డెడ్‌బాడీని కొరికేసిన ఎలుకలు.. ఆస్పత్రి సిబ్బందిపై బంధువులు ఆగ్రహం
పోస్టుమార్టం గదిలో ఉంచిన ఓ డెడ్‌బాడీని ఎలుకలు కొరికేశాయి. దీంతో ఆస్పత్రి సిబ్బందిపై మృతుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

డెహ్రాడూన్ : పోస్టుమార్టం గదిలో ఉంచిన ఓ డెడ్‌బాడీని ఎలుకలు కొరికేశాయి. దీంతో ఆస్పత్రి సిబ్బందిపై మృతుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పౌరీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పౌరీకి చెందిన రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శుక్రవారం ఆకస్మాత్తుగా మరణించాడు. దీంతో ఆ ఉద్యోగి ఆకస్మిక మరణంపై ఆందోళనకు గురయ్యారు. అసలు అతని మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు, పోస్టుమార్టం నిర్వహించాలని కుటుంబ సభ్యులు వైద్యులను కోరారు.
ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో మృతదేహాన్ని భద్రపరిచారు. మరుసటి రోజు వరకు మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. ఈ ఘటనకు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమేనని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై పౌరీ అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేశ్ కుమార్ స్పందించారు. పోస్టుమార్టం గది తలుపులు ధ్వంసం అయ్యాయని, ఆ మరమ్మతులు చేసేందుకు కార్పెంటర్లు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. దీంతో ఎలుకలు లోపలికి ప్రవేశిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనతో శ్రీనగర్ నుంచి కార్పెంటర్లను పిలిపించి డోర్లను అమరుస్తామని తెలిపారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు.