరిగి ఇస్తాం
- తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పని చేస్తున్నారు
- తెలంగాణలో జోడో యాత్ర ముగింపు సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
హైదరాబాద్, విధాత: మోడీ, కేసీఆర్‌లు కలిసి పనిచేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. మోదీ ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చినా కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. బీజేపీ, టీఆర్‌ఎస్ ఒక్కటేనని, పేదల సొమ్ము పెద్దలకు దోచి పెట్టడమే వారి పని అన్నారు. మోదీ ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేస్తున్నారని, కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకుంటున్నారని తెలిపారు.
ఈ ఇద్దరి చర్యలతో రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. కేసీఆర్‌కు ప్రాజెక్టులపై కమీషన్లు, ధరణి భూములపైనే ధ్యాసని అన్నారు. కొంత మందికి లాభం చేకూర్చేందుకే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వీరు తమ పాలనతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించారన్నారు. విద్వేషం, హింసను సమాజంలో వ్యాపించేలా చేస్తున్నారన్నారు. విద్వేషానికి వ్యతిరేకంగా ఈ భారత్ జోడో యాత్ర చేపట్టానని రాహుల్ తెలిపారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా కామారెడ్డి జిల్లా మేనూర్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. రాహుల్ గాంధీ సభలో పాల్గొనడానికి ప్రజలు స్వచ్ఛందంగా కదలి వచ్చారు. మేనూర్‌లో జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంతోమందిని కలిసి సమస్యలు తెలుసు కున్నానన్నారు. తెలంగాణను విడిచి వెళ్లడం కొంత బాధగా ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిఇచ్చారు. చేతులు, కాళ్ళు విరిగినా కార్యకర్తలు తమ పనిని కొనసాగించడం అభినందనీయమన్నారు. మీరంతా ఏ కులానికో, మతానికో చెందిన వారు కాదని, అంతా భారతీయులేనని అన్నారు.
అన్ని వార్గాల వారిని కలిశా
తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, చేనేతతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు విన్నానని రాహుల్ గాంధీ తెలిపారు. మోదీ, కేసీఆర్‌ల పాలనలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని వారిని చూస్తే నాకు అర్ధమైందన్నారు. దెబ్బలు తగిలినా ప్రయత్నించే తత్వం తెలంగాణ సమాజానిదన్నారు. తెలంగాణ ప్రజల గొంతు వినాల్సిందేనన్నారు. ప్రజల గొంతును అణచివేయడం కుదరదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దేశం మీ నుంచి నేర్చుకునే అవకాశం ఉందన్నారు.
పేదవాడు అసుపత్రికి వెళ్లలేని పరిస్థితి
జబ్బు చేస్తే ఒక పేదవాడు ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి తెలంగాణలో ఉందని రాహుల్ అన్నారు. తెలంగాణలో ఆసుపత్రులు ప్రయివేటు పరమయ్యాయన్నారు.
ఉన్నత చదువులకు లక్షల ఖర్చు
పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందని రాహుల్ అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందన్నారు.
కాంగ్రెస్ భూములు పంచితే టీఆర్‌ఎస్ లాక్కుంటోంది
కాంగ్రెస్ హయాంలో ఇందిరా గాంధీ దళితులు,గిరిజనులకు లక్షలాది ఎకరాల భూములు పంచారని రాహుల్ గాంధీ తెలిపారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం దళిత,గిరిజనులకు పంచిన భూములను నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం లాక్కుంటోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం గుంజుకున్న భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో ఒక్క రైతు కూడా నేడు ఆనందంగా లేడని రాహుల్ అన్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చాక రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధరను కల్పిస్తామన్నారు. ధరణి పోర్టల్‌తో రైతులకు ఎలాంటి లాభం లేదన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్‌ఎస్ మద్దతు
మోడీ ప్రభుత్వం ఎలాంటి రైతు వ్యతిరేక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టినా టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని రాహుల్ అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు పార్లమెంటులో మద్దతు ఇవ్వడాన్ని రాహుల్ తప్పు పట్టారు. మోడీ చట్టం తీసుకువచ్చినా టీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. జీఎస్టీ ప్రభావంతో చిన్న తరహా పరిశ్రమలు మూతబడ్డాయన్నారు. దేశంలో యువతకు ఉపాధి కరువైందన్నారు. ప్రైవేటీకరణ ద్వారా భయాందోళన కలిగిస్తున్నారన్నారు. హింస, రక్తపాతం, రైతు చట్టాలకు వ్యతిరేకంగా తాను పాదయాత్ర చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు.
కేసీఆర్ అరాచక పాలనపై విద్యార్థులు ఎందుకు నడుం బిగిస్తలే:. రేవంత్ రెడ్డి
16 రోజుల పాటు తెలంగాణలో భారత్ జోడో యాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి అక్టోబర్23వ తేదీన ప్రవేశించింది. 16 రోజుల పాటు జోడోయాత్ర తెలంగాణలో సాగింది. నాలుగు రోజులు దీపావళి పర్వదినం సందర్భంగా విరామం ఇచ్చారు. మొత్తంగా 12 రోజులు పాదయాత్ర తెలంగాణలో జరిగింది. తెలంగాణలో కొనసాగిన జోడో యాత్ర 8 జిల్లాలు, 7 లోక్‌సభ స్థానాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడో యాత్ర సాగింది.
జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు జైరామ్ రమేశ్, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డితో సహా పలువురు నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. మేనూర్‌లో సభ ముగిసిన తరువాత జోడో యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించింది. మహారాష్ట్ర పీసీసీ నాయకత్వం రాహుల్ జోడో యాత్రను స్వాగతించి మహారాష్ట్రకు తోడ్కొని వెళ్లింది.