ఇజ్రాయిల్ ఫోన్ ట్యాపింగ్ కిట్
తెలంగాణ ఎస్ఐబి కి రవిపాల్ టెక్నికల్ కన్సల్టెంట్ గా వ్యవహరించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రవిపాల్ కీలకంగా మారారు

- కేంద్రం అనుమతి లేకుండానే కొనుగోలు
- ఎస్ఐబి కన్సల్టెంట్ రవిపాల్ అరెస్టుకు రంగం సిద్ధం
విధాత, హైదరాబాద్: తెలంగాణ ఎస్ఐబి కి రవిపాల్ టెక్నికల్ కన్సల్టెంట్ గా వ్యవహరించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రవిపాల్ కీలకంగా మారారు. అతని అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ట్యాపింగ్ డివైస్ లను రవిపాల్ ద్వారా ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ప్రభాకర్ రావు ఆదేశంతోనే రవిపాల్ అధునాతన డివైస్లను దిగుమతి చేసుకున్నట్లు వెల్లడైంది. పోలీసు శాఖ కోసం కొనుగోలు చేస్తున్నామని చెప్పకుండా, ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ కోసమని కొనుగోలు చేయడం విశేషం.
మధ్యవర్తిగా వ్యవహరించిన రవిపాల్ కు ఎస్ఐబి నుంచి కోట్లాది రూపాయలు కమిషన్ చెల్లించారు.
300 మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలు నేరుగా వినబడే డివైస్ తెచ్చారు. జూబ్లిహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైస్ అమర్చారు. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు, రవిపాల్ లు విని బిఆరెస్ పెద్దలకు చేరవేసేవారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు రవిపాల్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నారు.
బెదిరించడం, బాండ్లు కొన్పించడం..
సస్పెండ్ అయిన డిఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు బృందం రియల్ ఎస్టేట్, ఫార్మా, సాఫ్ట్ వేర్ కంపెనీల యజమానుల ఫోన్లు ట్యాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వారి సంభాషణల ఆడియోలు బయటకు రాకుండా ఉండాలంటే బిఆరెస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయాలని బెదిరించేవారు. వీరితో పాటు ప్రతిపక్ష నేతలతో టచ్ లోకి వెళ్లిన వ్యాపారులను కూడా బెదిరించి ట్యాప్ చేసిన సంభాషణలు వారికి వినిపించి ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుకు ఒత్తిడి చేసినట్లు విచారణలో పోలీసులు తెలుసుకున్నారు.
సంభాషణలు విన్న పలువురు భీతిల్లి దిక్కులేని పరిస్థితుల్లో ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. మరికొందరు బాండ్ల బదులు బిఆరెస్ పెద్దలకు డబ్బులు ముట్టచెప్పారు. ఈ కాల్ రికార్డులు బయటకు రాకుండా ఉండేందుకు ప్రణీత్ రావు బృందానికి కూడా కోట్లాది రూపాయలు సమర్పించుకున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.